Share News

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికాకు తీవ్ర నష్టం.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రితేశ్

ABN , Publish Date - Oct 24 , 2026 | 07:53 PM

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కాలిఫోర్నియాలోని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రితేష్ టాండన్ తన సొంత పార్టీకి చెందిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. కాలిఫోర్నియాలో ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు ట్రంప్ విధానాలే కారణమని ఆయన ఆరోపించారు.

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికాకు తీవ్ర నష్టం.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రితేశ్

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో మధ్యంతర ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కాలిఫోర్నియాలోని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రితేష్ టాండన్ తన సొంత పార్టీకి చెందిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. కాలిఫోర్నియాలో ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు ట్రంప్ విధానాలే కారణమని ఆయన ఆరోపించారు. కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి ప్రతినిధుల సభకు టాండన్ పోటీ చేస్తున్నారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన ప్రస్తుత ఎంపీ రో ఖన్నా.. టాండన్ ప్రత్యర్థి. ఓ వార్తా సంస్థతో టాండన్ మాట్లాడారు. ట్రంప్ విధానాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిందని, వడ్డీ రేట్లు అధికమయ్యాయని, జీవన వ్యయం పెరిగిందని, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు.


ఏంటా సుంకాలు?

అమెరికా తన ప్రత్యర్థి దేశాలతో పాటు మిత్రదేశాలపైనా భారీ సుంకాలు విధించడాన్ని టాండన్ తప్పుబట్టారు. ‘ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ప్రస్తుతం బే ఏరియాలోనే కాకుండా అమెరికా అంతటా ధరలు బాగా పెరిగాయి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. గతంలో ఇల్లు కొనడానికి తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు 4 నుంచి 5 శాతం మధ్య ఉండేవి. ఇప్పుడు అవి 7.5 శాతానికి చేరాయి. గ్యాస్ ధరలు కూడా పెరిగాయి’ అని టాండన్ వ్యా్ఖ్యానించారు.


ఇరాన్‌తో యుద్ధం కరెక్ట్ కాదు..

ఇరాన్‌తో యుద్ధం ప్రారంభించడం వల్ల అమెరికాలో చమురు ధరలు పెరిగాయని, దాని ప్రభావం ఇతర వస్తువులపైనా పడిందని టాండన్ అన్నారు. ‘గతంలో డీజిల్ ధర 3 నుంచి 4 డాలర్ల మధ్య ఉండేది. ఇప్పుడు అది 8 నుంచి 9 డాలర్లకు చేరింది. డీజిల్ ధర పెరగడంతో సరుకుల రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. దాంతో అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అమెరికాలో రోజువారీ సంపాదనతో జీవిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’ అని టాండన్ పేర్కొన్నారు. తాను ఎన్నికల్లో గెలిస్తే యుద్ధాన్ని ఆపేందుకు కృషి చేస్తానని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటానని టాండన్ హామీ ఇచ్చారు.


వలస విధానాలను మారుస్తానని హామీ

తనను గెలిపిస్తే అమెరికా వలస విధానాల్లో కూడా సంస్కరణలు తీసుకువస్తానని టాండన్ హామీ ఇచ్చారు. గ్రీన్ కార్డు విషయంలో దేశాల వారీగా విధించే కోటాలను తొలగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. కోటాల వల్ల భారతీయులు ఎక్కువగా నష్టపోతున్నారని, భారతీయులు గ్రీన్ కార్డు కోసం దాదాపు 20 ఏళ్లు వేచి చూడాల్సి వస్తోందన్నారు. అదే సమయంలో యూరప్‌లోని కొన్ని దేశాల నుంచి వచ్చిన తెల్లజాతి వారికి ఆరు నెలల్లోనే గ్రీన్ కార్డు లభిస్తోందన్నారు. ‘ఇద్దరూ ఒకేరకమైన పని చేస్తున్నారు, ఒకేవిధంగా పన్నులు చెల్లిస్తున్నారు. అయినా భారతీయులు గ్రీన్ కార్డు కోసం 20 ఏళ్లు వేచిచూడాలా? దేశాల వారీగా ఉన్న కోటాలే దీనికి కారణం. నేను ఎన్నికైతే ఆ కోటాలను తొలగించేందుకు ప్రయత్నిస్తా’ అని టాండన్ అన్నారు. తనను గెలిపిస్తే, ధరల తగ్గింపునకు ప్రాధాన్యం ఇస్తానని టాండన్ హామీ ఇచ్చారు. కొత్త ఆవిష్కరణలు, పిల్లలకు ఏఐ విద్య అందించడంపై దృష్టి పెడతామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

జోర్డాన్‌లో చర్చిపై కాల్పులు.. ఏడుగురి మృతి, 40 మందికి గాయాలు

వనాటు దీవుల సమీపంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం..

Updated Date - Oct 24 , 2026 | 08:37 PM