Share News

అమెరికాలో అయ్యప్పలు

ABN , Publish Date - Oct 25 , 2026 | 03:22 AM

‘హరివరాసనం.. విశ్వమోహనం..’’ ఏటా చలికాలంలో అయ్యప్ప ఆలయాల చుట్టుపక్కల వినిపించే పరమ పవిత్రమైన శ్లోకమిది! ‘స్వామియే శరణమయ్యప్ప’ అంటూ అయ్యప్ప భక్తులు చేసే శరణు ఘోషతో వీధులన్నీ మారుమోగుతుంటాయి!!

అమెరికాలో అయ్యప్పలు
ayyappa devotees

  • దీక్ష తీసుకున్నవారు 5 వేల మందికిపైగానే!

  • వారికి అమెరికన్‌ బాస్‌ల సంపూర్ణ మద్దతు

  • ఆఫీసుల్లో ప్రత్యేక సౌకర్యాలు, వెసులుబాట్లు

  • అతిశీతల వాతావరణంలోనూ నిష్ఠగా దీక్ష

  • మేరీల్యాండ్‌, ఫ్లోరిడా ఆలయాల్లో విరమణ

(డాలస్‌ నుంచి కిలారు గోకుల్‌ కృష్ణ)

‘‘హరివరాసనం.. విశ్వమోహనం..’’ ఏటా చలికాలంలో అయ్యప్ప ఆలయాల చుట్టుపక్కల వినిపించే పరమ పవిత్రమైన శ్లోకమిది! ‘స్వామియే శరణమయ్యప్ప’ అంటూ అయ్యప్ప భక్తులు చేసే శరణు ఘోషతో వీధులన్నీ మారుమోగుతుంటాయి!! ఇండియాలోనే కాదు.. ఆ శరణు ఘోష ఇప్పుడు అమెరికాలో కూడా గట్టిగా ధ్వనిస్తోంది. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు తమ మూలాలు, ఆచారాలు మరిచిపోకుండా.. అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారు. ఇలా తీసుకునేవారు అమెరికావ్యాప్తంగా ఏటా దాదాపు 5 వేల మంది దాకా ఉంటారని అంచనా. సాధారణ వాతావరణం ఉండే కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్‌ వంటి రాష్ట్రాల్లోనివారే కాదు.. మైనస్‌ డిగ్రీల చలి ఉండే న్యూజెర్సీ, న్యూయార్క్‌, వర్జీనియా, మేరీల్యాండ్‌, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లోని వారు సైతం స్వామి మాల ధరించి.. నిష్ఠగా అన్ని నిబంధనలూ పాటిస్తూ, పూజలు చేస్తున్నారు. ఏటా నవంబరు 15 నుంచి జనవరి 15 దాకా అమెరికాలో అయ్యప్ప దీక్షల సందడి ఉంటుంది. దీక్ష తీసుకునేవారిలో దాదాపు 90ు మంది టెకీలే కాగా.. మిగతా 10ుమందిలో న్యాయవాదులు, వైద్యులు, విద్యార్థులు, చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉంటున్నారు. చన్నీటిస్నానం, ఏకభుక్తం, భూశయనం, చెప్పులు ధరించకుం డా నడవడం వంటి నియమాలను కఠినంగా పాటిస్తున్నారు. బేస్‌మెంట్లలో పూజగదులు ఏర్పాటు చేసుకుని.. అందరినీ పిలిచి భజనలు చేస్తూ భక్తితత్పరతను చాటుకుంటున్నారు.


బాస్‌ల ప్రోత్సాహం..

అమెరికాలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో సూటు, బూటు, టై వంటి ‘డ్రెస్‌ కోడ్‌’ తప్పనిసరి. దీక్షలో ఉన్నప్పటికీ కార్యాలయానికి బూట్లతో వచ్చి తమ సీటువద్ద వాటిని విడిచి ఉద్యోగం చేసి సాయంకాలం మళ్లీ వాటిని వేసుకుని వెళ్లేవారు కొందరైతే.. తీవ్రమైన చలిలో సైతం బూట్లు లేకుండా వచ్చేవారు మరికొందరు ఉంటున్నారు. నల్లటి కాటన్‌ దుస్తులు ధరించి, చెప్పులు లేకుండా, గడ్డం పెంచుకుని ఆఫీసులకి వచ్చే అయ్యప్పల మనోధైర్యాన్ని, ఆచారాల పట్ల వారికున్న మక్కువ, పట్టుదలను చూసి అమెరికన్‌ బాస్‌లు ముచ్చట పడుతున్నారు. వారి మతవిశ్వసాలను గౌరవించి.. కావల్సిన వెసులుబాట్లు, అనుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. వర్జీనియా ప్రాంతంలోని ఫ్యానీమే, ఫ్రెడ్డిమాక్‌ వంటి ప్రఖ్యాత కంపెనీల్లో పనిచేస్తున్న ప్రవాసులకు దీక్షలో ఉన్నంత కాలం రిమోట్‌గా పనిచేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. భారత్‌లో అ యితే వివిధ రాష్ట్రాల్లో అయ్యప్ప దీక్ష తీసుకున్నవారంతా కేరళలోని శబరిమలకు వెళ్లి.. స్వామి దర్శనం చేసుకుని దీక్ష విరమిస్తారు. మరిఅమెరికాలో? మేరీల్యాండ్‌లోని శివవిష్ణు ఆలయం, ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా అయ్యప్ప ఆలయాల్లో స్వాములు దీక్ష విరమిస్తున్నారు. మేరీల్యాండ్‌లోని ఆలయానికైతే కెనడా నుండి కూడా అయ్యప్పలు వస్తున్నారు. ఈరెండు ఆలయాల్లో శబరిమల తరహాలో పదునెట్టాంబడి (18మెట్లు) నిర్మించడం విశేషం. అమెరికా నలుమూలల నుండి దీక్ష పూర్తి చేసుకున్న భక్తులు ప్రత్యేక బస్సుల్లో తమకు సమీపంలోని ఆలయాలకు వచ్చి దీక్ష విరమిస్తున్నారు. కొన్ని ప్రవాస బృందాలు ఇండియాలో ఇరుముడి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని శబరిమల వెళ్లి దీక్ష విరమిస్తున్నారు. అయితే.. వీరి సంఖ్య అమెరికాలో దీక్ష విరమించే వారితో పోలిస్తే చాలా తక్కువ.


పద్దెనిమిదేళ్లుగా దీక్ష

నేను 2004లో అమెరికాకు వచ్చాను. 2007 నుండి ఏటా అయ్యప్ప దీక్ష తీసుకుంటూ గురుస్వామిగా వ్యవహరిస్తున్నాను. అమెరికాలో వైద్యవృత్తిలో ఉన్నవారు ఎలా ఉండాలనే దానికి చాలా కఠిన నిబంధనలు ఉంటాయి. రోగులతో ప్రతినిత్యం పనిచేయాల్సి ఉండటంతో పాదరక్షలు ధరించడం, గోళ్లు తీసుకోవడం, ఆసుపత్రి దుస్తులు ధరించడం వంటివి తప్పనిసరి. కాబట్టి, అయ్యప్ప దీక్ష సందర్భంగా మెడలో ధరించే మాలలు మాత్రం ఖచ్చితంగా ధరిస్తాను. నేను సర్జరీ చేయడానికి వెళ్లినప్పుడు మెడలోని మాలల గురించి రోగులు కుతూహలంగా ప్రశ్నలు అడుగుతుంటారు. ఆసుపత్రిలో నా పని పూర్తి అయ్యాక ఇంటికి వెళ్లి మనస్ఫూర్తిగా పూజలు, భజనల్లో పాల్గొంటాను. పెద్దల కన్నా కూడా ప్రవాస చిన్నారులు చాలా పట్టుదలగా అయ్యప్ప దీక్ష నియమాలు పాటిస్తున్నారు.

- డా. శ్రీనివాస్‌ కవుటూరి, సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, మిషిగన్‌

కంభంపాడు-ఎన్‌టీఆర్‌ జిల్లా)


దీక్ష ఇక్కడ.. విరమణ శబరిమలలో..

పాతికేళ్లుగా అమెరికాలో ఐటీ, హోటళ్ల రంగంలో వ్యాపారం చేస్తున్నాను. నా వద్ద పనిచేసే ఉద్యోగులపై ఎలాంటి ఆంక్షలూ విధించకుండా హైందవ సాంప్రదాయాన్ని గౌరవించే కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నాను. 1996లో నేను తొలిసారిగా ఇండియాలో అయ్యప్ప దీక్ష తీసుకున్నాను. 1999లో అమెరికా వచ్చినప్పటికీ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను. దీక్షలోని కఠిన నియమాలను తప్పకుండా పాటిస్తున్నాను. దీక్ష అమెరికాలోనే తీసుకున్నా.. చివర్లో హైదరాబాద్‌కు వెళ్లి ఇరుముడి కార్యక్రమం నిర్వహించి, శబరిమల వెళ్లి దీక్ష విరమిస్తున్నాను.

-శ్రీధర్‌ నూలి, వ్యాపారవేత్త, వర్జీనియా (హైదరాబాద్‌)


ayyappa4.jpgఇండియాలో నేను మొదటిసారి 2018లో అయ్యప్ప మాల వేసుకున్నాను. అక్కడ ఏడుసార్లు దీక్ష తీసుకున్నాను. అమెజాన్‌లో పనిచేసేందుకు ఎల్‌1 వీసాపై అమెరికాకు వచ్చాక తొలిసారి ఇక్కడ మాల వేసుకున్నాను. చెప్పులు కూడా లేకుండా నా వేషధారణ చూసిన మా అమెరికన్‌ బాస్‌ తొలుత ఆశ్చర్యపడినప్పటికీ నా పట్టుదల చూసి నన్ను ప్రోత్సహించారు. మామూలుగా నా ఆఫీసు మా ఇంటికి 20 మైళ్ల దూరంలో ఉంటుంది. దానికి బదులుగా మా ఇంటి దగ్గర ఉన్న శాఖకు వెళ్లేవెసులుబాటును ప్రత్యేకంగా కల్పించారామె. సియాటెల్‌ అమెజాన్లో నా స్నేహితులు 14 మంది అయ్యప్ప దీక్ష తీసుకున్నారు.

భాస్కర్‌ రావూరి, ఐటీ ఉద్యోగి, వర్జీనియా

(తూర్పు గోదావరి జిల్లా)

ఈ వార్తలు కూడా చదవండి ..

పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ.. ఫరూక్ అబ్దుల్లా

ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అమిత్ షా, సీఎం రేఖా గుప్తా.. శాంతిభద్రతలపై సమీక్ష

Updated Date - Oct 25 , 2026 | 05:04 AM