అప్పుడు ఆటోడ్రైవర్.. ఇప్పుడు 10 వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి
ABN , Publish Date - Oct 03 , 2026 | 06:06 PM
గుజరాత్‌కు చెందిన ఫరూక్ పటేల్ ఒకప్పుడు రోజు గడవడానికి ఆటో నడిపారు. తరువాత పిజ్జా హట్‌లో పనిచేశారు. ఇప్పుడు మాత్రం ఆయన రూ.పదివేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు.
ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో సాధించాలనే తపన ఉంటే ఉన్నత స్థానాలకు చేరుకుంటామనే మాటకు ఆయన నిదర్శనం. అంకితభావంతో కష్టపడితే శిఖరాలను అధిరోహిస్తామనే మాటకూ ఆయనే సాక్ష్యం. గుజరాత్‌కు చెందిన ఫరూక్ పటేల్ ఒకప్పుడు రోజు గడవడానికి ఆటో నడిపారు. తరువాత పిజ్జా హట్‌లో పనిచేశారు. ఇప్పుడు మాత్రం ఆయన రూ.పదివేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు.
1972, మార్చి 24న ఫరూక్ జన్మించారు. ఆయన తండ్రి గుజరాత్ ఆర్టీసీలో బస్ కండక్టర్‌గా సేవలందించేవారు. ఆర్థిక ఇబ్బందుల నడుమ పెరిగిన ఫరూక్.. డబ్బు విలువ కాస్త తొందరగానే తెలుసుకున్నారు. అలాగే ఆర్థిక క్రమశిక్షణను అలవరచుకున్నారు. 12వ తరగతి పూర్తయ్యాక ఆయనకు డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ఓ ఆప్టికల్ షాప్‌లో పనికి కుదిరారు. జీతం చాలాక ఆటో నడపాలని నిర్ణయించుకున్నారు. అలా కొంత కాలం ఆటోడ్రైవర్‌గా పనిచేశారు. తరువాత ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ వ్యాపారం గురించి తెలుసుకునేందుకు ఫరూక్ ముంబై వెళ్లారు.
వ్యాపార రంగంలో స్థిరపడాలని గట్టిగా అనుకున్నారు కాబట్టి 1990లో ఫరూక్ ఓ బట్టల షాపు పెట్టారు. అయితే అదనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో ఆయన యూకే వెళ్లిపోయారు. అక్కడ పిజ్జా హట్‌లో పార్ట్‌టైం వర్క్ చేస్తూ మంచి జాబ్ సంపాదించారు. యూకే వాతావరణానికి మెల్లగా అలవాటు పడ్డారు. రెండు చేతులా డబ్బు సంపాదిస్తున్నప్పటికీ ఆయనకి ఎందుకో అసంతృప్తిగా ఉండేది. పుట్టి పెరిగిన నేలకు తన సేవలు దూరంగా ఎందుకుండాలనే ప్రశ్నలు ఆయనలో మొదలయ్యాయి. భారత్ అభివృద్ధిలో భాగం కావాలని 1993లో మళ్లీ ఇంటి బాటపట్టారు.
మొదటి అడుగు
1994 ఫరూక్ పటేల్ రూ.లక్ష పెట్టుబడితో ఓ వ్యాపారం ప్రారంభించారు. భవన నిర్మాణ సామగ్రి అందించే ఓ సంస్థను ఏర్పాటు చేశారు. దానికి కేపీ గ్రూప్ అని పేరు పెట్టారు. అది బాగా క్లిక్ అయింది. ఓ రోజు ఒక కస్టమర్ భవన నిర్మాణానికి ఇటుకలను ఆర్డర్ ఇచ్చారు. అయితే అదేరోజు ట్రక్ డ్రైవర్ విధులకు హాజరు కాలేదు. అయినా ఫరూక్ వెనక్కి తగ్గలేదు. స్వయంగా తానే ట్రక్ డ్రైవ్ చేసుకుంటూ డెలివరీ చేశారు. ఇటుకలను కూడా తానే ట్రక్ నుంచి కిందకు దించారు. ఇది ఫరూక్ అంకిత భావానికి ఓ ఉదాహరణ.
టెలికాం రంగంలో ప్రవేశం
మొదటి వ్యాపారం విజయవంతంగా నడుస్తున్నా ఫరూక్‌కు ఇంకా ఏదో కావాలనిపించింది. అందుకే ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చేశారు. అప్పుడే సాంకేతిక రంగంలో జరుగుతున్న మార్పులను ఆయన గమనించారు. టెలికాం రంగంలో ప్రవేశించాలని అనుకున్నారు. ఈ నిర్ణయమే ఆయన జీవితాన్ని మార్చేసింది. టెలికాం టవర్ల నిర్మాణంలో కేపీ గ్రూప్ దూసుకుపోయింది. దాదాపు 13 సంవత్సరాల పాటు టవర్లను నిర్మించింది. షేర్డ్- టవర్ మోడల్‌ను ఫరూక్ అభివృద్ధి చేశారు. అంతకుముందు సిమ్ కంపెనీలకు వేరు వేరు టవర్లు ఉండేవి. దీనివల్ల ఖర్చు ఎక్కువగా ఉండేది. అన్ని సిమ్ కంపెనీలకు ఒకటే టవర్ ఉంటే సరిపోతుందని ఆయన భావించారు. అలా షేర్డ్- టవర్ మోడల్‌ను అభివృద్ధి చేశారు.
టెలికాం నుంచి పునరుత్పాదక శక్తి వనరుల వైపు
తరువాత ఫరూక్ పునరుత్పాదక శక్తి వనరుల రంగంలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. 2008లో ఆయన కేపీఐ గ్లోబల్ ఇన్‌ఫ్రా, కేపీఐ గ్రీన్ ఎనర్జీ, కేపీ ఎనర్జీ సంస్థలను స్థాపించారు. ఆ సమయంలో ఫరూక్ నిర్ణయాలను సన్నిహితులు విమర్శించారు. అనవసర రిస్క్ తీసుకుని జీవితంతో ఆటలడొద్దని వారించారు. అవేమీ ఆయన పట్టించుకోలేదు. తాను నమ్మినదాని కోసం ముందుకు వెళ్లారు. సోలార్ వ్యవస్థలో భారీ పెట్టుబడులు పెట్టారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తలవంచలేదు. అలా కేపీ గ్రూప్ సోలార్, విండ్, హైబ్రిడ్ ఎనర్జీల రంగాలకు విస్తరించింది. రూ.పదివేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించింది.
తన విజయానికి వేగం, అంకితభావం, విలువలు, విధేయత కారణాలని ఫరూక్ పటేల్ అంటున్నారు. సరైన నిర్ణయం వేగంగా తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే చిన్న పెట్టుబడితో, పెద్ద ఆశయాలతో మొదలవ్వాలని యువతకు సూచిస్తున్నారు. ‘స్టార్ట్ స్మాల్ బట్ థింక్ బిగ్’ అన్న విజయ మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు. చాలా మంది వ్యాపారులకు ఆయన కథ ఆదర్శంగా నిలుస్తోంది.
ఇవీ చదవండి
కొడుకును మార్చాలనుకుంది.. చివరకు తానే మారిపోయింది.. ఈ చైనా మహిళ కథేంటంటే..
అరుణాచల్‌ప్రదేశ్ అక్కాచెల్లెళ్ల పాట వైరల్.. 1.56 కోట్లకు పైగా వ్యూస్!