కొడుకును మార్చాలనుకుంది.. చివరకు తానే మారిపోయింది.. ఈ చైనా మహిళ కథేంటంటే..
ABN , Publish Date - Oct 03 , 2026 | 02:30 PM
ఆమె కొడుకు గంటల తరబడి వీడియో గేమ్స్ ఆడుతుండేవాడు.. ఇంటర్నెట్ కేఫ్‌లకు వెళ్లి మరీ అతడిని ఇంటికి తీసుకొచ్చేది.. అసలు గేమింగ్‌కు తన కొడుకు ఎందుకు బానిస అయిపోయాడో తెలుసుకోవాలనుకుంది..
ఇంటర్నెట్ డెస్క్: ఆమె కొడుకు గంటల తరబడి వీడియో గేమ్స్ ఆడుతుండేవాడు.. ఇంటర్నెట్ కేఫ్‌లకు వెళ్లి మరీ అతడిని ఇంటికి తీసుకొచ్చేది.. అసలు గేమింగ్‌కు తన కొడుకు ఎందుకు బానిస అయిపోయాడో తెలుసుకోవాలనుకుంది.. తానే గేమింగ్ ప్రారంభించింది.. దెబ్బకు సీన్ రివర్స్ అయింది.. ఆమె గంటల తరబడి గేమ్స్ ఆడుతూ ప్రస్తుతం ప్రముఖ గేమింగ్ లైవ్ స్ట్రీమర్‌గా మారిపోయింది (Chinese mother gaming).
చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని మెయిజౌ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల జోంగ్ జువాన్‌జువాన్ (Zhong Juanjuan) ఆన్‌లైన్‌లో 'ఆంటీ జువాన్'గా గుర్తింపు పొందారు. ఆమెకు ప్రస్తుతం సుమారు 5.27 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. రోజుకు రెండుసార్లు లైవ్ స్ట్రీమింగ్ నిర్వహిస్తుండగా.. ఒక్కో సెషన్‌ను సుమారు 10 వేల మంది వీక్షకులు వస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం జోంగ్ కుమారుడు పాఠశాలలో చదువుతున్న సమయంలో వీడియో గేమ్స్‌కు బాగా అలవాటు పడ్డాడు. గేమ్స్ కారణంగా అతడి చదువుపై ప్రభావం పడటంతో.. జోంగ్ అతడిని గేమ్స్ ఆడనిచ్చేవారు కాదు (Chinese gaming streamer).
2020లో ఉద్యోగం వదిలేసిన తర్వాత తన కుమారుడు ఇంట్లో గంటల తరబడి గేమ్స్ ఆడుతుండటాన్ని జోంగ్ గమనించారు. అసలు గేమ్స్‌లో అంతగా ఏముంది? తన కొడుకును అంతగా ఆకర్షిస్తున్న విషయం ఏమిటి అని తెలుసుకోవాలనే ఆసక్తితో ఆమె స్వయంగా గేమింగ్ ప్రయత్నించారు. కొడుకు దగ్గరే గేమింగ్ నేర్చుకున్నారు. ప్రారంభంలో ఆమెకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. వయసు కారణంగా చూపు తగ్గడం, రియాక్షన్ టైమ్ మందగించడం కూడా ఆమెకు సవాలుగా మారాయి. అయినా జోంగ్ వెనక్కి తగ్గలేదు. నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ గేమింగ్‌లో నైపుణ్యం సంపాదించారు. 2022లో ఆమె లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించారు. ఇప్పటివరకు ఆమె 8 వేల గంటలకు పైగా గేమ్స్ ఆడారు (60 year old gamer).
జోంగ్‌కు అభిమానులు పెరుగుతున్న కొద్దీ అనుమానాలు కూడా మొదలయ్యాయి. నిజంగా 60 ఏళ్ల మహిళే అంత బాగా గేమ్ ఆడుతోందా? లేక మరెవరైనా ఆమె తరఫున ఆడుతున్నారా? అంటూ కొందరు ప్రశ్నించారు. ఈ అనుమానాలకు సమాధానంగా ఆమె కుమారుడు మల్టిపుల్ కెమెరాలను ఏర్పాటు చేశాడు. తద్వారా ఆమెను వివిధ కోణాల నుంచి చూస్తూ ఆమె స్వయంగా గేమ్ ఆడుతున్నట్లు ప్రేక్షకులు నిర్ధారించుకునే అవకాశం కల్పించాడు.
ఇవీ చదవండి:
పర్వతాలు.. శిఖరాలు.. సరస్సులు.. లద్దాఖ్‌లో 28 ప్రాంతాలకు అధికారిక గుర్తింపు
ఏపీ మీదుగా మరో వందేభారత్ స్లీపర్.. హాల్ట్స్ ఇవే?