అన్నీ తానై... అంతటా తానై!
ABN , Publish Date - May 10 , 2026 | 12:01 PM
నిన్న మొన్నటిలాగా అకడమిక్ పరిశోధనలకో, టెకీల ఉద్యోగ విధులకో పరిమితం కాలేదు ‘కృత్రిమ మేధ’. రాను రాను ‘ఏఐ’ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగం అన్నిరంగాల్లోనూ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది.
నిన్న మొన్నటిలాగా అకడమిక్ పరిశోధనలకో, టెకీల ఉద్యోగ విధులకో పరిమితం కాలేదు ‘కృత్రిమ మేధ’. రాను రాను ‘ఏఐ’ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగం అన్నిరంగాల్లోనూ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే నిశ్శబ్దంగా నిత్యజీవితాల్లోకి వచ్చేసింది. దైనందిన కార్యకలాపాలను వేగవంతం, సులభతరం చేస్తోంది. మరోపక్క ప్రాంతీయ భాషల్లో జోరందుకుంటూ సామాన్యులకూ చేరువవుతోన్న ‘ఏఐ’ వింత పోకడలపై ఓ లుక్కేద్దాం...
నగరంలో ఓ శుక్రవారం ఉదయం... సూర్యుడింకా రాకముందే 32 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాకేశ్ కాఫీ కప్పు చేతికి తీసుకుని, ఫోన్ చూస్తూ అడిగాడు- ‘‘హే గ్రాక్! మా ఆర్నెల్ల పాపకు ఆరోగ్యకరమైన మొదటి ఆహారం ఏమిటి? సులువుగా, త్వరగా చేసే రెసిపీలు చెప్పు. మా అమ్మ చెప్పినట్టు రుచి కూడా ఉండాలి...’’
అతడు అడిగిన ఒకట్రెండు సెకన్లకే తెర మీద తెలుగు రెసిపీలూ, క్యాలరీలూ, పోషకాలూ.. వాటితో పాటు ‘ఈ వారం మీ ఫ్రిజ్‌లో ఉన్న పదార్థాలతో సరిపోయేలా’ అని పర్సనలైజ్డ్ సూచనలు వచ్చేశాయి. రాకేశ్ సంతోషంతో ‘వావ్! ఇది మా అమ్మకన్నా స్మార్ట్‌గా ఉంది’ అనేశాడు.
అదే సమయంలో వంటగదిలో అతడి భార్య ప్రియ ‘యుప్లయన్స్. ఏఐ స్మార్ట్ కుకింగ్ అసిస్టెంట్’ను ఆన్ చేసి ‘‘ఈరోజు కడాయ్ పనీర్ చేద్దాం. కానీ కొంచెం హెల్దీ ట్విస్ట్ ఇవ్వు’’ అనడిగింది. ‘గతవారం డేటా ప్రకారం.. మీరు కొంచెం తక్కువ ఆయిల్ ఉపయోగించాలి. అలా చేస్తే క్యాలరీలు 180 తగ్గుతాయి’ అని సూచించింది. ‘ఈ ఏఐ లేకుండా వంటింటి జీవితం ఎలా గడిపేవాళ్లమో!’ అనుకుంది ప్రియ.
- - - -
ఉదయం పది గంటల తర్వాతి దృశ్యం... రాకేశ్ తల్లి ఆన్‌లైన్‌లో చీరను ఆర్డర్ చేస్తోంది. ‘‘ఏఐ ఈ శారీని నా వయసు, సీజనుకు తగ్గట్టుగా భలే సూచించింది. నా గత కొనుగోళ్లతో పర్‌ఫెక్టుగా మ్యాచ్ అవుతుంది’’ అనుకుంది.
- - - -
అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఓ రూమ్‌లో ఉంటాడు సంకల్ప్. ఇంకా పెళ్లి కాలేదు. ‘బెటర్ హాఫ్.ఏఐ’ సూచించిన అమ్మాయిని కాఫీషాపులో కలవడానికి మరో గంట సమయముంది. ‘ఈసారి ఏఐ సూచించిన అమ్మాయి నా జోక్స్ సరిగానే అర్థం చేసుకుంటుందట. పోయునవారం మ్యాచ్ కన్నా ఇది బెటర్ అనిపిస్తోంది’ అంటూ స్నేహితుడు రాకేశ్‌కు మెసేజ్ పంపాడు. తర్వాత మొబైల్ యాప్‌లో రైడ్ బుక్ చేశాడు. కొద్ది నిమిషాల్లోనే ఇంటి ముందుకు క్యాబ్ వచ్చేసింది. ఉత్సాహంగా బయల్దేరి వెళ్లాడు.
యాప్ ఆధారిత వాహన సేవలందించే ఓలా, ఊబర్, రాపిడో లాంటి మొబైల్ యాప్స్ ఏఐ అల్గారిథమ్స్‌తో పనిచేస్తాయి. డిమాండ్-సరఫరా, వాతావరణం, ట్రాఫిక్‌లను విశ్లేషించి ఛార్జీలను అప్పటికప్పుడు పెంచడమో, తగ్గించడమో చేస్తాయి. ఇలాంటి రైడ్-హెయిలింగ్ వేదికలకు కనపడని వెన్నెముకలాంటిది ‘ఏఐ’.
జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ నౌ లాంటి క్విక్ కామర్స్ యాప్స్... ఏఐ, మెషిన్‌లెర్నింగ్, డేటా అనలిటిక్స్‌లతో పని చేస్తాయి. తరచూ వీటిని వినియోగించడం పట్టణాలు, నగరాల్లో సాధారణమైపోయింది. వీటిద్వారా ఆర్డర్ పెట్టిన 10- 30 నిమిషాల్లోనే పచారీ సరుకులు, కూరగాయలు, పండ్లలాంటివి నేరుగా ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇష్టమైన ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి తెప్పించుకోవడానికీ, రెస్టారెంట్లను గుర్తించి టేబుల్‌ను రిజర్వ్ చేసుకోవడానికీ స్విగ్గీ, జొమాటోలున్నాయి. అలాగే ిన నిమాలూ, ఈవెంట్లు లాంటి వినోద కార్యక్రమాల టికెట్లకు ‘బుక్ మై షో’ లాంటి యాప్స్! వినియోగదారుల ఆర్డర్ స్టేటస్, రిఫండ్స్ లాంటి ఫిర్యాదులను మానవ వనరులకు బదులు ఏఐ ఆధారిత ‘చాట్‌బాట్స్’ పరిష్కరిస్తున్నాయి.
అందరి జీవితాల్లో విడదీయరాని భాగమైపోతున్న ‘కృత్రిమ మేధ’ విస్తరణ గాథలో ఇవి కొన్ని సంఘటనలు మాత్రమే. దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో సాంకేతిక వినియోగ ముఖచిత్రం వేగంగా మారుతూవస్తోంది. ప్రయాణం, వినోదం, పేరెంటింగ్ నుంచి... వంట, ఫుడ్ పార్శిల్స్, పెళ్లి సంబంధాలు, షాపింగ్ వరకూ ప్రతీ అంశంలోనూ ‘ఏఐ’పై ఆధారపడటం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.
మనమే టాప్...
వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించి ‘ఏఐ’ పవర్ టూల్స్ వినియోగం విషయంలో భారతదేశం 85 శాతం వినియోగదారులతో ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉందని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. (50 శాతంతో అమెరికా రెండోస్థానంలో, 43 శాతంతో యు.కె. మూడో స్థానంలో, 34 శాతంతో జపాన్ నాలుగో స్థానంలో ఉన్నాయి). అలాగే మనదేశంలోని 1.8 లక్షల అంకుర సంస్థల్లో 89 శాతం ‘ఏఐ’ని వాడుతున్నాయి. యూపీఐ లావాదేవీల్లో మోసాలను గుర్తించడానికి 90 శాతం బ్యాంకులు ‘ఏఐ’పైనే ఆధారపడుతున్నాయి.
పేరుకే ‘కృత్రిమ మేధ’ కానీ... వాస్తవానికి యంత్రాల ద్వారా ప్రదర్శితమయ్యే మానవ మేధ ఇది! మానవ సహాయం, నిరంతర పర్యవేక్షణ లేకుండా పనులను స్వయంగా నిర్వహించగలగటమే దీని ప్రత్యేకత. సంక్లిష్టమైన సమస్యలను వేగంగా విశ్లేషించి పరిష్కారాలు కనుగొనటమే కాకుండా... డేటా నుంచి నేర్చుకుని తనను తాను మెరుగుపరచుకోగలదు. డేటాలో దాగివున్న సరళి (ప్యాట్రన్) గుర్తించి భవిష్యత్తును అంచనా వేస్తుంది.
సందేహమొస్తే... ఉందిగా ఏఐ!
విజయవాడలోని 28 ఏళ్ల లక్ష్మి తన నాలుగు నెలల పాపాయి నిద్ర సమస్యలతో బాధపడుతుంటే తెలుగు ‘ఏఐ చాట్ బాట్’ను అడిగింది- ‘బిడ్డ నిద్రపోకపోతే ఏం చేయాలి? సైన్స్ ఆధారంగా చెప్పు’ అని. వెంటనే ‘ఏఐ’... స్లీప్ రొటీన్, ఫీడింగ్ సూచనలు, యాప్ లింకులు ఇచ్చింది. జెన్‌జీ తల్లిదండ్రులు 52 శాతం తమ పిల్లల పెంపకం కోసం ‘ఏఐ పేరెంటింగ్ అడ్వైజ్’ను ఉపయోగిస్తున్నారని అంచనా.
‘భాషిణి’ యాప్ ద్వారా ఓ తల్లి తన చిన్నారికి తెలుగులో కథలు వినిపిస్తుందంటే ఆశ్చర్యమేమీ లేదు. ఈ ఏడాది ‘భాషిణి’ 600 కోట్లకు పైగా ఏఐ అభ్యర్థనలను ప్రాసెస్ చేసింది. భారత్ జెన్... తెలుగు సహా 22 భాషల్లో టెక్స్ట్ మోడల్స్‌ను పూర్తిచేస్తోంది.

ఓ రైతు ‘ఈ వారం వర్షాలు ఎలా ఉంటాయి? నా పంటను ఏం చేయాలి?’ అని అడిగాడు. ఏఐ తెలుగులో స్పష్టంగా జవాబిచ్చింది.
విశాఖపట్నంలోని ఓ యూట్యూబర్ ‘సర్వం ఏఐ’తో తన వీడియోలకు సహజసిద్ధమైన తెలుగు వాయిస్‌ఓవర్ చేశాడు. ‘ఇప్పుడు నా గొంతు కూడా ఏఐ సాయంతో ప్రొఫెషనల్ అయింది’ అంటూ ఆనందపడ్డాడు.
వంటల విషయంలో ‘ఏఐ’ సంప్రదాయ రుచులను కాపాడుతూ ఆరోగ్యకరమైన రెసిపీలను సూచిస్తోంది.
వ్యక్తుల అభిరుచులూ, స్వభావం, సాంస్కృతిక ప్రాధాన్యాలను బట్టి ‘ఏఐ’ పెళ్లి సంబంధాలను సూచిస్తోంది. చాలా యాప్‌లు 89 శాతం కంపాటబిలిటీ స్కోరును ఇస్తున్నాయి.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ‘ఏఐ’ సిఫార్సులు ఇప్పుడు 64 శాతం షాపర్ల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి.
రంగమేదైనా రెడీ...
సామూహిక అవసరమైనా, వ్యక్తిగత అభిరుచి అయినా... సస్య క్షేత్రమైనా, ప్రయోగశాల అయినా ‘కృత్రిమ మేధ’ వినియోగం తప్పనిసరి అయిపోయింది. చాట్‌జీపీటీ లాంటి టూల్స్ ప్రామ్ట్స్‌తోనూ, వివిధరకాల యాప్స్ నిర్దిష్ట సూచనలతోనూ పనిచేస్తూ మన అవసరాలు తీరుస్తున్నాయి.
స్మార్ట్ సెర్చ్: మనదేశంలో ‘ఏఐ’ ఆధారిత సెర్చ్‌ని ఇంగ్లిష్, హిందీల్లోనే కాకుండా ప్రాంతీయ భాషల్లోనూ ఉపయోగిస్తున్నారు. దీనివల్ల సత్వరమే సమాధానాలు లభిస్తున్నాయి.
చాట్ అసిసెంట్లు: ‘మూడు రోజల మనాలీ ట్రి్‌ప్‌నకు ప్లాన్ చెయ్యి’ అని చెప్పేస్తే చాలు. ఇట్టే పని అయిపోతుంది. హోమ్‌వర్క్ సహాయం దగ్గరనుంచి... విహారయాత్రల ప్రణాళిక దాకా ఎంతోమంది ప్రతీరోజూ ఏఐ అసిస్టెంట్ల సాయం తీసుకుంటున్నారు.
అనువాదం: భాషల అడ్డుగోడలను ‘ఏఐ టూల్స్’ చెరిపేస్తున్నాయి. వేరే భాషల్లో ఉన్న సందేశాలు, డాక్యుమెంట్లూ.. ఇంకా ఎన్నింటినో తెలిసిన భాషలోకి తక్షణమే అనువదిస్తూ సాయపడుతున్నాయి.
ఆన్‌లైన్ షాపింగ్: మేటి ఉత్పత్తులను, ఆఫర్లనూ ‘ఏఐ’ సిఫార్సు చేస్తుంది. ధరలను పోల్చి ఉత్తమ డీల్స్ చూపిస్తుంది. వినియోగదారులను ఆన్ లైన్ షాపింగ్‌కు సిద్ధం చేస్తుంది.
డిజిటల్ చెల్లింపులు: మోసాలను గుర్తించి యూపీఐ చెల్లింపుల లావాదేవాలు సురక్షితంగా జరిగేలా ‘ఏఐ’ చూస్తుంది.
విద్య: ఎడ్ టెక్ అంకుర సంస్థల వ్యాప్తికి ‘ఏఐ’ సహకారం ఉంది. ప్రతీ విద్యార్థికీ వారి వేగానికి తగ్గట్టు పాఠాలు నేర్పించే ‘పర్సనలైజ్డ్ లెర్నింగ్’ పద్ధతులు వస్తున్నాయి. ‘ఏఐ ట్యూటర్ల’ ద్వారా ఆసక్తి ఉన్న భాషలు నేర్చుకోవడం సాధ్యమే. విద్యార్థులు తమ పాఠ్యాంశాల్లో సందేహాలు తీర్చుకుంటున్నారు. ఆచరణాత్మకమైన స్టడీ ప్లాన్స్ వేసుకుంటున్నారు. జవాబుల మూల్యాంకనం ఆటోమేటెడ్ అసెస్‌మెంట్ల ద్వారా సాధ్యమవుతోంది.
వినోదం: ఏఐ వ్యక్తిగతంగా నచ్చే సినిమాలు ఓటీటీలో ఏమున్నాయో, మెచ్చే పాటలు ఏ మ్యూజిక్ స్ర్టీమింగ్ యాప్స్‌లో ఉన్నాయో సూచిస్తోంది. ప్రదర్శించే షోల వివరాలు అందిస్తోంది.
ఆరోగ్యం, ఫిట్‌నెస్: నడిచిన అడుగులను లెక్కిస్తుంది. గుండె స్పందన రేటు చెప్తుంది. నిద్రించిన సమయమెంతో సూచిస్తుంది. ఇలా ‘ఏఐ’ వ్యక్తిగత ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తుంది. ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ రిపోర్టులను విశ్లేషిస్తుంది. వర్కవుట్స్, డైట్స్ సలహాలను అందిస్తుంది. ఆన్‌లైన్ కన్సల్టేషన్, వేగవంతమైన రోగ నిర్థారణల వెనకా ‘ఏఐ’ ఉంటోంది.
స్మార్ట్‌హోమ్: ‘ఓకే గూగుల్! లైట్స్ వెయ్యి’ అని చెప్తే చాలు, స్విచ్ ఆన్ చేయకుండానే స్మార్ట్ హోమ్ అంతటా వెలుగు పరుచుకుంటుంది. ‘ఏఐ’తో పనిచేసే పరికరాలు వాయిస్ కమాండ్స్‌తో లైట్లూ, టీవీ, ఏసీలూ లాంటివాటిని నియంత్రిస్తున్నాయి. .
సోషల్ మీడియా: ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్‌లాంటి వేదికల్లో మన ఫీడ్‌ను పర్సనలైజ్ చేస్తుంది. కొత్త స్నేహితులను సూచిస్తుంది. అవాంఛనీయమైన స్పామ్‌ను అడ్డుకుంటుంది.
స్మార్ట్ మొబిలిటీ: నగరాల్లో వాహనాల రద్దీ ఆధారంగా సిగ్నల్ సమయాలను సర్దుబాటు చేస్తూ ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడానికి ‘ఏఐ’ ఉపయోగపడుతోంది. దీనివల్ల ట్రాఫిక్ ప్రవాహాన్ని సమర్థవంతంగా నియంత్రించి నిర్వహించడం సాధ్యమవుతుంది. అలాగే ట్రాఫిక్ రద్దీ ఉన్న రూట్లను గుర్తించి మెరుగైన మార్గాలను సూచిస్తుంది. జీపీఎస్ నేవిగేషన్ ద్వారా గమ్యానికి దగ్గర దారులు చూపిస్తుంది.
ఈ మెయిల్స్: స్పామ్ ఫిల్టరింగ్ ద్వారా అవాంఛిత, వాణిజ్య ప్రచార మెయిల్స్ బెడదను తగ్గిస్తుంది. ఈ మెయిల్ రిప్లైలను మెరుగుపరుస్తుంది.
బిజినెస్ ఫ్రెండ్లీ: ఆర్థిక రంగంలో మోసాలను గుర్తిస్తుంది. పెట్టుబడులకు సలహాలిస్తుంది. రోబో- అడ్వైజ్ అందిస్తుంది. ఖర్చులను విశ్లేషించి పర్సనల్ ఫైనాన్స్ నిర్వహణను మెరుగుపరుస్తుంది. డేటా విశ్లేషణ ద్వారా వ్యాపారంలో మెరుగైన నిర్ణయాలు తీసుకునేలా ‘ఏఐ’ ఉపకరిస్తుంది.
పంటల పర్యవేక్షణ: పంటల తెగుళ్లను గుర్తించి స్మార్ట్ వ్యవసాయం చేసేలా రైతులకు ‘ఏఐ’ ఊతమిస్తోంది. నీటి పారుదల, పొలాల్లో పంటల పర్యవేక్షణల్లో ఆసరాగా నిలుస్తోంది. గరిష్ఠ దిగుబడికి సహకరిస్తోంది.
‘ఏఐ’ చెప్పిందే ఫైనలా?
వృత్తిలో అనుభవం, విచక్షణ, పరిశీలనా శక్తి ఉన్న నిపుణులకు ‘ఏఐ’ ప్రత్యామ్నాయం ఎంతమాత్రమూ కాదు. ఈ పరిమితిని గుర్తించకుండా కొన్ని కీలక రంగాల్లో ‘ఏఐ’ సలహాలను అడిగి, వాటిని గుడ్డిగా పాటించడం నష్టదాయకం కావొచ్చు. అవేమింటంటే...
వైద్యం: ముఖ్యంగా ‘ఏఐ’ని వైద్యసలహాలు అడిగి... మందుల ప్రిస్ర్కిప్షన్లను పొంది, వాటిని వాడటం ప్రమాదకరం. మానసిక సమస్యలకూ ఇది వర్తిస్తుంది. ఆంతరంగిక విషయాలూ, పాస్‌వర్డులూ లాంటివి గోప్యంగా ఉంచుకోకుండా ఆ సమాచారాన్ని ‘ఏఐ’తో పంచుకోవడం సమస్యాత్మకమే. చాట్ హిస్టరీ పొరపాటున ఇతరులకు చేరే ప్రమాదం ఎప్పుడైనా ఉంటుందని గ్రహించాలి.
ఆర్థికం: షేర్లలో పెట్టుబడుల సలహాలూ, పొదుపు చిట్కాల కోసం ‘ఏఐ’ని ఆశ్రయిస్తే ఆచరణలో కొన్నిసార్లు అవి వికటించవచ్చు. నష్టపోయి ఆర్థికంగా దెబ్బతినే ఆస్కారం ఉంటుంది.
చట్టం: ‘ఏఐ’ తన డేటాతో చెప్పేదాంట్లో అవాస్తవాలూ, దోషాలు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే చట్టాలూ, న్యాయ సలహాల విషయంలో ‘ఏఐ’ జోక్యం అడిగి, వచ్చిన సలహాలను నిర్విచక్షణగా పాటించడం అనర్థదాయకం.
ఎలా పనిచేస్తుంది?
ఇంటర్నెట్ సదుపాయం ఉండాలే కానీ.. సమాచారం, చిత్రం, ఆడియో, వీడియో, కోడ్... ఏది ఎలా కోరుకుంటే అలా క్షణాల్లో సృష్టించి ఇచ్చే ‘కృత్రిమ మేధ’ (ఏఐ)ను కామధేనువుగా, కల్పతరువుగా పోలుస్తున్న రోజులివి. అయితే ‘ఏఐ’ ప్యాట్రన్స్‌ను అంచనా వేస్తుంది కానీ.. అర్థాన్నీ, ఉద్దేశాన్నీ, సందర్భాన్నీ గ్రహించదు. ఇన్ని పరిమితులున్నప్పటికీ అన్ని రంగాలనూ పెనువేగంతో ప్రభావితం చేస్తున్న ఏఐ.. ప్రాథమిక స్థాయిలో ఎలా పనిచేస్తుంది?
ఓ ఐదు కాన్సెప్టులను అర్థం చేసుకుంటే ఇది గ్రహించడం సాధ్యమే అంటున్నారు టెక్ నిపుణుడు శ్రేయస్ నఫాడ్.

1. టోకెన్స్: ఏఐ మోడల్స్ అక్షరాలను, పదాలను చదవవు. అవి చదివేది ‘టోకెన్స్’ను. ‘ఏఐ’ భాషలో టోకెన్‌ను పరమాణువుగా చెప్పవచ్చు. అది మనం ఇచ్చిన ప్రామ్ట్‌లోని పదం కావొచ్చు. పదంలోని భాగమో, విరామ చిహ్నమో కావొచ్చు. చాట్ జీపీటీ, జెమినై లాంటి ‘ఏఐ’ ప్రొడక్ట్స్ తెరవెనక ఈ టోకెన్స్‌ను లెక్కిస్తాయి. కొత్త ‘ఏఐ’ మోడ ల్స్ సెకనుకు పది లక్షలకు పైగా టోకెన్లను జ్ఞాపకం ఉంచుకోగలవు. అయితే సుదీర్ఘ చాట్స్‌లోని పూర్వభాగాలను ‘ఏఐ’ మర్చిపోతుంది.
2. కాంటెక్ట్స్ విండో: ఒక ‘ఏఐ’ మోడల్ ఒకేసారి చూసి పరిగణించగలిగే, టోకెన్లలో కొలిచే టెక్ట్స్ పరిమాణం ఇది. ఇందులో మన సూచనలు, సంభాషణ చరిత్ర, పంచుకున్న డాక్యుమెంట్లు అన్నీ ఉంటాయి. డేటా విశ్లేషణలాంటి పనులకు సంబంధించి మన సంభాషణలోని పాత భాగాలను ‘ఏఐ’ మరిచిపోవచ్చు. అది బగ్ కాదు. కేవలం కాంటెక్ట్స్ విండోపై స్థలం సరిపోనందువల్లనే ఇలా జరుగుతుంది.
3. టెంపరేచర్: మనం ‘ఏఐ’ని ఏదైనా రాయమని అడిగితే... అవుట్‌పుట్ ఎంత యాదృచ్ఛికంగా, ఊహించదగినదిగా ఉంటుందో నిర్ణయించే ‘టెంపరేచర్’ అనే సెట్టింగ్ ఉంటుంది. లో టెంపరేచర్ (జీరోకి దగ్గరగా): ఏఐ సురక్షితంగా వ్యవహరిస్తుంది. అవుట్‌పుట్ స్థిరంగా, కచ్చితంగా, కొంచెం బోరింగ్‌గానూ ఉంటుంది. హై టెంపరేచర్ (1కి దగ్గరగా లేదా అంతకన్నా ఎక్కువ): ఏఐ ఆశ్చర్యపరిచే పదాలూ, ఆసక్తికరమైన ఆలోచనలను సృజనాత్మకంగా ఎంచుకుంటుంది. కొన్నిసార్లు అద్భుతంగా పనిచేస్తుంది.
4. హెలూసినేషన్: ఒక్కోసారి ‘ఏఐ’ నిస్సంకోచంగా మనకు తప్పుడు సమాధానాలు ఇస్తుంది. అంటే ఒక దోషపూరిత సమాధానాన్ని వాస్తవంగా చెప్పడం. మనమేదైనా ‘లేని’ పుస్తకం గురించి ‘ఏఐ’ని అడిగామనుకోండి. అది రచయిత పేరు, ప్రచురణ సంవత్సరం, పుస్తక సారాంశం.. ఇవన్నీ అందిస్తుంది. ఇలా జరగటానికి కారణం... ‘ఏఐ’ లాంగ్వేజ్ మోడల్స్, డేటాబేస్‌లు కావు. అవి వాస్తవాలను వెతకవు. అవకాశమున్న తర్వాతి టోకెన్‌ను అవి అంచనా వేస్తాయి. భారీస్థాయులో పనిచేసే ఆటో కంప్లీట్‌లాంటివి ఇవి.
ప్రమాదం ఏమిటంటే.. ‘ఏఐ’కి ఏదైనా విషయం తెలియకపోతే ‘నాకు తెలియదు’ అని చెప్పదు. సరైన సమాధానంలాగా ఉండేదాన్ని చూపిస్తుంది. అది అలాగే శిక్షణ పొందింది! సరైన జవాబు చెప్పేటప్పుడు చూపించే ధీమానే తప్పుడు సమాధానాలు చెబుతున్నపుడూ ప్రదర్శిస్తుంది. అందుకే వాస్తవాలు, గణాంకాలు, వైద్యసలహాలు, చట్టపరమైన సమాచారం లాంటి అంశాల్లో ‘ఏఐ’ని గుడ్డిగా నమ్మడం ఒకరకంగా నష్టదాయకం. దీన్ని కేవలం ఓ తొలి వనరుగా ఉపయోగించి, సరిచూసుకోవడమే అన్నివేళలా మేలు. ఈ ‘హెలూసినేషన్’ను అర్థం చేసుకుంటే ‘ఏఐ’ని పక్కనపెట్టెయ్యడం కాకుండా దాన్ని మరింత తెలివిగా ఉపయోగించొచ్చు.
5. ఆర్‌ఏజీ: ‘రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్’ (ఆర్‌ఏజీ). ‘ఏఐ’ మోడల్‌కు ఒక నిర్దిష్ట తేదీ వరకూ ఉన్న డేటాపై శిక్షణ ఇస్తారు. దానికి కంపెనీ అంతర్గత పత్రాల గురించీ, గత వారం సంఘటనల గురించీ ఏమీ తెలియదు. మనం అప్‌లోడ్ చేసిన పీడీఎఫ్ ఫైలు గురించీ కూడా తెలియదు. మరి ‘ఈ ఫైల్ గురించి ప్రశ్నలు అడగండి’ అనటం ఎలా సాధ్యం? మనం ఒక పత్రాన్ని అప్‌లోడ్ చేసినప్పుడు సిస్టమ్ మొత్తం పత్రాన్ని ఏఐ మెదడులోకి పంపదు. దానికి బదులుగా అది పత్రాన్ని భాగాలుగా విభజించి, వాటిని ‘వెక్టార్ డేటాబేస్’ అనే ప్రత్యేక డేటాబేస్‌లో నిల్వ చేస్తుంది. ఇది కేవలం కీ వర్డ్స్‌ను కాకుండా అర్థాన్నే గ్రహిస్తుంది. మనం ఓ ప్రశ్న అడిగినప్పుడు సిస్టమ్ మొదట ఈ డేటాబేస్‌లో సంబంఽధమున్న భాగాల కోసం వెతికి, వాటిని పొందుతుంది.
గత రెండేళ్లలో రూపొందించిన దాదాపు ప్రతీ ‘ఏఐ’ ఉత్పత్తికీ ఇదే వెన్నెముక. కంపెనీ విధానాలు తెలిసిన కస్టమర్ సపోర్ట్ బాట్‌లు, చట్టపరమైన పత్రాల నుంచి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగల ‘ఏఐ’ అసిస్టెంట్లు, పరిశోధన పత్రాలను సంగ్రహపరిచే టూల్స్... ఇవన్నీ ‘ఆర్‌ఏజీ’పైనే నిర్మితమయ్యాయి.
టోకెన్స్ గురించి తెలిస్తే.. మెరుగైన ప్రామ్ట్‌లను రాయొచ్చు. కాంటెక్ట్స్ విండోలను అర్థం చేసుకుంటే.. ఏఐ అసిస్టెంట్ ఎందుకు గందరగోళంగా ప్రవర్తిస్తుందో గ్రహించవచ్చు. టెంపరేచర్‌పై అవగాహన ఏ పనికి ఏసెట్టింగ్ ఉపయోగించాలో తెలుపుతుంది. హెలూసినేషన్ గురించిన పరిజ్ఞానం గుడ్డిగా ఏఐని నమ్మకుండా చేస్తుంది. ఆర్‌ఏజీని అర్థం చేసుకుంటే- ఏదైనా ఏఐ ప్రొడక్ట్.. మీ డేటా గురించి తెలుసని చెప్తే.. వాస్తవంగా అక్కడ ఏం జరుగుతోందో అవగాహన వస్తుంది!
ఏదేమైనా నిప్పును జాగ్రత్తగా వాడుకుంటే వంట చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే అది ఇంటినే తగలబెట్టగలదు. వినియోగించేవాళ్లే విచక్షణతో వ్యవహరించాలి. ‘ఏఐ’ ఎల్లప్పుడూ కచ్చితమైన పరిష్కారాలు అందిస్తుందనే భ్రమలుంటే వాటిని వదిలేసి ఎప్పటికప్పుడు వాస్తవాలను ‘క్రాస్ చెక్’ చేసుకోవాల్సిందే! అధికారిక ఆధారాలతో సరిచూసుకొని, వాస్తవాలను ధ్రువీకరించుకోవాల్సిన బాధ్యత మనదే! ఈ అప్రమత్తత ఎల్లవేళలా శ్రేయస్కరం! ‘ఏఐ’ మన స్నేహితుడూ, మార్గదర్శకుడూ కావొచ్చు... కానీ మన జీవితం మన అధీనంలోనే ఉంచుకోవాలి.
- సీహెచ్. వేణు
ఈ వార్తలు కూడా చదవండి:
ఎలుకల నుంచి మనుషులకు హంటా వైరస్..
Read Latest Telangana News and National News