శుభలేఖ పంపితే...ఇంటికే ‘శ్రీవారి అక్షింతలు’
ABN , Publish Date - May 10 , 2026 | 10:47 AM
సాధారణంగా వివాహం తర్వాత శ్రీవారిని దర్శించుకోవడమో, తిరుమలలోనే శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవడమో చేస్తుంటారు చాలామంది.
సాధారణంగా వివాహం తర్వాత శ్రీవారిని దర్శించుకోవడమో, తిరుమలలోనే శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవడమో చేస్తుంటారు చాలామంది. అయితే అలా వీలుకాని వాళ్లకు కూడా శ్రీవారి దైవాశీర్వాదం లభిస్తుంది. అది కూడా ఉచితంగా... ‘నవ వధూవరులకు శ్రీవారి అక్షింతలు’ పేరిట టీటీడీ గత కొన్నేళ్లుగా ఈ సేవను అందిస్తోంది. ఆ విశేషాలే ఇవి...
వివాహ బంధంలోకి అడుగుపెట్టే ప్రతీ జంట తమకు శ్రీ వేంకటేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటుంది. నూతన వధూవరులు స్వామి సన్నిధిని చేరుకుని తన్మయత్వం చెందుతారు. అయితే ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందులతో అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. కొత్త జంట కోటి ఆశలతో సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఎంతో విశిష్టమైన బంధానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందితే అంతకన్నా కావాల్సిందేముంటుంది.
ఈక్రమంలోనే ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ (టీటీడీ) పెళ్లి చేసుకోబోయే ప్రతీ జంటకు ప్రత్యేకంగా పూజలు చేసిన పెళ్లి సామగ్రిని అందించేలా టీటీడీ 2007 జూన్ 30వ తేదీన ‘నవ వధూవరులకు శ్రీవారి అక్షింతలు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సుమారు 19 ఏళ్లుగా ప్రతీ ఏడాది ‘శుభలేఖ’ పంపిన లక్షకుపైగా వధూవరులకు శ్రీవారి దీవెనలతో కల్యాణం జరుగుతోంది. టీటీడీ అందిస్తున్న ఈ సేవకు స్వామి భక్తుల నుంచి విశేష స్పందన ఉంది. కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణ వంటి రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన స్వామివారి భక్తులు ఈ సేవను వినియోగించు కుంటున్నారు. పెళ్లి శుభలేఖలను టీటీడీకి పంపుతున్నారు. శ్రీవారి అక్షింతలు అందుకుంటున్నారు.
ఏయే వస్తువులు పంపుతారంటే...
మన సమాజ సంస్కృతిలో గృహస్థ ధర్మం కీలకం కావడంతో వఽధూవరుల కల్యాణంలో మొదటి ఘట్టంగా కంకణధారణ చేస్తారు. అలాగే ఉపద్రవాల నుంచి రక్షించే రక్షాబంధనమైన కంకణాలను వరుడి కుడిచేతికి, వధువు ఎడమచేతికి ధరింపజేస్తారు. ఇందు కోసం శ్రీపద్మావతి అమ్మవారి ఆశీస్సులతో సకల శుభాలు కోరుతూ కుంకుమ, కంకణ ధారణకు ‘కంకణం’ పంపుతున్నారు. ఇక, వివాహంలో చివరిగా తలంబ్రాలు పోసే ఆచారం ఉంది. ఈ క్రమంలో సకల మంగళాలు కలగాలని, సత్కర్మలు పెంపొందించాలని,
దాంపత్య జీవితం ఫలప్రదం కావాలని, భార్యాభర్తలు పరస్పరం ప్రీతిపాత్రులు కావాలని, వారికి సిరిసంపదలు కలగాలని కోరుతూ టీటీడీ శ్రీవారి ఆశీస్సులతో ‘తలంబ్రాలు’ పంపుతుంది. వీటితో పాటు వివాహ వ్యవస్థ గురించి తెలిపేందుకు ‘కల్యాణ సంస్కృతి’ పేరుతో ఓ పుస్తకాన్ని కూడా అందుకుంటారు. ముఖ్యంగా శ్రీవారు, అమ్మవారి ఫొటోలతో కూడిన వేదాశీర్వచన పత్రికను టీటీడీ ఈవో పేరుతో పంపుతున్నారు. దీనికోసం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో తపాలా విభాగం సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ... ప్రతీ ఏడాది లక్షకుపైగా నూతన జంటలకు శ్రీవారి ఆశీస్సులతో కూడిన అక్షింతలు, కంకణాలు, పసుపు, కుంకుమను పంపుతున్నారు.
శుభలేఖ ఎక్కడికి పంపాలి?
వివాహబంధంలోకి అడుగుపెట్టే దంపతులు తమ పెళ్లి పత్రికను టీటీడీ చిరునామాకు పంపాల్సి ఉంటుంది. దీనికోసం తమ పూర్తి చిరునామాతో ‘కార్యనిర్వహణాధికారి, టీటీడీ పరిపాలన భవనం, కేటీ రోడ్డు, తిరుపతి 517501’ చిరునామాకు వివాహపత్రికను పంపాలి. పత్రిక అందుకున్న 30 రోజులలోపు టీటీడీ నుంచి ఈ సామగ్రిని నూతన దంపతులు అందుకుంటారు. తిరుపతికి సమీపంలో ఉండేవారైతే నేరుగా కూడా తమ వివాహ శుభలేఖను అందజేసి అక్షింతలు, కంకణాలు అందుకోవచ్చు.
అదనపు వివరాలకు కాల్‌సెంటర్ 155257 నెంబరును భక్తులు సంప్రదించి తెలుసుకోవచ్చు. వివాహం అనేది ప్రతీ కుటుంబంలో ఒక పవిత్రమైన సంబర ఘడియ. ఈ శుభసందర్భాన్ని ఆధ్యాత్మికంగా మార్చేలా టీటీడీ కొనసాగిస్తున్న ఈ సేవపై భక్తుల నుంచి విశేష స్పందన ఉంది. టీటీడీ నుంచి వచ్చే ఈ కానుకలను అందుకునే భక్తులు ‘స్వయంగా పద్మావతిశ్రీనివాసులే ఆశీస్సులు అందించార’ని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కొత్త బంధానికి దైవ ఆశీర్వాదం లభించిందని సంబరపడుతున్నారు.
జగదీష్ జంగం, తిరుమల