Share News

మోదీని చూసి నేర్చుకుంటేనే...

ABN , Publish Date - May 10 , 2026 | 12:38 AM

ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. అయితే, ప్రజలు మాత్రం ఎన్నికలు ఏవైనా రాజకీయ పార్టీలకు తమదైన రీతిలో సంకేతాలు, సందేశాలు పంపుతుంటారు.

మోదీని చూసి నేర్చుకుంటేనే...

ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. అయితే, ప్రజలు మాత్రం ఎన్నికలు ఏవైనా రాజకీయ పార్టీలకు తమదైన రీతిలో సంకేతాలు, సందేశాలు పంపుతుంటారు. మన దేశంలో ప్రతి ఎన్నిక సందర్భంగా జరుగుతున్నది ఇదే! సోషల్‌ మీడియా ప్రవేశంతో అప్పుడప్పుడూ ప్రజలు విష ప్రచారం ప్రభావానికి గురవుతున్నప్పటికీ ఆ వెంటనే మేల్కొని రాజకీయ పార్టీలను ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతున్నారు. తాజాగా జరిగిన నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల్లో కూడా ప్రజలు తమదైన శైలిలో రాజకీయ పార్టీలకు సంకేతాలతో పాటు సందేశాలు, హెచ్చరికలూ పంపారు. అధికారంలో ఉన్నవారు మోసాలకు పాల్పడటం వల్ల గెలిచారని ఓడిపోయిన పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి కానీ ప్రజల మనసులో ఏముందో అర్థం చేసుకొనే ప్రయత్నం చేయడంలేదు. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ఎన్నికలే ఇందుకు ఉదాహరణ. అక్కడ అధికారంలో ఉన్నవారు ఓడిపోయారు. తరాలు మారుతున్నాయి. ప్రజల ఆలోచనలూ మారుతున్నాయని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్షాలు గుర్తించడం లేదు. పశ్చిమ బెంగాల్‌ ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటగా ఉండింది. నాలుగు దశాబ్దాలపాటు రాష్ర్టాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించాయి. ఇప్పుడు అవే కమ్యూనిస్టు పార్టీలు పశ్చిమ బెంగాల్లో సోదిలో లేకుండా పోయాయి. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీతో విభేదించి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించిన మమతా బెనర్జీ పదిహేనేళ్లపాటు పాలించి తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. మూడు పర్యాయాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పట్ల ముఖం మొత్తని ప్రజలు ఇతర రాజకీయ పార్టీల పట్ల వ్యతిరేకత ఎందుకు ఏర్పరచుకుంటున్నారు అన్న ప్రశ్నకు ప్రతిపక్షాలు, ముఖ్యంగా ‘ఇండియా’ కూటమి పార్టీలు సమాధానం అన్వేషించుకోవాలి. పొరుగున ఉన్న ఒడిశాలో ఐదు పర్యాయాలు అధికారంలో ఉండిన బిజూ జనతాదళ్‌ను మట్టి కరిపించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే మమతా బెనర్జీ మేల్కొని ఉండాల్సింది. అలా చేయకుండా అధికారంలో ఉన్నప్పుడు లెక్కలేనితనంతో వ్యవహరించడంతోపాటు రాజకీయ ప్రత్యర్థి బీజేపీ ఎత్తుగడలను అర్థం చేసుకోకుండా ఓటమిని కొనితెచ్చుకున్నారు.


భయానక బెంగాల్‌...

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల నేతృత్వంలో బీజేపీ వరుస విజయాలు ఎలా సాధించగలుగుతోంది? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కానీ, ఆ పార్టీతో జతకట్టే ఇతర పార్టీలుగానీ ఎన్నికల్లో పరాజయాలను ఎందుకు మూటగట్టుకుంటున్నాయి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. మోదీ–షా ద్వయం దేశంలో మరో రాజకీయ పార్టీని బతకనివ్వరా! వ్యవస్థలను చెరబట్టి అధికారంలో కొనసాగుతారా? అని ఆక్రోశం వెళ్లగక్కుతున్న పార్టీలు అలా ఎందుకు జరుగుతోందో తెలుసుకొనే ప్రయత్నం చేయడం లేదు. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టుల పాలన సాగినప్పుడు భయానక వాతావరణం ఉండింది. ఎదిరించిన ఎందరో హత్యలకు గురయ్యారు. శాంతిభద్రతలు అడుగంటాయి. అభివృద్ధి మృగ్యమైంది. దీంతో బిక్కు బిక్కుమంటూ గడిపిన ప్రజలు మమతా బెనర్జీ రూపంలో ప్రత్యామ్నాయం కనిపించగానే ఆదరించి అందలం ఎక్కించారు. వామపక్షాల నుంచి అధికారం కైవసం చేసుకున్న మమతా బెనర్జీ కూడా కామ్రేడ్ల బాటలోనే నడిచారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ మూకలు రెచ్చిపోయాయి. ప్రజల హక్కులను హరించారు. అత్యాచారాలు, హత్యాకాండ నిత్యకృత్యమయ్యాయి. ఒక వర్గం ప్రజలను అతిగా సంతృప్తిపరిచేందుకు మరో వర్గం ప్రజలను నిర్లక్ష్యం చేశారు. అత్యాచారానికి గురైన ఒక మహిళ తనకు న్యాయం జరిగే వరకు, అంటే మమతా బెనర్జీ అధికారం కోల్పోయే వరకు కాళ్లకు చెప్పులు ధరించనని శపథం చేశారు. అత్యాచారానికి గురవడంతోపాటు హత్యకు గురైన ఒక వైద్య విద్యార్థిని తల్లి ఆవేదన కూడా ఇదే విధంగా ఉండింది. ఈ ఇద్దరు మహిళలకు తాజా ఎన్నికల్లో బీజేపీ టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంది. పశ్చిమ బెంగాల్‌ ప్రజల వెతలను గుర్తించిన బీజేపీ అగ్ర నాయకత్వం ఆ రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించింది. తక్షణ ఫలితాలు ఆశించకుండా పదిహేనేళ్ల పాటు నిరీక్షించి మరీ ఆ రాష్ర్టాన్ని జయించింది. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని మమతా బెనర్జీ నెత్తిన పెట్టుకుంటున్నారని ప్రచారం చేస్తూ స్థానిక ముస్లింలలో కూడా చీలిక తీసుకురావడంలో బీజేపీ విజయం సాధించింది. అసోంలో కూడా ఆ పార్టీ ఇదే ఫార్ములాతో స్థానిక ముస్లింలలో కొందరిని తన వైపునకు తిప్పుకొంది.


శ్వాస... ధ్యాస... రాజకీయమే!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా మాత్రమే ఎన్నికల్లో అత్యధిక విజయాలు ఎందుకు నమోదు చేయగలుగుతున్నారు? పన్నెండేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు పుంజుకోలేకపోతున్నది? అన్న ప్రశ్నలకు సమాధానం లేకపోలేదు. ‘పార్టీ కోసం నేనేం చేయాలి?’ అని బీజేపీ నాయకులు ఆలోచిస్తారు. ‘పార్టీ నాకోసం ఏం చేసింది?’ అని కాంగ్రెస్‌ నాయకులు ఆలోచిస్తారు. రెండు పార్టీల మధ్య ఇంత మౌలికమైన తేడా ఉన్నప్పుడు ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఇక మోదీ – అమిత్‌ షాల విషయానికి వద్దాం. వారిరువురికీ రాజకీయం తప్ప మరో ధ్యాస ఉండదు. ప్రధాని మోదీ దినచర్య ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. పగలంతా ఏం చేస్తారో కూడా తెలియదు. అధికారిక కార్యక్రమాలు, సమీక్షలలో పాల్గొన్న దాఖలాలు కనిపించవు. పాలనా వ్యవహారాలను నమ్మకస్తులైన అధికారులకు అప్పగించి కేవలం మార్గదర్శనం చేస్తారట! తన సమయంలో అధిక భాగాన్ని రాజకీయ వ్యూహ రచనకే ఆయన కేటాయిస్తారని చెబుతారు. రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలపై ఆయన ఇప్పటి నుంచే దృష్టి పెడతారు. ప్రతి సందర్భాన్నీ ఆ దృష్టితోనే చూస్తారు. ఆలోచనలు మోదీవి కాగా, వాటిని అమలు చేసే బాధ్యత అమిత్‌ షా తీసుకుంటారు. అసోం, పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలనే లక్ష్యంతో అక్కడ ప్రత్యర్థి పార్టీలలో బలమైన నాయకులను గుర్తించి, వారిని బీజేపీలోకి ఆహ్వానించి అవసరమైన అండదండలు అందించారు. అసోంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన హిమంత బిశ్వశర్మను పార్టీలోకి తీసుకొని ముఖ్యమంత్రిని చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నాయకత్వం లేకుండా చేశారు.


పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ వ్యవహార శైలి పట్ల అసంతృప్తితో ఉన్న సువేందు అధికారికి గేలం వేశారు. ఆయనను పార్టీలోకి తీసుకొని మమతా బెనర్జీపై యుద్ధం ప్రకటించారు. ఒకప్పటి కమ్యూనిస్టుల కోట అయిన పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగలదని ఎవరైనా ఊహించారా? తాజా ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. సువేందు అధికారిని ముఖ్యమంత్రిని చేశారు. ముల్లును ముల్లుతోనే తీయడం అంటే ఇదే కదా! ఓట్ల చోరీకి పాల్పడటం ద్వారా గెలిచారన్న మమతా బెనర్జీ వంటి వారి ఆరోపణలు తర్కానికి నిలబడటం లేదు. పోలింగ్‌ సందర్భంగా తమ ఓట్లు గల్లంతయ్యాయని ఎన్నికలు జరిగిన రాష్ర్టాలలో ప్రజలెవరూ గొడవలకు దిగకపోవడమే ఇందుకు నిదర్శనం.


మోదీ మాస్టర్‌ స్ట్రోక్‌...

యుద్ధానికి దిగేవారు ప్రత్యర్థుల బలాలు, బలహీనతల గురించి ముందుగా తెలుసుకోవాలి. ఈ విషయంలో ప్రధాని మోదీని మించిన వారు వర్తమాన రాజకీయాలలో మరొకరు కనిపించరు. ప్రత్యర్థి బలాలు, బలహీనతలతోపాటు ప్రజల సైకాలజీ అధ్యయనం చేసి తదనుగుణంగా వ్యూహ రచన చేయడంలో నరేంద్ర మోదీ దిట్ట. ఎన్నికలకు ముందు రచించే వ్యూహాలే కాదు, ఫలితాల తర్వాత వ్యూహాలు రచించడంలోనూ మోదీకి మోదీయే సాటి. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవ సభలో బెంగాలీ ప్రజలకు ప్రధాని మోదీ చేసిన సాష్టాంగ ప్రణామం ఆ కోవలోదే. రాజకీయాల్లో అదో మాస్టర్‌ స్ర్టోక్‌ అనే చెప్పాలి. మరో ఎన్నిక దాకా బెంగాలీ ప్రజల చూపు బీజేపీ వైపే ఉండేలా కట్టిపడేసే తారక మంత్రం. ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ పార్టీ సెక్యులరిజం పేరిట ముస్లింలను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు అతిగా వ్యవహరించిందన్న భావన దేశంలోని మెజారిటీ వర్గం ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది. మెజారిటీ ప్రజల మనోభావాలను గుర్తించిన ప్రధాని మోదీ తన రాజకీయాన్నీ అక్కడి నుంచే ప్రారంభించారు. గుజరాత్‌లో గోధ్రా సంఘటన జరిగిన తర్వాత ముస్లింలు ఊచకోతకు గురయ్యారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ఆశీస్సులతోనే నాటి మారణ హోమం జరిగిందని ప్రచారమైంది. అమెరికా వంటి దేశాలు మోదీకి వీసా కూడా నిరాకరించాయి. అయినా కూడా మోదీ వెనుకంజ వేయలేదు. ఫలితంగా ఇప్పుడు గుజరాత్‌లో బీజేపీ వరుస విజయాలు సొంతం చేసుకుంటోంది. మోదీ అధికారంలోకి రాకముందు గుజరాత్‌లో తరచుగా మత కలహాలు జరిగేవి. ఇప్పుడు మచ్చుకు కూడా కనిపించడం లేదు. గుజరాత్‌ ప్రజల మనసుల్లో ఏం ఉండిందో మిగతా రాష్ర్టాల ప్రజల మనసుల్లో కూడా అదే ఉంటుందని భావించిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక గుజరాత్‌ ఫార్ములానే మిగతా రాష్ర్టాల్లోనూ అమలుచేసి విజయాలు అందుకుంటున్నారు.


విశేషం ఏమిటంటే, బీజేపీకి మతతత్వ పార్టీ అన్న ముద్ర ఉన్నప్పటికీ ఆ పార్టీ ఏలుబడిలో ఉన్న రాష్ర్టాల్లో మత కలహాలు జరగకపోవడంతో ముస్లింలు కూడా ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. అలా కాకుండా గతంలోవలె మత కలహాలు జరుగుతూనే ఉంటే బీజేపీ పట్ల కూడా ప్రజలకు ముఖం మొత్తి ఉండేది. అవినీతి, కుటుంబ పాలన కూడా బీజేపీ అధికారంలో ఉన్న చోట కనిపించవు. బీజేపీ ఏలుబడి ఉన్న రాష్ర్టాలలో అసలు అవినీతి లేదా? అంటే లేదు అని చెప్పుకోకూడదు. కాకపోతే హద్దుల్లేని అవినీతి ఉండదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీతో కలసి నడుస్తున్న పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోకుండా... ఆత్మస్తుతి, పరనిందలతో కాలక్షేపం చేస్తున్నాయి. దీంతో మెజారిటీ ఓటర్లకు ఏకైక ప్రతినిధిగా బీజేపీ ఆవిర్భవించింది. మైనారిటీ వర్గాల ఓట్ల కోసం మిగతా పార్టీలు కొట్టుకుంటున్నాయి. ఈ కారణంగానే బీజేపీ వరుస విజయాలు అందుకోగలుగుతోంది. ప్రధాని మోదీలాగా రాజకీయాలను సూక్ష్మ స్థాయిలో పరిశీలిస్తూ పూర్తి సమయం అందుకోసమే కేటాయించే నాయకులు కాంగ్రెస్‌లోగానీ, ఇతర పార్టీలలోగానీ కనిపించడం లేదు.


ప్రతి అడుగూ వ్యూహాత్మకమే!

తమిళనాడు ఎన్నికలను మాత్రమే కాదు–శ్రీలంకతో సత్సంబంధాలను పెంపొందించుకోవడానికి వీలుగా ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ను ప్రధాని మోదీ ఎంపిక చేశారు. హిందీలో ఒక ముక్క కూడా మాట్లాడలేని రాధాకృష్ణన్‌ను ఈ పదవికి ఎంపిక చేస్తున్నట్టు మోదీ ప్రకటించినప్పుడు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గుజరాత్‌లో సోమనాథ్‌ దేవాలయం జీర్ణోద్ధరణ జరిగి 75 సంవత్సరాలైన సందర్భంగా ప్రధాని మోదీ చేస్తున్న ప్రచారాన్ని ఆషామాషీగా తీసుకోకూడదు. మెజారిటీ ప్రజలను మరింత సంఘటిత పరిచేందుకు ఆయన ఈ సందర్భాన్ని వాడుకుంటున్నారు. ఈ దేశంలో ఎన్నో దేవాలయాలను జీర్ణోద్ధరణ చేశారు. కానీ, సోమనాథ్‌ దేవాలయం విషయంలోనే ఎందుకింత ప్రచారం చేస్తున్నారంటే కారణం ఉంది. ఈ దేవాలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉండటమే కాదు– దాన్ని ధ్వంసం చేయడానికి గతంలో ఎంతో మంది ప్రయత్నించి విఫలం చెందారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఏం జరిగిందో ప్రజలకు తాజాగా తెలియజెప్పే ప్రయత్నం చేయడం ద్వారా మెజారిటీ ప్రజల మనసు గెలవాలని ప్రధాని మోదీ చూస్తున్నారు. ఆయన నోటి నుంచి వెలువడే ప్రతి మాటలో, వేసే ప్రతి అడుగులో రాజకీయం ఉంటుంది. కాంగ్రెస్‌తో సహా మిగతా ప్రతిపక్షాలు ఈ విషయాన్ని గుర్తించకుండా మతతత్వ పార్టీ అని బీజేపీని నిందించుకుంటూ పోవడం వల్ల ఫలితం ఉండదు. పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి రంగస్వామిని అక్కడి ప్రజలు వరుసగా ఎందుకు ఆదరిస్తున్నారు? మమతా బెనర్జీని ఎందుకు తిరస్కరించారు? అని ప్రతిపక్షాలు ప్రశ్నించుకుని సమాధానం కోసం ప్రయత్నిస్తే శాపనార్థాలు పెట్టే ప్రయాస తప్పుతుంది.


తమిళనాట విలక్షణ తీర్పు..

తాజా ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ ప్రజలు అరాచక పాలనకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని పంపగా, తమిళనాడు ప్రజలు విలక్షణమైన సందేశం ఇచ్చారు. అడ్డగోలు సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో డబ్బు పంచడం వంటివి తమను ఏమాత్రం ప్రభావితం చేయవని తమిళ ప్రజలు రుజువు చేశారు. తమిళనాడు అంటేనే ద్రవిడ ఉద్యమం గుర్తుకొస్తుంది. జాతీయ గీతంలో ద్రవిడ, ఉత్కళ, వంగ అని ఉందే కానీ తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం అని ఉండదు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే ద్రవిడనాడు అస్తిత్వం బలంగా ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తమిళనాడు కొంతకాలం పాటు కాంగ్రెస్‌ ఏలుబడిలో ఉన్నప్పటికీ ఆ తర్వాత ద్రవిడ ఉద్యమం బలపడి డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు ఆవిర్భవించి జాతీయ పార్టీలకు తావు లేకుండా చేశాయి. ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్‌–బీజేపీ వంటి జాతీయ పార్టీలు తోక పార్టీలుగా మారాయి. ఆరు దశాబ్దాలకు పైగా డీఎంకే, ఏఐఏడీఎంకేలే అధికారంలో ఉన్నాయి. దీంతో తమిళనాడు తమ సొంతం అని, మరో పార్టీకిగానీ నాయకుడికిగానీ ఇక్కడ తావు లేదని ఆ రెండు పార్టీలూ భావిస్తూ వచ్చాయి. తరాలు మారాయి. ద్రవిడ ఉద్యమంతో నేటి తరానికి బంధం తెగిపోయిందని గుర్తించలేక పోయారు. జాతీయ స్థాయిలో నేటి తరానికి కాంగ్రెస్‌ దూరమైనట్లే ద్రవిడ పార్టీలు కూడా తమిళనాడులో నేటి తరానికి దూరమయ్యాయి. ఫలితమే సినీ నటుడైన జోసెఫ్‌ విజయ్‌ టీవీకే పార్టీని ఏర్పాటుచేసి తాజా ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించారు. యువతరం మొత్తం టీవీకేకు జై కొట్టింది. కేవలం సినిమా గ్లామర్‌ మాత్రమే వారిని ఆకర్షించిందని భావిస్తే పొరపాటు. మార్పు కోసం విజయ్‌ను యువత ఆదరించింది. ద్రవిడ పార్టీల పట్ల వారికి ముఖం మొత్తి ఉంటుంది. యువతకు తాము దూరమవుతున్న వాస్తవాన్ని కాంగ్రెస్‌ పార్టీ గుర్తించనట్టుగానే ద్రవిడ పార్టీలు కూడా గుర్తించలేకపోయాయి. తమ రెండు పార్టీలూ బలంగా ఉన్నందున కొత్తగా ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకుడొచ్చినా చోటుండదని భావించాయి. తాజా ఎన్నికలతో అందరి అంచనాలూ తలకిందులయ్యాయి.


పెద్దగా హడావిడి లేకుండానే జోసెఫ్‌ విజయ్‌ ఏర్పాటుచేసిన టీవీకే 108 స్థానాలు గెలుచుకొని అతి పెద్ద పార్టీగా అవతరించింది. టీవీకే సంచలనాలు నమోదు చేయబోతున్నదని ఎన్నికలకు ముందే తెలిసిపోయింది. ప్రజలు మార్పు కోరుకుంటే అభ్యర్థుల చరిత్ర, డబ్బు చూడరని... ఎన్నికల వాగ్దానాలను కూడా పట్టించుకోరని టీవీకే విజయం రుజువు చేసింది. ప్రధాన ద్రవిడ పార్టీలకు మించి విజయ్‌ కూడా సంక్షేమ పథకాలు ప్రకటించినప్పటికీ ప్రజలకు వాటి గురించి తెలియదంటే అతిశయోక్తి కాదు. విజయ్‌ అధికారంలోకి వస్తే ఏమిస్తారు? అని చూడకుండా మార్పు వస్తే చాలు అని భావించిన వారు ఆయనకు ఓటు వేశారు. సంప్రదాయ పార్టీలవలె విజయ్‌ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో డబ్బు పంచలేదు. చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులు ఎవరో కూడా ప్రజలకు తెలియదు. కేవలం విజయ్‌ను చూసి ఓటు వేశారు. సినీ నటుడు అన్న మోజుతోనే ఓటు వేయడం మంచిదా? కాదా? అన్నది పక్కన పెడితే సంక్షేమం పేరిట అడ్డగోలు హామీలకు, డబ్బుకు ప్రభావితం కాకపోవడం శుభ పరిణామం. ఈ మార్పు దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికల్లోనూ కనిపిస్తే ఎంత బాగుంటుందో కదా!


హుందాగా స్టాలిన్‌...

ప్రజలు ప్రలోభాలకు లోను కాకుండా ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ ఎన్నికల తర్వాతే అసలైన రాజకీయం మొదలైంది. యథావిధిగా బీజేపీ తెర వెనుక నుంచి పావులు కదిపింది. ఎన్నికలకు ముందు తమతో చేతులు కలపడానికి నిరాకరించిన విజయ్‌ను అడ్డుకొనే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. ప్రముఖ నటుడు రజనీకాంత్‌ను తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్‌ వద్దకు రాయబారిగా పంపారు. రెండు ద్రవిడ పార్టీలూ చేతులు కలపాలని రజనీ ద్వారా సూచించారు. ఈ ఎన్నికల్లో కొళత్తూరు నియోజకవర్గంలో స్వయంగా ఓడిపోయి మానసికంగా కుంగిపోయిన స్టాలిన్‌ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. అన్నాడీఎంకేతో దశాబ్దాలుగా ఉన్న వైరాన్ని మరచిపోయి చేతులు కలపలేనని తన వద్దకు రాజీ ప్రతిపాదన తెచ్చిన వారితో ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో తనతో కలసి ఎన్నికల్లో పోటీ చేసిన మిత్ర పక్షాలను పిలిచి విజయ్‌కు మద్దతు ఇచ్చే విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా తనకు అభ్యంతరం ఉండదని స్పష్టం చేశారు. ఫలితంగానే టీవీకేకు బయటి నుంచి మద్దతు ఇవ్వడానికి నలుగురు సభ్యులున్న కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించాయి. ఇక్కడి వరకు స్టాలిన్‌ హుందాగా వ్యవహరించారు. అయితే, ఐదు దశాబ్దాలుగా డీఎంకేతో కలసి నడిచిన కాంగ్రెస్‌ పార్టీ మాత్రం టీవీకేకు మద్దతు ప్రకటించడంలో హడావిడి ప్రదర్శించింది. డీఎంకే అధినేత స్టాలిన్‌కు మాట మాత్రం చెప్పకుండా విజయ్‌ పార్టీకి మద్దతు ప్రకటించింది. దీంతో ఆగ్రహానికి గురైన స్టాలిన్‌ ఇకపై తాము ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండబోమని ప్రకటించారు. మిత్ర పక్షాలకు బీజేపీ ద్రోహం చేస్తోందని విమర్శిస్తూ వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇప్పుడు అదే పని చేసిందన్న విమర్శలను ఎదుర్కొంటోంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవడంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకోవడాన్ని తప్పు పట్టిన రాహుల్‌ గాంధీ... తమిళనాడులో తమ పార్టీ స్టాలిన్‌కు దూరం కావడాన్ని ఎలా అనుమతించారో తెలియదు. ఏదేమైనా కాంగ్రెస్‌–డీఎంకే మధ్య ఏర్పడిన వైరం జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపబోతున్నది. తమిళనాడు చరిత్రలో తొలిసారిగా హంగ్‌ ఏర్పడింది.


మామూలుగా చూస్తే అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు. సభలో మెజారిటీ నిరూపించుకోలేకపోతే ప్రభుత్వం అప్పుడే పతనమవుతుంది. అయితే, మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని ముందే రుజువు చేసుకోవాలని కోరడం వల్ల విజయ్‌ పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడింది. రాజకీయ అనుభవరాహిత్యం వల్ల కాబోలు విజయ్‌ మూడు రోజులుగా గవర్నర్‌ను కలసి నిరాశగా వెనుదిరిగారు. గవర్నర్‌ మనసు తెలిసిన తర్వాత అయినా తగిన సంఖ్యా బలం సమకూర్చుకోకుండా ఆయన లోక్‌ భవన్‌కు వెళ్లాల్సింది కాదు. ఇప్పుడు వ్యవహారం కొలిక్కి వచ్చింది కానీ, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మరో 11 మంది మద్దతు కూడగట్టుకోలేక విజయ్‌ సతమతమైన సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగిన వైసీపీ వాళ్లు విజయ్‌ను తామే గెలిపించామని ప్రచారం చేసుకోవడం ఫన్నీగా ఉంది. నవ్వులపాలు అవుతామని తెలిసి కూడా వైసీపీ వాళ్లు ఇలా ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో తెలియదు. వింత మనుషులు– వింత చేష్టలు అంటే ఇదేనేమో!

Updated Date - May 10 , 2026 | 12:48 AM