నెబ్రాస్కాలో వైభవంగా టీఎస్ఎన్ వనభోజనాలు
ABN , Publish Date - Sep 22 , 2026 | 05:06 PM
నెబ్రాస్కాలోని తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా వనభోజనాలు ఆత్మీయ వాతావరణంలో సందడిగా సాగాయి. రోజువారీ బిజీ జీవితానికి కొంత విరామం ఇస్తూ కొత్త పరిచయాలకు, పాత స్నేహాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ వేడుక చక్కని అవకాశాన్ని కల్పించింది.
భారీ వర్షంలోనూ తగ్గని ఉత్సాహం
ఆటపాటలు, సంగీతం, మెహందీ, చిన్నారుల ఫేస్ పెయింటింగ్, రుచికరమైన వంటకాలతో సందడి
ఒమాహా, నెబ్రాస్కా: నెబ్రాస్కాలోని తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా(TSN) వనభోజనాలు ఆత్మీయ వాతావరణంలో సందడిగా సాగాయి. రోజువారీ బిజీ జీవితానికి కొంత విరామం ఇస్తూ కొత్త పరిచయాలకు, పాత స్నేహాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ వేడుక చక్కని అవకాశాన్ని కల్పించింది. ముఖ్యంగా చిన్నారులను తెలుగు సమాజానికి మరింత దగ్గర చేస్తూ.. మన సంస్కృతి, సంప్రదాయాలతో అనుబంధాన్ని పెంపొందించే వేదికగా నిలిచింది. ఈ నెల 13న యూజీన్ టి.మహోనీ స్టేట్ పార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా TSN కమిటీ సభ్యులు, వలంటీర్లు సమన్వయంతో ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించారు.
వనభోజనాల్లో రుచికరమైన వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వాటి తయారీలో సుందర్ చొక్కరా, అలగన్ చిన్నప్ప, పావులూరి సత్యనారాయణ, వెంకట్ మాదలి, వేణు మురకొండ, రమేష్ రాయపాటి, వెంకట్ స్వర్ణ, రాజేష్ చింతపల్లి, మధు, రాజు దాట్ల, నారాయణ, సాంబ దివ్వెల, అనూప్ మాణిక్యం, చైతన్య రవిపాటి, యుగంధర్ పంగా, అవినాష్ మదూరి, ఉమ అద్దుల, రాజా కోమటిరెడ్డి, అనిల్ పోతినేని, జయకృష్ణ నల్లా, వంశీ కంచెర్ల, లక్ష్మీ గోరంట్లతో పాటు పలువురు స్నేహితులు, వలంటీర్లు పాలుపంచుకున్నారు. అందరూ కలిసి వంటకాలను సిద్ధం చేసి అతిథులకు ఆత్మీయంగా వడ్డించారు. ఈసారి వనభోజనాల్లో మరో విశేషంగా TSN చరిత్రలో తొలిసారిగా మాంసాహార వంటకాలను అందించారు. TSN ఉపాధ్యక్షుడు తాతారావు, తన స్నేహితులతో కలిసి స్వయంగా మాంసాహార వంటకాలను తయారుచేసి అతిథులకు వడ్డించారు. వంటకాల తయారీకి తోడ్పాటుతో పాటు అవసరమైన డిషెస్‌ను అందించడంలో Hello India, Astoria సహకరించాయి.

భోజనాలతో పాటు చిన్నారులు, పెద్దల కోసం వివిధ ఆటలు, సరదా పోటీలు నిర్వహించారు. మెంబర్‌షిప్ కమిటీ ఛైర్మన్ బాల కామిరెడ్డి ఆధ్వర్యంలోని బృందం నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్‌కు మంచి స్పందన లభించింది. పోటీల అనంతరం విజేతలకు పతకాలు కూడా అందజేశారు. TSN కల్చరల్ ఛైర్‌పర్సన్ రమ్య, కో-ఛైర్‌పర్సన్ వినీల, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలు మాధురి, TSN కమిటీ సభ్యురాలు శ్వేత హాజరైన వారిని సమన్వయం చేస్తూ నృత్య కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు వారితో కలిసి నృత్యంలో పాల్గొనడంతో అక్కడ ఉల్లాసభరిత వాతావరణం నెలకొంది. RAAGA అందించిన సంగీతం వేడుకకు మరింత ఉత్సాహాన్ని జోడించింది. మహిళలకు గోరింటాకు, చిన్నారులకు ఫేస్ పెయింటింగ్ ఏర్పాటు చేశారు. సంగీతం, నృత్యాలు, ఆటలు, కబడ్డీ, చిన్నారుల కేరింతలతో రోజంతా కుటుంబాలన్నీ ఆనందంగా గడిపాయి.

ఈ సందర్భంగా TSN అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ మాట్లాడుతూ.. వనభోజనాలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా తెలుగు కుటుంబాల మధ్య ఆత్మీయతను పెంపొందించే సామాజిక వేదికగా నిలిచాయని పేర్కొన్నారు. విదేశీ గడ్డపై తెలుగు వారిని ఒకచోట చేర్చడంతో పాటు, కొత్త తరాన్ని తెలుగు సమాజానికి చేరువ చేస్తూ మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అనుబంధాన్ని కొనసాగించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. కార్యక్రమ విజయానికి కృషి చేసిన కమిటీ సభ్యులు, వలంటీర్లు, సహకార సంస్థలు, పాల్గొన్న కుటుంబాలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.




ఇవీ చదవండి:
కాలిఫోర్నియాలో వెంకట్ నాగం ’రచ్చబండ చర్చలు’, ’కలగూర గంప పుస్తకాల’ ఆవిష్కరణ
హుషారుగా ఫిలడెల్ఫియా మైదానంలో తానా మహిళల క్రికెట్ టోర్నమెంట్