కాలిఫోర్నియాలో వెంకట్ నాగం ’రచ్చబండ చర్చలు’, ’కలగూర గంప పుస్తకాల’ ఆవిష్కరణ
ABN , Publish Date - Sep 22 , 2026 | 01:34 PM
కాలిఫోర్నియా బే ఏరియా నగరమైన నెవార్క్‌లో "వీక్షణం - సాహితీ గవాక్షం" 14వ వార్షికోత్సవ వేదిక సాక్షిగా సాహిత్య పరిమళాలతో నిండిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆగస్టు 19వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఘనంగా జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): కాలిఫోర్నియా బే ఏరియా నగరమైన నెవార్క్‌లో ‘వీక్షణం - సాహితీ గవాక్షం’ 14వ వార్షికోత్సవ వేదిక సాక్షిగా సాహిత్య పరిమళాలతో నిండిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆగస్టు 19వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఘనంగా జరిగింది. ప్రముఖ రచయిత వెంకట్ నాగం రచనలు ‘రచ్చబండ చర్చలు’, ‘కలగూర గంప’ పుస్తకాల ఆవిష్కరణకు వీక్షణం ఆధ్వర్యంలో సాహిత్యాభిమానులు, రచయితలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాలిఫోర్నియా బే ఏరియాలో నెలకొన్న వీక్షణం సాహితీ సంస్థ 14వ వార్షికోత్సవ సమావేశం ఇందుకు వేదికైంది. బే ఏరియా శివారు నగరమైన నెవార్క్‌లో నివసిస్తున్న రచయిత్రి షంషాద్, అబ్దుల్లా స్వగృహంలో ఈ సమావేశం అత్యంత వైభవంగా జరిగింది.

ఈ సభకు తెలుగు సాహిత్యంలో ఘనాపాఠీలుగా కీర్తింపబడుతున్న కౌముది పత్రిక కిరణ్ ప్రభ, నెచ్చెలి పత్రిక ప్రధాన సంపాదకురాలు డా. కె. గీతామాధవి సభాధ్యక్షులుగా విచ్చేశారు. ‘రచ్చబండ చర్చలు’, ‘కలగూర గంప’ పుస్తకాలను కిరణ్ ప్రభ, డా. కె. గీతామాధవి, రమణ, శారద కాశీవఝల, షంషాద్, డా. సురేందర్ రెడ్డి, వెంకట్ నాగం, వాణి నాగం ఆహుతుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్ ప్రభ మాట్లాడారు. తెలుగు సాహిత్యంలో ప్రజలతో మమేకమయ్యే భాషలో ఆలోచనాత్మక కాలం శీర్షికలో పత్రికల్లో రచనలు చేయడం ఎంత ముఖ్యమో వివరించారు. వెంకట్ నాగం రచనలు సమాజంలోని విభిన్న అంశాలను స్పృశించాయని చెప్పుకొచ్చారు. ఈ కాలం రచయితలు అరుదుగా ఉంటారని, అమెరికాలో ఉన్న అతి కొద్దిమందిలో వెంకట్ నాగం ఒకరని ప్రశంసించారు. కాలం శీర్షికలో రచనలకు భారత్‌కు సంబంధించిన విభిన్న అంశాలను ఎంచుకోవడం, వాటిని పాఠకులతో అనుసంధానం చేస్తూ నడిపించడం, ఒక చక్కని ముగింపు ఇవ్వడమే కాకుండా, భిన్న ప్రముఖ పత్రికల సంపాదకీయం పేజీల్లో వాటిని వెలువరించడంలో వెంకట్ నాగం పరిణతి సాధించారని వెల్లడించారు. వెంకట్ నాగం వ్యాస రచనా ప్రయాణం మరింత ఉజ్వలంగా కొనసాగాలని కిరణ్ ప్రభ ఆకాంక్షించారు.

వీక్షణం వ్యవస్థాపకురాలు, సంధానకర్త, నెచ్చెలి పత్రిక ప్రధాన సంపాదకురాలు డా. కె. గీతామాధవి రచయిత సామాజిక దృక్పథాన్ని, సాహిత్య నిబద్ధతను ప్రశంసించారు. అనంతరం రచయిత వెంకట్ నాగం తన రచనల వెనుక ఉన్న ఆలోచనలను, ప్రజలతో మమేకమయ్యే అనుభవాలను సభతో పంచుకున్నారు.

అమెరికాలో నిర్వహిస్తున్న సాహితీ సభలు ఇండియాలోలాగా ఉన్నతంగా సాగుతున్నాయని వెంకట్ నాగం తెలిపారు. 25 ఏళ్ల క్రితం బే ఏరియాలో గరికిపాటి నరసింహారావు అవధానం కార్యక్రమంలో సంధానకర్తగా కిరణ్ ప్రభ వేదికపై ఉండగా చివరి బెంచిలో కూర్చొని కార్యక్రమాన్ని ఆసాంతం వీక్షించినట్లు చెప్పారు. తాను ఈరోజు వీక్షణం 14వ వార్షికోత్సవ సభలో కిరణ్ ప్రభ, డా. కె. గీతామాధవి అమృత హస్తాల మీదుగా తన పుస్తకాల ఆవిష్కరణ జరగడం, కిరణ్ ప్రభ పక్కన కూర్చొని తన ప్రసంగాన్ని వినిపించే అవకాశం రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నట్లుగా వెంకట్ నాగం పేర్కొన్నారు. ఈ మహావకాశాన్ని కల్పించిన వీక్షణం సాహితీ సంస్థకు, వ్యవస్థాపకురాలు డా. కె. గీతామాధవికు వెంకట్ నాగం ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డా. కె. గీతామాధవి వీక్షణం వేదిక 14 ఏళ్ల ప్రయాణం విశేషాలను వివరించడంతో ప్రారంభమై, అనంతరం వీక్షణం వార్షిక సంచిక ఆవిష్కరణ, వెంకట్ నాగం పుస్తకావిష్కరణ, డా. కె. గీతామాధవి రచించిన ‘అనగనగా అమెరికా’ పుస్తకావిష్కరణ, తదుపరి వీక్షణం ఆహుతుల ఆత్మీయ పరిచయం కార్యక్రమాలు జరిగాయి.

వీక్షణం ఆధ్వర్యంలో జరిగిన ఈ పుస్తకాల ఆవిష్కరణతో తెలుగు సాహిత్య ప్రపంచంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైందని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ఆసాంతం సభికులు రెట్టించిన ఉత్సాహంతో కరతాళ ధ్వనుల ద్వారా తమ హర్షాన్ని తెలిపారు. నిజమైన తెలుగు భాషకు పండగ అంటే ఇదేనని పలువురు వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు చదవండి
తానా మిడ్-అట్లాంటిక్ ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ విజయవంతం
డల్లాస్‌లో నేడు పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు
Read Latest NRI News And AP News And International News And Telugu News