వందేమాతరంపై కర్ణాటక అసెంబ్లీలో మళ్లీ రగడ
ABN , Publish Date - Sep 21 , 2026 | 03:35 PM
వందేమాతరంపై కర్ణాటక అసెంబ్లీ, విధానసభలో సోమవారం కాసేపు రచ్చ జరిగింది. అధికార పార్టీ నేతలు వందేమాతరంలోని రెండు చరణాలే పాడగా.. ప్రతిపక్ష బీజేపీ నేతలు మొత్తం చరణాలను పాడారు. తర్వాత ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు.
ఇంటర్‌నెట్ డెస్క్: వందేమాతరంపై కర్ణాటక అసెంబ్లీ, విధానసభలో సోమవారం కాసేపు రచ్చ జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, పశ్చిమ కనుమలకు సంబంధించి కస్తూరిరంగన్ రిపోర్టుపై చర్చించడానికి కర్ణాటక ప్రభుత్వం మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. సోమవారం అసెంబ్లీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కార్యకలాపాలు ప్రారంభం కావడానికి ముందు నాయకులు వందేమాతరం గేయాన్ని ఆలపించారు. అయితే, రెండు చరణాల తర్వాత కాంగ్రెస్ నేతలు పాడడం ఆపేశారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం మొత్తం చరణాలు పాడారు. కాంగ్రెస్ నాయకులు రెండు చరణాలే పాడడంతో బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తర్వాత వివిధ ప్రముఖులకు స్పీకర్ జీఎస్ పాటిల్ సంతాపం తెలిపారు. గత నెల 27న కన్నుమూసిన ఎమ్మెల్యే ఆర్‌బీ శిరియణ్ణవర్‌కు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాళి అర్పించారు.
విధానసభలోనూ అదే సీన్
విధానసభలోనూ వందేమాతరంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక్కడ కూడా అధికార పార్టీ నేతలు వందేమాతరంలోని రెండు చరణాలే పాడగా.. ప్రతిపక్ష బీజేపీ నేతలు మొత్తం చరణాలు ఆలపించారు. అధికార పార్టీ నేతలు రెండు చరణాలే పాడడంపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండలి చైర్మన్ సలీం అహ్మద్.. రాజ్యాంగ పీఠికను చదువుతుండగానే బీజేపీ నేతలు మిగతా చరణాలను పూర్తిగా పాడారు. పూర్తి గేయాన్ని ప్లే చేయనందుకు ప్రభుత్వంపై బీజేపీ నేతలు విమర్శలు చేశారు. కాగా.. తన అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరంలోని మొదటి రెండు చరణాలనే పాడాలని కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు: డబుల్ సిల్వర్.. భారత షూటర్లను అభినందించిన ప్రధాని మోదీ
న్యూజిలాండ్ టూర్: టీమిండియాకు కొత్త చిక్కులు.. కీలక ప్లేయర్లకు విశ్రాంతి?