Share News

'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:28 PM

సినీ నటి త్రిషా కృష్ణన్‌పై చేసిన వ్యాఖ్యల వివాదంలో పోలీసులు అరెస్టయి, విడుదలైన.. డీఎంకే సీనియర్ నేత, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ చేసిన సమయంలో తానేమాత్రం భయపడలేదన్న ఆయన.. అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు.

'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్: సినీ నటి త్రిషా కృష్ణన్‌పై చేసిన వ్యాఖ్యల వివాదంలో పోలీసులు అరెస్టయి, విడుదలైన.. డీఎంకే సీనియర్ నేత, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విడుదల అనంతరం తన తండ్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో ఉన్న ఫొటోను సోషల్ మీడియా 'ఎక్స్'లో షేరే చేసిన ఆయన.. రాజకీయ ఒత్తిళ్లకు తాను భయపడబోనని స్పష్టం చేశారు.


'నేను కలైంజర్ మనవడిని.. ఎంకే స్టాలిన్ కుమారుడిని.. డీఎంకే కార్యకర్తను. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. రైతుల కోసం పోరాడే క్రమంలో ఒక్కసారి కాదు.. అవసరమైతే వందసార్లు అరెస్ట్ అయ్యేందుకైనా సిద్ధమే. ప్రజాసేవను ఎలాంటి అణచివేత ఆపలేదు' అని ఉదయనిధి స్టాలిన్ తన ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.


అంతకుముందు.. త్రిషా కృష్ణన్‌పై ఉధయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో మంగళవారం(ఈనెల 4న) పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం సాయంత్రం విడుదల చేశారు. ఆ తర్వాత అధికార పక్షాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారాయన. రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం.. ప్రజల దృష్టిని మళ్లించేందుకే తనను అరెస్ట్ చేయించిందని ఆరోపించారు. తంజావూరులో తాను చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి అసత్య ప్రచారం చేశారని, తప్పుడు కేసులు బనాయించి రాజకీయంగా వేధించేందుకు యత్నించారన్నారు. అరెస్ట్ చేసిన సమయంలో తానేమాత్రం భయపడలేదని, మీడియా ఎదుట ఈ చర్యను హాస్యాస్పదంగా భావిస్తున్నానని చెప్పి మరీ పోలీసులతో వెళ్లానని తెలిపారు. తానెప్పుడూ పారిపోలేదని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గబోనని చెప్పుకొచ్చారు ఉదయనిధి.


అలాగే గతంలో కరూర్ తొక్కిసలాట ఘటనను ప్రస్తావిస్తూ.. అధికార పక్షంపై ఉధయనిధి విమర్శలకు దిగారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించకుండా రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. తన అరెస్ట్‌ను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన డీఎంకే కార్యకర్తలు, మిత్రపక్ష, ఇతర రాజకీయ పార్టీల నేతలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.


ఇవీ చదవండి:

ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు

సునేత్రపై పవార్‌పై 'గంగీ గుడియా' వ్యాఖ్యలు.. 'మహా' రాజీయాల్లో దుమారం!

Updated Date - Aug 05 , 2026 | 12:39 PM