'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం
ABN , Publish Date - Aug 05 , 2026 | 10:17 AM
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియోను తాత్కాలికంగా తొలగించడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ స్థాయి సంఘం ఆదేశించింది. ఈ మేరకు మూడు రోజుల గడువు నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన జులై 23 నాటి వీడియోను తొలగించడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ సమాచార, కమ్యూనికేషన్ సాంకేతికత స్థాయి సంఘం ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవడం సహా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మెటాకు పార్లమెంటరీ కమిటీ మూడు రోజుల అల్టిమేటం జారీ చేసింది.
కమిటీ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే మెటాకు ప్రస్తుతమున్న సేఫ్ హార్బర్ రక్షణను పునఃసమీక్షించే అవకాశముందని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు.. వినియోగదారులు పోస్ట్ చేసే కంటెంట్‌కు కొన్ని చట్టపరమైన మినహాయింపులను పొందే అవకాశాన్ని సేఫ్ హార్బర్ కల్పిస్తుంది. అయితే.. ఆ నిబంధనల్ని పాటించకపోతే మాత్రం వాటిని ప్రభుత్వం, సంబంధిత అధికార సంస్థలు పునఃసమీక్షించేందుకు వీలుంటుంది.
కాగా.. ప్రధాని మోదీకి సంబంధించిన ఓ వీడియోను తాత్కాలికంగా తొలగించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై వివరణ కోరిన పార్లమెంటరీ కమిటీ.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మోటాకు సూచించినట్లు సమాచారం. ఈ అంశంపై మెటా నుంచి అధికారిక వివరణ కోసం ఎదురుచూస్తున్నామని కమిటీ వర్గాలు తెలిపినట్లు తెలుస్తోంది. కమిటీ సూచించిన గడువులోపు సంస్థ స్పందించకపోతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఇవీ చదవండి:
ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు
సునేత్రపై పవార్‌పై 'గంగీ గుడియా' వ్యాఖ్యలు.. 'మహా' రాజీయాల్లో దుమారం!