తుంగభద్రకు 2,159 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ABN , Publish Date - Jul 07 , 2026 | 01:34 PM
ఆలస్యమైతనేం.. నీటి రాకడ మొదలైంది. అడుగంటిన తుంగభద్ర జలాశయంలోకి కొత్తనీరు చేరుతోంది.
వానొచ్చే.. వరదొచ్చే..!
మలెనాడులో విస్తారంగా వర్షాలు
రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
- ఆంధ్రజ్యోతి, బళ్లారి(కర్ణాటక): ఆలస్యమైతనేం.. నీటి రాకడ మొదలైంది. అడుగంటిన తుంగభద్ర జలాశయంలోకి కొత్తనీరు చేరుతోంది. డ్యాం పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా సోమవారం 1550 క్యూసెక్కుల వరద మొదలై.. సాయంత్రానికి 2,159 క్యూసెక్కులకు పెరిగింది. రెండు రోజుల కిందటివరకూ చుక్కనీరు రాకపోవడంతో డ్యాం వెలవెలబోయింది. రైతాంగం, అధికార యంత్రాంగంలో నిస్తేజం అలుముకుంది. ఈ తరుణంలో నైరుతి రుతుపవనాలు కరుణించాయి. కర్ణాటకలోని మలెనాడు, తుంగభద్ర ఎగువ పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో తుంగ, భద్ర నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. తుంగ జలాశయం నిండటంతో పదిగేట్లను ఎత్తి 18 వేల క్యూసెక్కుల నీటిని సోమవారం దిగువకు విడుదల చేశారు. అక్కడి నుంచి తుంగభద్ర జలాశయానికి వరద నీరు చేరేందుకు సుమారు 310 కి.మీ. ప్రయాణించాల్సి ఉంటుంది. మరో రెండురోజుల్లో ఆ నీటి చేరికతో వరద పెరగనుంది. భద్ర జలాశయం కూడా నిండితే, వరద మరింత పెరుగుతుంది. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 1587.92 అడగుల వద్ద 9.379 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి జలాశయంలో 77.343 టీఎంసీల నీరు ఉన్నింది.
అప్పుడప్పుడు ఆలస్యం
తుంగభద్ర డ్యాంకు వరద ఆలస్యం కావడం ఇదే మొదటిసారి కాదు. 2002-03, 2003-04, 2004-05, 2016-17, 2023-24 నీటి సంవత్సరాల్లోనూ వరద ఆలస్యమైంది. కొన్నిసార్లు జూలై రెండోవారంలోనూ వదర మొదలైంది. జూలై, ఆగస్టు నెలల్లోనూ వర్షాభావ పరిస్థితుల కారణంగా చెప్పుకోదగ్గ వరద రాలేదు. డెడ్ స్టోరేజీకి పడిపోయిన సందర్భాలూ ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
సీఎం విజయ్‌కి మద్రాసు హైకోర్టు నోటీసులు
2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News