Share News

2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు.. గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు..

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:16 PM

దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక కోర్టు 2022లో విధించిన శిక్షలను సమర్థిస్తూ 38 మంది దోషులకు ఉరిశిక్షను, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు మంగళవారం ఖరారు చేసింది.

2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు.. గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు..
Gujarat High Court

దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక కోర్టు 2022లో విధించిన శిక్షలను సమర్థిస్తూ 38 మంది దోషులకు ఉరిశిక్షను, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు మంగళవారం ఖరారు చేసింది. ఈ కేసులో దాఖలైన అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది (Ahmedabad Serial Blasts).


2008, జులై 26న అహ్మదాబాద్‌లో కేవలం 70 నిమిషాల వ్యవధిలో 21 చోట్ల బాంబు దాడులతో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో 56 మంది మరణించగా, 246 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ తర్వాత సూరత్‌లో పేలని బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 78 మందిపై విచారణ జరగగా, 2022లో ప్రత్యేక కోర్టు 49 మందిని దోషులుగా తేల్చి, 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది (Gujarat High Court Death Penalty).


ఉరిశిక్ష అమలుకు హైకోర్టు ధ్రువీకరణ తప్పనిసరి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం శిక్షల నిర్ధారణ కోసం హైకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ అల్పేష్ కొగ్జే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన గుజరాత్ హైకోర్టు ధర్మాసనం గత రెండున్నరేళ్లుగా దాదాపు 248 సార్లు అప్పీళ్లపై విచారణ జరిపి మంగళవారం తుది తీర్పు వెల్లడించింది (2008 Ahmedabad Blasts).


నిషేధిత ఇండియన్ ముజాహిదీన్ (IM), సిమి (SIMI) ఉగ్రవాద సంస్థల కుట్రను ప్రాసిక్యూషన్ నిరూపించగలిగింది. దేశద్రోహం, హత్య నేరాలతో పాటు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం 'ఉపా' (UAPA) కింద దోషులుగా న్యాయస్థానం తేల్చింది. కాగా, దేశ చరిత్రలోనే ఒకే కేసులో ఇంతపెద్ద సంఖ్యలో (38 మందికి) ఉరిశిక్షలు ఖరారు కావడం ఇదే ప్రథమం.


ఇవి కూడా చదవండి..

శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..


రాణిస్తున్న బ్యాంకింగ్ షేర్లు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు

Updated Date - Jul 07 , 2026 | 12:18 PM