నీట్ పేపర్ లీక్ నిరసన.. పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్
ABN , Publish Date - Jul 30 , 2026 | 11:48 AM
ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.
ఢిల్లీ, జులై 30 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టు (Supreme Court) ఈరోజు (గురువారం) విచారణ చేపట్టింది. ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన ప్రధాన న్యాయమూర్తి (CJI) ధర్మాసనం, నిరసనల నియంత్రణలో భద్రతా బలగాలు అనుసరించాల్సిన విధివిధానాలపై స్పష్టమైన ప్రోటోకాల్ రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
ఈ కేసు విచారణ సందర్భంగా విద్యార్థులపై మెటాలిక్ పెల్లెట్లు ఉపయోగించారనే ఆరోపణలపై వాడీవేడి వాదనలు జరిగాయి. పెల్లెట్ గన్స్ వినియోగానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. జులై 20వ తేదీన జంతర్ మంతర్ ప్రాంతంలో మోహరించిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) ప్రయోగించిన అమ్యునిషన్‌కు సంబంధించిన అన్ని లాగ్స్, రికార్డులను భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. భవిష్యతు విచారణలో అవి కీలక ఆధారాలుగా ఉపయోగపడే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది.
ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బాగ్చీ మాట్లాడారు. పెల్లెట్ గన్స్‌ను పూర్తిగా నిషేధించడం సాధ్యం కాదని, అయితే వాటి ప్రయోగానికి కచ్చితమైన నిబంధనలు, నియంత్రణలు తప్పనిసరిగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ నిరసనల్లో హింసను ప్రేరేపించే వ్యక్తులను నియంత్రించేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ విధానం అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అదే సమయంలో, నిరసనల సమయంలో గాయపడిన విద్యార్థులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. గాయపడిన వారందరికీ అవసరమైన చికిత్స, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, సంబంధిత అధికారుల నుంచి పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వార్తలు కూడా చదవండి...
‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలి: భట్టి విక్రమార్క
హైడ్రాపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
భాగ్యనగరంలో భారీ వర్షాలు.. ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News