Share News

డీలిమిటేషన్‌కు ఇచ్చిన మద్దతుకే డీఎంకే మొగ్గు.. కాంగ్రెస్‌కు షాక్

ABN , Publish Date - Nov 29 , 2026 | 07:00 PM

కాంగ్రెస్ పార్టీకి ద్రవిడ మున్నేత్ర కజగం (డీఎంకే) పార్టీ షాక్ ఇచ్చింది. డీలిమిటేషన్‌ బిల్లుకు ఇచ్చిన మద్దతుపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

డీలిమిటేషన్‌కు ఇచ్చిన మద్దతుకే డీఎంకే మొగ్గు.. కాంగ్రెస్‌కు షాక్

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ పార్టీకి ద్రవిడ మున్నేత్ర కజగం (డీఎంకే) పార్టీ షాక్ ఇచ్చింది. డీలిమిటేషన్‌ బిల్లుకు ఇచ్చిన మద్దతుపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే జరిపిన చర్చలు విఫలమయ్యాయి. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకోవాలన్న ప్రతిపక్షాల వినతిని స్టాలిన్ పక్కన పెట్టారు. ఆ బిల్లుకు తాము ఇచ్చిన మద్దతుకే కట్టుబడి ఉంటామని, డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు కొనసాగుతుందని స్టాలిన్ స్పష్టం చేశారు. తమ నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదన్నారు.


కాగా.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ఆ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పలువురు సీనియర్ నేతలు ఆదివారం చెన్నైలోని ఆల్వార్‌పేటలో స్టాలిన్‌ను ఆయన నివాసంలో కలిశారు. తన నివాసానికి వచ్చిన ప్రతిపక్ష నేతలను స్టాలిన్ సాదరంగా ఆహ్వానించారు. ఆయనే వారిని రిసీవ్ చేసుకున్నారు. అలాగే డీఎంకే యువజన విభాగం సెక్రటరీ ఉదయనిధి స్టాలిన్, సీనియర్ నేతలు కనిమొళి, దయానిధి మారన్, ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్‌తో ప్రతిపక్ష నేతలు చర్చించారు.


కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న డీలిమిటేషన్‌ బిల్లుకు డీఎంకే ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకోవాలని స్టాలిన్‌ను ప్రతిపక్ష నేతలు కోరారు. డీలిమిటేషన్ వల్ల జరిగే నష్టాల గురించి ఆయనతో చర్చించారు. ఆ బిల్లు చట్టరూపం దాలిస్తే దక్షిణాది రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడడంతో పాటు ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య రాజకీయ అధికార సమతుల్యతను కూడా తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయనకు వివరించారు. ఈ నేపథ్యంలో బిల్లుకు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే, వారి వినతులన్నింటినీ స్టాలిన్ పక్కన పెట్టారు. డీలిమిటేషన్ బిల్లుకు తాము ఇచ్చిన మద్దతులో ఎలాంటి మార్పూ లేదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ట్ర ప్రయోజాలను పరిశీలించిన తర్వాతే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చామని, ఇక ఆ విషయంలో రెండో ఆలోచనకు తావు లేదని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

స్టాలిన్‌కు రాహుల్ విజ్ఞప్తి.. ‘కట్టబొమ్మన్’లా నిలబడతామన్న స్టాలిన్

Updated Date - Nov 29 , 2026 | 07:15 PM