Share News

కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. డీలిమిటేషన్‌ బిల్లుకు జేఎంఎం మద్దతు?

ABN , Publish Date - Nov 29 , 2026 | 05:35 PM

ఇండి కూటమిలోని ఝార్ఖండ్‌ ముక్తీ మోర్చా (జేఎంఎం).. డీలిమిటేషన్‌ బిల్లుకు మద్దతు ఇవ్వనుందని తెలుస్తోంది. ఆ పార్టీకి ఉభయ సభల్లో ఆరుగురు ఎంపీలు ఉన్నారు.

కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. డీలిమిటేషన్‌ బిల్లుకు జేఎంఎం మద్దతు?
Hemant Soren & Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: డీలిమిటేషన్‌ బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. ఇండి కూటమిలో భాగంగా ఉన్న ఝార్ఖండ్‌ ముక్తీ మోర్చా (జేఎంఎం) కూడా ‘పునర్విభజన’కు అనుకూలంగా ఓటు వేయనుందని సమాచారం. డీలిమిటేషన్‌ బిల్లు విషయంలో తమ పార్టీ వైఖరిని జేఎంఎం అధ్యక్షుడు, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఇంకా వెల్లడించలేదు. రాష్ట్ర ప్రయోజనాలు, ఎస్టీ రిజర్వేషన్లపై ప్రభావాన్ని పరిశీలించాకే తుది నిర్ణయం ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందా.. లేదా అన్న స్పష్టత రానుందని చెప్పారు. మరోవైపు డీలిమిటేషన్‌ బిల్లుకు జేఎంఎం మద్దతుగా నిలిచేందుకు సిద్ధమైందని రాజకీయ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.


ఝార్ఖండ్‌ ముక్తీ మోర్చాకు మొత్తం ఆరుగురు ఎంపీలు ఉన్నారు. వీరిలో ముగ్గురు లోక్‌సభకు, మరో ముగ్గురు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జేఎంఎం కూడా కేంద్రం వైపు నిలబడితే.. బిల్లు అమలును అడ్డుకోవడం కాంగ్రెస్‌కు మరింత కష్టతరం కానుంది. ఇప్పటికే ‘డీలిమిటేషన్’కు డీఎంకే మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డీఎంకే అధినేత స్టాలిన్‌‌ను కోరేందుకు కాంగ్రెస్ అగ్రనాయకులు చెన్నై చేరుకున్నారు. ఇప్పుడు హేమంత్‌ సోరెన్‌ పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వబోతోందనే వార్తలు కాంగ్రెస్ శ్రేణులను కలవరపెడుతున్నాయి.

కాగా మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు-2026ను ఏప్రిల్ 17న కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే అవసరమైన మద్దతును కూడగట్టడంలో కేంద్రం విఫలం కావడంతో ఆ బిల్లు వీగిపోయింది. దీంతో ఈ ప్రతిపాదనలను మరోసారి పార్లమెంట్ ముందుకు కేంద్రం తీసుకురానుంది. బిల్లులో కీలక మార్పులు చేసి, ఉభయ సభల్లో కావాల్సిన బలాన్ని బీజేపీ సంపాదించింది.


ఈ వార్తలూ చదవండి

బిల్లుకు 371 మంది ఎంపీల మద్దతు ఖాయం.. రాహుల్ ఆరోపణల్లో నిజం లేదు: కేంద్రం

మద్దతు వెనక్కి తీసుకుంటే, పవార్ కాళ్లు మొక్కుతా: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత

Updated Date - Nov 29 , 2026 | 05:46 PM