డీలిమిటేషన్‌కు మద్దతు ఉపసంహరించుకోండి.. స్టాలిన్‌కు కాంగ్రెస్ వినతి
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:56 PM
కాంగ్రెస్ అగ్ర నేతలు ఆదివారం చెన్నైలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌ను కలిశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు సీనియర్ నేతలు ఆల్వార్‌పేటలోని స్టాలిన్‌ను ఆయన నివాసంలో కలిశారు.
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్ర నేతలు ఆదివారం చెన్నైలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌ను కలిశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు సీనియర్ నేతలు ఆల్వార్‌పేటలోని స్టాలిన్‌ను ఆయన నివాసంలో కలిశారు. తన నివాసానికి వచ్చిన ప్రతిపక్ష నేతలను స్టాలిన్ సాదరంగా ఆహ్వానించారు. ఆయనే వారిని రిసీవ్ చేసుకున్నారు. అలాగే డీఎంకే యువజన విభాగం సెక్రటరీ ఉదయనిధి స్టాలిన్, సీనియర్ నేతలు కనిమొళి, దయానిధి మారన్, ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్‌తో ప్రతిపక్ష నేతలు చర్చించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకోవాలని స్టాలిన్‌ను ప్రతిపక్ష నేతలు కోరారు. డీలిమిటేషన్ వల్ల జరిగే నష్టాల గురించి ఆయనతో చర్చించారు. ఆ బిల్లు చట్టరూపం దాలిస్తే దక్షిణాది రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడడంతో పాటు ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య రాజకీయ అధికార సమతుల్యతను కూడా తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయనకు వివరించారు. ఈ నేపథ్యంలో బిల్లుకు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకోవాలని కోరారు.
మరోవైపు డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. భారతదేశ సరిహద్దుల మ్యాప్‌ను తమకు అనుకూలంగా మార్చేందుకు బీజేపీ, ఆరెస్సెస్ ప్రయత్నిస్తున్నాయని అంతకుముందు ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు. లోక్‌సభ సీట్లను 850కు పెంచితే, భారతదేశంలో ప్రజాస్వామ్యం అంతమైపోతుందని, కాబట్టి డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వరాదని ప్రతిపక్ష నేతలకు ఆయన పిలుపునిచ్చారు. తమిళ వ్యతిరేక శక్తులపై 'బ్రదర్ స్టాలిన్' ఎప్పుడూ ఒక పర్వతంలా దృఢంగా నిలబడ్డారని ప్రశంసిస్తూ దేశం, తమిళనాడు ప్రయోజనాలు, రాజ్యాంగ రక్షణ కోసం కలిసికట్టుగా ఈ బిల్లును ఓడించాలని రాహుల్ కోరారు. ఈ నేపథ్యంలో స్టాలిన్‌ను కలిసి డీలిమిటేషన్ బిల్లుకు మద్దతును ఉపసంహరించుకోవాల్సిందిగా ఆయనను కోరుతామని రాహుల్ తెలిపారు.
సోదరుడు రాహుల్‌కు థ్యాంక్స్.. స్టాలిన్
రాహుల్ గాంధీ పోస్ట్‌కు ఎంకే స్టాలిన్ బదులిచ్చారు. రాజ్యాంగం, రాష్ట్రాల హక్కుల రక్షణలో డీఎంకే పోషించిన చారిత్రక పాత్రను సోదరుడు రాహుల్ గుర్తించారని, ఇందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నామని తెలిపారు. అయితే.. తాము ఎల్లప్పుడూ తమిళనాడు, తమిళ ప్రజల ప్రయోజనాలనే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటామని స్టాలిన్ ఎక్స్‌లో స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!
స్టాలిన్‌కు రాహుల్ విజ్ఞప్తి.. ‘కట్టబొమ్మన్’లా నిలబడతామన్న స్టాలిన్