Share News

డీలిమిటేషన్‌పై కేటీఆర్.. దక్షిణాది ప్రాతినిధ్యం కాపాడిన బిల్లుకు స్వాగతం

ABN , Publish Date - Nov 29 , 2026 | 02:02 PM

దక్షిణాది ప్రాతినిధ్యాన్ని కాపాడే డీలిమిటేషన్ బిల్లును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.

డీలిమిటేషన్‌పై కేటీఆర్.. దక్షిణాది ప్రాతినిధ్యం కాపాడిన బిల్లుకు స్వాగతం
KTR on Delimitation

హైదరాబాద్, నవంబర్ 29: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టమైన వైఖరి వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని కాపాడేలా సవరించిన డీలిమిటేషన్ బిల్లును స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

'తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని యథాతథంగా కొనసాగించే డీలిమిటేషన్ దక్షిణాది ప్రజల విజయం. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు శిక్ష పడకూడదు. నాలుగు సంవత్సరాలుగా బీఆర్ఎస్ చేస్తున్న వాదన ఒక్కటే.. లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిధ్యం కొనసాగాలి' అని కేటీఆర్ అన్నారు.

గతంలో దక్షిణాదికి నష్టం కలిగించేలా ఉన్న బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్రం బుద్ధి తెచ్చుకుని దక్షిణాది రాష్ట్రాలు, తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా బిల్లును సవరించడంతో తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.

'జనాభా పెరుగుదల ప్రాతిపదికగా కాకుండా తీసుకువస్తున్న తొలి డీలిమిటేషన్ ఇది. బీఆర్ఎస్ పోరాటం, దక్షిణాది ఐక్య ఉద్యమం ఫలించాయి. ఈ బిల్లు వల్ల తెలంగాణకు అసెంబ్లీ స్థానాలు 180కి, లోక్‌సభ స్థానాలు 26కి పెరిగే అవకాశం ఉంది' అని కేటీఆర్ పేర్కొన్నారు.

డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, అన్ని పార్టీల భాగస్వామ్యంతో జరగాలని కోరారు. అదే సమయంలో కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నిస్తూ.. 'తెలంగాణకు, దక్షిణాదికి లాభం చేకూర్చే ఈ డీలిమిటేషన్‌ను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోంది? మళ్లీ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరగాలని కోరుకుంటోందా? అలా జరిగితే దక్షిణాదికి, తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లదా? కాంగ్రెస్ తన ప్రత్యామ్నాయ మార్గాన్ని స్పష్టం చేయాలి' అని డిమాండ్ చేశారు.(KTR on Delimitation)


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

Updated Date - Nov 29 , 2026 | 02:03 PM