వైరల్ వీడియోపై విమర్శలు.. క్షమాపణలు కోరుతూ మరో వీడియో
ABN , Publish Date - Jul 31 , 2026 | 01:40 PM
ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా ఆర్ఏఎఫ్ సిబ్బందిని ఉద్దేశించి క్రియేట్ చేసినట్టు వైరల్ అయిన వీడియోపై సదరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ స్పందించారు. ఆ వీడియోపై ఆమె క్షమాపణలు కోరారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల సందర్భంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్‌ఏఎఫ్) సిబ్బందిని ఉద్దేశించి క్రియేట్ చేసిన వీడియో తీవ్ర వివాదానికి దారితీయడంతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రద్ధా సింగ్ క్షమాపణలు చెప్పారు. తాను ఆర్‌ఏఎఫ్ సిబ్బందిని ఎగతాళి చేయాలనే ఉద్దేశంతో ఆ వీడియోను తీయలేదన్నారు. పొరపాటు జరిగిందని గుర్తించిన వెంటనే దానిని తొలగించానని ఆమె చెప్పుకొచ్చారు.
కాగా.. ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా శ్రద్ధా సింగ్ ఆర్‌ఏఎఫ్ సిబ్బంది ఎదుట నిల్చుని.. ఓ టాయిలెట్ క్లీనర్ యాడ్‌ను అనుకరిస్తూ వీడియో తీశారు. బ్లూ కలర్ యూనిఫామ్ ధరించిన ఆర్‌ఏఎఫ్ సిబ్బందిని చూపుతూ కామెంట్స్ చేయడం, తాను ఎరుపు రంగు దుస్తుల్లో ఉండటాన్ని పోల్చడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహానికి గురయ్యారు.
ఈ వివాదం ముదరడంతో శ్రద్ధా సింగ్ క్షమాపణలు కోరుతూ మరో వీడియోను రిలీజ్ చేశారు. సదరు వీడియోను పోస్ట్ చేసిన గంటలోపే తొలగించానని, తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ఆర్‌ఏఎఫ్ సిబ్బందిని అవమానించడం, వారి విధులను ఎగతాళి చేయడం తన లక్ష్యం కాదని ఆమె స్పష్టం చేశారు. 'వారు బ్లూ కలర్ యూనిఫామ్ ధరించారు. నేనేమో ఎరుపు రంగు దుస్తుల్లో ఉన్నాను. ఆ సమయంలో ఒక యాడ్ గుర్తుకు రావడంతో ఆ రీల్ చేశాను. అంతేతప్ప.. దురుద్దేశంతోనో, వారిని అవమానించాలనో ఆ వీడియో తీయలేదు' అని శ్రద్ధా అన్నారు. సదర వీడియో తొలగించాలని ఎవరూ తనపై ఒత్తిడి చేయలేదని, వ్యక్తిగతంగా బాధించినందుకే క్షమాపణలు చెబుతూ మరో వీడియో పోస్ట్ చేసినట్టు వివరించారు. అయితే.. వీడియో వైరల్ అయ్యాక తనకు అత్యాచారం, ప్రాణహాని వంటి బెదిరింపులూ వస్తున్నాయని ఆరోపించారామె.
ఇవీ చదవండి:
'నాన్న యూనిఫాం రక్తంతో తడిసిపోయింది'.. న్యాయం చేయండి ప్లీజ్.!
మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు