Share News

'నాన్న యూనిఫాం రక్తంతో తడిసిపోయింది'.. న్యాయం చేయండి ప్లీజ్.!

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:07 PM

జంతర్‌ మంతర్‌ ఆందోళనలో గాయపడిన ఢిల్లీ పోలీసుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాయి.

'నాన్న యూనిఫాం రక్తంతో తడిసిపోయింది'.. న్యాయం చేయండి ప్లీజ్.!

ఇంటర్నెట్ డెస్క్: జంతర్‌‌మంతర్‌ వద్ద ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా గాయపడిన ఢిల్లీ పోలీసు సిబ్బంది కుటుంబాలు న్యాయం కోసం డిమాండ్‌ చేశాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఆందోళనకారులు.. రాళ్లురువ్వడం సహా చెప్పులతో దాడి చేశారని ఆరోపిస్తూ నేడు(శుక్రవారం) మీడియా ఎదుట బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.


ఈ సందర్భంగా గాయపడిన ఓ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌(ఏసీపీ) కుమారుడు మాట్లాడుతూ తన తండ్రి ఎదుర్కొన్న పరిస్థితిని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. 'మా నాన్న యూనిఫాం రక్తంతో తడిసిపోయింది' అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళనల సమయంలో ఆయన తలకు తీవ్ర గాయమైందని, నాలుగు కుట్లు కూడా పడినట్టు చెప్పుకొచ్చారు. తన తండ్రిని ఆ పరిస్థితుల్లో చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యానని వాపోయారు.

Delhi-Police-Family.jpg


నిరసనల సమయంలో గుంపులో కొందరు అసాంఘిక శక్తులు కలిసిపోయి మూకుమ్మడిగా రాళ్ల దాడికి దిగారని తన తండ్రి చెప్పినట్లు కుమారుడు వివరించారు. పోలీసులు స్పందించే అవకాశం లేకుండా వరుస దాడులు జరిగాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది.. నిరసనకారుల దాడులకు గురయ్యారని, గాయపడిన వారికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ప్రజల రక్షణ కోసం పనిచేసే పోలీసులపై దాడులను సహించరాదని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

మా నాన్నను దాదాపు చంపేంత పని చేశారు: పోలీస్‌ అధికారి కుమార్తె

జంతర్‌మంతర్‌ వద్ద జులై 25న జరిగిన ఆందోళనలో తన తండ్రిపై కొందరు దాడి చేశారని ఢిల్లీ పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కుమార్తె ఆరోపించారు. బారికేడ్ల సమీపంలో విధులు నిర్వహిస్తున్న తన తండ్రిని కొందరు వ్యక్తులు లాక్కెళ్లి దాడి చేశారని, దాదాపు చంపేంత పని చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. అనంతరం తన తండ్రి ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రిలో సుమారు నాలుగు గంటలపాటు స్పృహ లేకుండా ఉన్నారని చెప్పారు. ‘ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో నాన్న సహోద్యోగులు ఆయనను ఇంటికి తీసుకొచ్చారు. ఆయన యూనిఫాం మొత్తం రక్తంతో తడిసి ఉంది. ఆ పరిస్థితిలో ఆయనను చూడటం ఎంతో బాధ కలిగించింది. మా కుటుంబం ఎదుర్కొన్న అత్యంత కష్టమైన రాత్రుల్లో అది ఒకటి’ అని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

సోషల్‌ మీడియాలో నాన్ననే నిందితుడిగా చూపించారు..

నిరసనల్లో జరిగిన హింసపై, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులపై జరిగిన దాడులకు సోషల్ మీడియాలో తగినంత ప్రాధాన్యం దక్కలేదని ఆరోపించారు. ‘సోషల్‌ మీడియా తెరిచి చూస్తే.. మా నాన్ననే నేరస్థుడిగా చూపించారు. ఆయనపై దాడి చేసిన వారే సుప్రీంకోర్టుకు వెళ్లారని ఆ తర్వాత తెలిసింది. మాకూ సమాన హక్కులు ఉన్నాయి. మాకూ న్యాయం కావాలి’ అని ఆమె అన్నారు.


ఇవీ చదవండి:

మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు

చోరీకి ముందు దేవుళ్లకు క్షమాపణ.. వీడియో వైరల్

Updated Date - Jul 31 , 2026 | 03:02 PM