ప్రియుడితో కలిసి భార్య దారుణం.. సైనైడ్‌తో భర్త హత్య..
ABN , Publish Date - Jul 31 , 2026 | 11:47 AM
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో భర్తకు సైనైడ్ ఇచ్చిన భార్య అతన్ని హత్య చేసింది. ఆపై ఓ పాడుబడిన ఫ్యాక్టరీలో 12 అడుగుల లోతులో పూడ్చిపెట్టింది. రెండేళ్లుగా భర్త ఆస్ట్రేలియాలో ఉంటున్నాడని, మాట్లాడటం కుదరదని కుటుంబ సభ్యులు, బంధువులను నమ్మిస్తూ వచ్చింది.
గుజరాత్: భర్తకు సైనైడ్ ఇచ్చి హత్య చేసి, ఆపై 12 అడుగుల లోతులో పూడ్చిపెట్టిన ఘటన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సంచలనం సృష్టిస్తోంది. రెండేళ్లుగా భర్త ఆస్ట్రేలియాలో ఉంటున్నాడని, మాట్లాడటం కుదరదని కుటుంబ సభ్యులు, బంధువులను నమ్మిస్తూ వచ్చిన భార్య బండారం ఎట్టకేలకు బయటపడింది. విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు మహిళే తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తేల్చారు. ఈ మేరకు నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జిగ్నేష్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి అతడితో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. జిగ్నేష్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడని, అక్కడి కంపెనీ నిబంధనల కారణంగా ఫోన్‌లో మాట్లాడలేకపోతున్నాడని అతని భార్య పృథ్వి వారికి చెబుతూ వచ్చింది. అంతేకాకుండా శాశ్వత నివాస అనుమతి (పర్మనెంట్ రెసిడెన్సీ) వచ్చిన తర్వాతే భారత్‌కు జిగ్నేష్ తిరిగి వస్తాడని కుటుంబ సభ్యులను నమ్మించింది. దీంతో రెండేళ్లపాటు ఎవరికీ అనుమానం రాలేదు.
అయితే, ఇటీవల జిగ్నేష్ బంధువుల్లో ఒకరు ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అతడిని కలవాలని భావించాడు. జిగ్నేష్ ఫోన్ నంబర్, చిరునామా ఇవ్వాలని పృథ్విని కోరాడు. ఎన్నిసార్లు వివరాలు అడిగినా ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో సదరు మహిళ అసలు విషయాన్ని కుటుంబ సభ్యుల ముందు బయటపెట్టింది. తన భర్తను రెండేళ్ల క్రితమే హత్య చేసినట్లు వెల్లడించింది. దీంతో జిగ్నేష్ సోదరుడు అశోక్ ఈ నెల 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. జిగ్నేష్ భార్య పృథ్వి, ఆమె ప్రియుడు నీలేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
వారిని రెండు రోజుల పాటు విచారించగా.. సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నిందితులిద్దరూ సైనైడ్ కలిపిన మద్యాన్ని జిగ్నేష్‌కు ఇచ్చి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. అనంతరం అతడి మృతదేహాన్ని జామ్‌నగర్ శివారులోని ఓ పాడుబడిన ఫ్యాక్టరీలో పాతిపెట్టినట్లు చెప్పారు. సుమారు 12 అడుగుల లోతైన గుంతలో పూడ్చిపెట్టినట్లు పోలీసులకు వెల్లడించారు. మరోవైపు, ఆ ఫ్యాక్టరీని జిగ్నేష్, నీలేశ్ ఇద్దరూ కలిసి లీజుకు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు జిగ్నేష్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో భార్య చేతిలో భర్త హత్య అనే అంశం మరోసారి చర్చనీయాంశమైంది.
ఈ వార్తలు కూడా చదవండి
మహారాష్ట్రలోని భివండిలో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది మృతి..
మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు