Share News

ఆగస్టు 3.. ‘సర్’కు ఆఖరు తేదీ

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:45 AM

ఓటర్ల ప్రాథమిక హక్కును తేల్చే సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ఇప్పుడు చివరి ఘట్టానికి చేరింది.

 ఆగస్టు 3.. ‘సర్’కు ఆఖరు తేదీ
Telangana voter list revision

  • జిల్లా మొత్తంగా 87.67 శాతం పూర్తి

  • లక్షకుపైగా పత్రాలు డిజిటలైజేషన్‌ పెండింగ్‌

సిద్దిపేట: ఓటర్ల ప్రాథమిక హక్కును తేల్చే సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ఇప్పుడు చివరి ఘట్టానికి చేరింది. మరో నాలుగు రోజుల్లో గడువు ముగియనుండగా, జిల్లాలో ఇంకా 1.15 లక్షల మంది ఓటర్ల భవితవ్యం ఆన్‌లైన్‌ కాకుండా కాగితాలకే పరిమితమై ఉంది. ఇప్పటివరకు 87.67 శాతం డిజిటలైజేషన్‌ పూర్తయినప్పటికీ... పట్టణ ఓటర్ల నిర్లక్ష్యం, రెండు చోట్ల ఓట్లు ఉన్నవారి దోబూచులాట బీఎల్‌వోలను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతోంది. చివరి నిమిషంలో సర్వర్లు మొరాయించే ప్రమాదం ఉన్నందున, ఇప్పుడే స్పందించకపోతే రేపటి జాబితాలో ఓటరుగా పేరు మాయమైనా ఆశ్చర్యం లేదు!


ఇంకా 1,15,664 ఫారాలు

జూన్‌ 25న ప్రారంభమైన సర్‌ ప్రక్రియకు పెంచిన గడువు మరో నాలుగు రోజుల్లో, అంటే ఆగస్టు 3వ తేదీతో పూర్తికానుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,92,967 మంది ఓటర్లు ఉండగా, గురువారం నాటికి 8,70,509 ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తయింది. దీంతో జిల్లాలో నమోదు ప్రక్రియ 87.67 శాతానికి చేరింది. అయితే ఇంకా 1,15,664 ఫారాలను ఆన్‌లైన్‌ చేయాల్సి ఉండటంతో, నిర్ణీత సమయంలోగా లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అధికారులు, బీఎల్‌వోలు శ్రమిస్తున్నారు.


ptc1.jpgనియోజకవర్గాల వారీగా నమోదు

సిద్దిపేట జిల్లావ్యాప్తంగా సాగుతున్న ఈ ప్రక్రియలో అత్యధికంగా దుబ్బాక నియోజకవర్గంలో 91.21 శాతం డిజిటలైజేషన్‌ పూర్తయి అగ్రస్థానంలో నిలవగా, అత్యల్పంగా సిద్దిపేటలో 83.44 శాతం మాత్రమే నమోదు నమోదైంది. స్థానికంగా శాశ్వతంగా నివసిస్తున్న వారి వివరాల నమోదు వేగంగా పూర్తయినప్పటికీ, ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాలు, పట్టణాలకు వెళ్లిన వారి పత్రాలు తిరిగి రాకపోవడమే ఆలస్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.


పట్టణాల్లో అలసత్వం.. ఇబ్బందుల్లో బీఎల్‌వోలు

గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల స్పందన మందకొడిగా ఉంది. రెండేసి చోట్ల ఓట్లు ఉన్నవారు, వలస వెళ్లిన వారు ఎన్యూమరేషన్‌ పత్రాలను నింపి తిరిగి ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. బీఎల్‌వోలు నేరుగా ఇళ్లకు వెళ్తున్నా ఓటర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలుస్తోంది. చివరి రోజుల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో పత్రాలు వస్తే సర్వర్‌ ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశముందని, ఆగస్టు 1 లేదా 2 నాటికే పత్రాలను అందించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం రంగంలోకి దిగి అర్హులైన ఓటర్ల నుంచి పత్రాలు సేకరించి బీఎల్‌వోలకు అందజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పాపం.. రిటైర్డ్‌ ఉద్యోగి!

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 11:45 AM