పాపం.. రిటైర్డ్ ఉద్యోగి!
ABN , Publish Date - Jul 31 , 2026 | 08:44 AM
వాట్సాప్ గ్రూపులో పెట్టుబడుల పేరుతో నిర్వహించిన సైబర్ మోసంలో ఓ రిటైర్ట్ ఉద్యోగి తన జీవితకాల పొదుపులతో పాటు రుణం కలిపి మొత్తం రూ.33 లక్షలు కోల్పోయాడు.
జీవిత కాల పొదుపు సొమ్ము రూ.33 లక్షలు సైబర్ నేరగాళ్ల పాలు
హైదరాబాద్ సిటీ: వాట్సాప్ గ్రూపులో పెట్టుబడుల పేరుతో నిర్వహించిన సైబర్ మోసంలో ఓ రిటైర్ట్ ఉద్యోగి తన జీవితకాల పొదుపులతో పాటు రుణం కలిపి మొత్తం రూ.33 లక్షలు కోల్పోయాడు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లాపూర్‌లోని ఓజోన్ హైట్స్ అపార్టుమెంట్‌లో నివసించే రిటైర్డ్ ఉద్యోగిని జూలై నెలలో నిషా వర్మ పేరుతో కొందరు వాట్సాప్ ద్వారా సంప్రదించారు. ‘ఎల్ 179 అపెక్స్ డిజిటల్ క్యాపిటల్’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో చేర్చి, షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయని నమ్మించారు.
ఓ డీఎంఎ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి, అది సెబీ వెరిఫైడ్ అకౌంట్ అని నమ్మించారు. అనంతరం వివిధ బ్యాంకు ఖాతాలకు విడతల వారీగా నగదు జమ చేయాలని సూచించారు. మొదట ఎం.కే. ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఉన్న యెస్ బ్యాంక్ ఖాతాకు రూ.25వేలతో ప్రారంభమైన లావాదేవీలు, అనంతరం ఓం సాయి ట్రేడర్స్ సహా పలు ఖాతాలకు డబ్బులను బదిలీ చేశాడు. యాప్‌లో చూపిస్తున్న లాభాలను ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించగా అవకాశం కనిపించలేదు.
బాధితుడు వారిని ప్రశ్నించగా, ఇన్‌స్టిట్యూషనల్ అకౌంట్ విధానం ఇదని, వేచి ఉండాలని సమాధానం చెప్పారు. అంతేకాకుండా, ఇండో ఎంఐఎం లిమిటెడ్ ఐపీఓలో షేర్లు ఒక్కోటి రూ.4500 చొప్పున కేటాయించామని, మొత్తం రూ.21,02,160 చెల్లించాలని అతడిపై నిర్వాహకులు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఇదంతా మోసమని గుర్తించారు. అప్పటికే తన జీవితకాల పొదుపులతో పాటు రుణంగా తెచ్చిన డబ్బు రూ.33 లక్షలను బాధితుడు కోల్పోయారు. తనకు న్యాయం చేయాలని సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..
విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News