Share News

అడ్డంగా దొరికిన మాజీ వీసీ

ABN , Publish Date - Jul 31 , 2026 | 08:02 AM

చరిత్రాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయానికి వైస్‌ చాన్సలర్‌ హోదాలో ఉంటూ.. గత ప్రభుత్వంలో స్థాయిని మరచి వైసీపీ కార్యకర్తలా వ్యవహరించిన ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఆయన చేసిన అక్రమాలన్నీ ఆధారాలతో బయటపడ్డాయి.

అడ్డంగా దొరికిన మాజీ వీసీ
Prasada Reddy

  • ఏ క్షణంలోనైనా ప్రసాదరెడ్డి అరెస్టు?

  • గత ప్రభుత్వంలో ఇష్టానుసారం అక్రమాలు

  • కోట్లలో ఏయూ నిధుల దుర్వినియోగం

  • నియామకాలు-ప్రవేశాల్లో ఉల్లంఘనలు

  • కుమార్తెకు అక్రమంగా ఎంటెక్‌లో ప్రవేశం

  • సివిల్‌ పనుల్లో అవకతవకలు.. విజిలెన్స్‌ నివేదిక

  • నేడు పదవీ విరమణ చేయనున్న ప్రసాదరెడ్డి

  • ఈలోగా చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు

విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): చరిత్రాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయానికి వైస్‌ చాన్సలర్‌ హోదాలో ఉంటూ.. గత ప్రభుత్వంలో స్థాయిని మరచి వైసీపీ కార్యకర్తలా వ్యవహరించిన ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఆయన చేసిన అక్రమాలన్నీ ఆధారాలతో బయటపడ్డాయి. జగన్‌ ప్రభుత్వంలో వీసీ హోదాలో ప్రసాదరెడ్డి కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగం, నియామకాలు - ప్రవేశాల్లో అక్రమాలు, ఫోర్జరీ సంతకాలు, అనుమతి లేని నిర్మాణాలు, వర్సిటీ ఆదాయానికి గండి కొట్టడం వంటి చర్యలతో పాటు సివిల్‌ పనుల్లో అక్రమాలకు పాల్పడినట్టు విజిలెన్స్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. చర్యలకు సిఫారసు చేసింది. ఆయన్ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది.


ఎన్నెన్నో అవకతవకలు

ఏయూ వీసీగా ఉన్న సమయంలో ప్రొఫెసర్‌ ప్రసాదరెడ్డి పాల్పడిన అక్రమాలు, అవకతవకలపై అందిన ఫిర్యాదుల ఆధారంగా విజిలెన్స్‌ విచారణ చేపట్టింది. ఆయనతోపాటు మరో 44 మందిపై (2019-2024) ఫిర్యాదులను విచారించింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం పూర్తిస్థాయిలో శాస్త్రీయమైన విచారణ నిర్వహించి నివేదిక సమర్పించింది. నిబంధనల ఉల్లంఘన, అవినీతి, అక్రమాలు నిజమేనని నిర్ధారించి వాటికి సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించినట్టు తెలిసింది. విజిలెన్స్‌ నివేదికలో పేర్కొన్న కీలక అంశాలివీ...

  • రూసా నిధులను దుర్వినియోగం చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్‌ అంబేడ్కర్‌ చైర్‌ ప్రొఫెసర్‌గా మేకా జేమ్స్‌ స్టీఫెన్‌ను నియమించారు.

  • వీసీ(ప్రసాదరెడ్డి) కుమార్తె, ఒక ఐపీఎస్‌ అధికారి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే జీవిత భాగస్వామి సహా పలువురికి అక్రమంగా ఎంటెక్‌/పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించారు. ఎంటెక్‌ పరీక్షల్లో వీసీ కుమార్తెకు అనుకూలంగా సెమిస్టర్‌ పరీక్షల మార్కులను తారుమారు చేశారు.

  • అకాడమిక్‌ సెనెట్‌ ఆమోదం లేకుండా టీడీఆర్‌ హబ్‌లో మార్గదర్శకాలు తారుమారు చేయడం, పలు అంశాలను ఫోర్జరీ చేయడం, అనధికార భవన నిర్మాణాలు, హోర్డింగ్‌లు, మైదానాల ద్వారా వర్సిటీకి నష్టం చేకూర్చారు. సివిల్‌ పనుల్లో అక్రమాలు, కుల వివక్షతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియమావళి ఉల్లంఘించారు.

  • సరైన అధికారం లేకుండా వి.కృష్ణమోహన్‌ను ఒక నెల పాటు రిజిస్ట్రార్‌/డీడీవోగా కొనసాగించారు. 543 ఫైళ్లను ప్రాసెస్‌ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు.

  • అంబేడ్కర్‌ చైర్‌లో జేమ్స్‌ స్టీఫెన్‌ నియామకం ద్వారా వర్సిటీకి రూ.1,10,29,368 నష్టం చేకూర్చారు. భద్రత, బోధనేతర/పదవీ విరమణ పొందిన సిబ్బందిని అక్రమంగా నియమించడం ద్వారా రూ.3,34,82,593, పాలనా భవనం కోసం రూ.13,36,810, కృష్ణమోహన్‌ను రిజిస్ట్రార్‌గా కొనసాగించడం ద్వారా 2,68,380 నష్టం కలిగించారు.

  • అర్హతకు మించి హోర్డింగ్‌లు, మైదానాలకు రాయితీలు ఇవ్వడం ద్వారా రూ.2,31,90,067 నష్టం వచ్చింది. హోర్డింగ్‌లు నిర్వహించే ఏజెన్సీ కారణంగా రూ.7 కోట్లు నష్టం వచ్చింది. షార్ట్‌ టెండర్లు పిలవడం ద్వారా రూ.34 కోట్లు, అదనంగా మరికొన్ని పనులు చేపట్టడం ద్వారా రూ.15 కోట్లు నష్టం వాటిల్లింది.

  • ఎటువంటి ప్రకటన లేకుండా కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాల కోసం రూ.17,69,37,893 ఖర్చు చేశారు. విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి ఐసీసీఆర్‌ చెల్లించాల్సిన రూ.54.08 కోట్లు ఇంతవరకు వర్సిటీకి జమ కాలేదు.


విజిలెన్స్‌ సిఫారసులు

నిర్దిష్ట ఆరోపణలకు సంబంధించి జేమ్స్‌ స్టీఫెన్‌, కృష్ణమోహన్‌, బసవయ్య, కె.శ్రీనివాసరావు, ఇతరులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి. మొత్తం 45 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. అంబేడ్కర్‌ చైర్‌, రెండు ఎంటెక్‌ డిగ్రీలు, మూడు పీహెచ్‌డీ డిగ్రీలు రద్దు చేయాలి. ప్రసాదరెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల ఆర్జనపై ఏసీబీకి నివేదించాలి. ప్రసాదరెడ్డి శుక్రవారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈలోగా సస్పెన్షన్‌, చర్యలకు సంబంధించిన ఉత్తర్వులు అమలు చేయాలి. ఆయన హయాంలో వర్సిటీకి కలిగిన నష్టాలను ఆయా వ్యక్తుల నుంచి రికవరీ చేయాలని విజిలెన్స్‌ తన నివేదికలో ప్రభుత్వానికి సిఫారసు చేసింది.


వైసీపీ తరఫున ప్రచారం

ఏయూ వీసీగా ప్రసాదరెడ్డి తన విధుల కంటే ఇతర వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండేవారు. రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన ఆయన అత్యుత్సాహంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. విశాఖ జీవీఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు వైసీపీ అభ్యర్థులుగా ఎవరు రంగంలో ఉండాలో ఆయనే జాబితా తయారు చేశారు. ఆ కార్యక్రమం అంతా వర్సిటీ వేదికగానే జరిగింది. వైసీపీ నాయకులు ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్లేవారు. ఆయన వైసీపీ అభ్యర్థుల తరఫున నేరుగా ఎన్నికల ప్రచారం కూడా చేశారు.


వార్తలు కూడా చదవండి...

హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు

కియాతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 08:05 AM