Share News

కామన్వెల్త్ గేమ్స్: పట్టుదలే పతకమైంది.. డిస్కస్ త్రోలో సీమా కళిరామన్‌కు కాంస్యం

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:11 AM

కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత మహిళల డిస్కస్ త్రో విభాగంలో సీమా కళిరామన్ కాంస్య పతకం సాధించింది. గ్లాస్గో వేదికగా జరిగిన ఫైనల్ మూడో రౌండ్‌లో 58.65 మీటర్లు విసిరిన సీమా.. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఫౌల్ అయింది. అయినా ఆమెను కాంస్య పతకం వరించింది.

కామన్వెల్త్ గేమ్స్: పట్టుదలే పతకమైంది.. డిస్కస్ త్రోలో సీమా కళిరామన్‌కు కాంస్యం
Seema Kaliramna

ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత మహిళల డిస్కస్ త్రో విభాగంలో సీమా కళిరామన్ కాంస్య పతకం సాధించింది. గ్లాస్గో వేదికగా జరిగిన ఫైనల్ మూడో రౌండ్‌లో 58.65 మీటర్లు విసిరిన సీమా.. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఫౌల్ అయింది. అయినా ఆమెను కాంస్య పతకం వరించింది. 2025 జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సీమా.. ఇప్పుడు కామన్వెల్త్ వేదికపై కూడా పతకంతో మెరిసింది. ఫైనల్లో తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన ఆమె, రెండో ప్రయత్నంలో 57.32 మీటర్లు, మూడో ప్రయత్నంలో 58.65 మీటర్లు విసిరింది. అనంతరం వరుసగా మూడు ఫౌల్స్ చేసినా, ప్రత్యర్థి కామెరూన్‌కు చెందిన మోనీ నోరా అతిమ్ ఆ మార్కును అధిగమించలేకపోవడంతో సీమ కాంస్యాన్ని ఖాయం చేసుకుంది.


ఈ విభాగంలో జమైకాకు చెందిన సమంత హాల్ 61.66 మీటర్లతో స్వర్ణ పతకం గెలుచుకోగా, కెనడాకు చెందిన జూలియా టంక్స్ 60.67 మీటర్లతో రజతం సాధించింది. మరో భారత అథ్లెట్ నిధి రాణి 57.10 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచి పతకాన్ని స్వల్ప తేడాతో చేజార్చుకుంది.


బిడ్డకు జన్మనిచ్చిన 11 నెలలకే..

ఈ పతకం వెనుక సీమా చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం. హరియాణాకు చెందిన 27 ఏళ్ల సీమా.. ప్రస్తుతం ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ చదువుతోంది. కుమారుడు రుద్రకు జన్మనిచ్చిన 11 నెలల్లోనే డిస్కస్ త్రోలో మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించింది. గర్భధారణ తర్వాత ఫిట్‌నెస్, టెక్నిక్‌ను తిరిగి అందిపుచ్చుకోవడానికి తీవ్రంగా శ్రమించింది. జాతీయ మాజీ డిస్కస్ త్రో క్రీడాకారుడు, భర్త రవీందర్.. ఆమెకు కోచ్‌గా మారి ఈ గ్రాండ్ రీఎంట్రీలో కీలక పాత్ర పోషించాడు. కాగా రవీందర్ మోను కళిరామన్‌గా అందరికీ సుపరిచితుడే. తల్లిగా బాధ్యతలు, చదువు, క్రీడలను సమన్వయం చేస్తూ అంతర్జాతీయ వేదికపై పతకం సాధించిన సీమా కళిరామన్ ప్రస్థానం భారత క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

బంగ్లాదేశ్ అత్యంత సురక్షితం దేశం: తమీమ్‌ ఇక్బాల్

భారత హాకీ జెర్సీ మార్పుపై వివాదం.. వివరణ ఇచ్చిన హాకీ ఇండియా

Updated Date - Jul 31 , 2026 | 11:11 AM