Share News

మురళీ జోరు.. ‘పారా’హుషారు

ABN , Publish Date - Jul 31 , 2026 | 03:20 AM

కామన్వెల్త్‌ క్రీడల లాంగ్‌ జంప్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా మురళీ శ్రీశంకర్‌ చరిత్ర సృష్టించగా.. పారా 100 మీ. రేస్‌లో దిలీప్‌ మహాదు గవిట్‌, మహమ్మద్‌ బాసిల్‌ స్వర్ణ, రజత పతకాలతో...

మురళీ జోరు.. ‘పారా’హుషారు

నేటి షెడ్యూల్‌..

అథ్లెటిక్స్‌: డెకాథ్లాన్‌-తేజస్విన్‌ శంకర్‌ (మ. 2.35); జావెలిన్‌ త్రో ఫైనల్‌-నీరజ్‌ చోప్రా, రోహిత్‌, యశ్‌వీర్‌ (రా. 12.45); పురుషుల 400 మీ. హర్డిల్స్‌ ఫైనల్‌ -పాలక్‌ షా, సంతోష్‌ కుమార్‌ (రా. 1.30); పురుషుల 200 మీ. ఫైనల్‌- అనిమేష్‌ కుజూర్‌- (రా. 1.55 గం.)

బాక్సింగ్‌: సెమీస్‌ మ్యాచ్‌లు-ప్రీతి, అంకుశ్‌, జాస్మిన్‌, ప్రియ, జాదూమణి, లవ్లీనా, సచిన్‌ (మ. 3.15 నుంచి)

జూడో: రౌండ్‌-16 మ్యాచ్‌లు.. హర్ష్‌, శ్రద్ధ, రోహిత్‌, అశ్విత, యామిని- (మ. 3.30)

పారా 100 మీ. రేస్‌లో స్వర్ణ, రజతాలు మనకే

  • లవ్‌ప్రీత్‌కు రజతం

  • జావెలిన్‌ ఫైనల్‌కు నీరజ్‌

శ్రీశంకర్‌ రికార్డు రజతం

6-Sports.jpg

గ్లాస్గో: కామన్వెల్త్‌ క్రీడల లాంగ్‌ జంప్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా మురళీ శ్రీశంకర్‌ చరిత్ర సృష్టించగా.. పారా 100 మీ. రేస్‌లో దిలీప్‌ మహాదు గవిట్‌, మహమ్మద్‌ బాసిల్‌ స్వర్ణ, రజత పతకాలతో మునుపెన్నడూ లేని రీతిలో అదరహో అనిపించారు. ఇక వెయిట్‌ లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్‌ సింగ్‌ రజతం అందుకున్నాడు. దీంతో భారత్‌ స్వర్ణ, మూడు రజత పతకాలను సాధించింది. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రాతోపాటు రోహిత్‌, యశ్‌వీర్‌ కూడా ఫైనల్‌ చేరారు.

లవ్‌ప్రీత్‌.. రజతంతో సరి: పురుషుల 110 ప్లస్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్‌ సింగ్‌ మొత్తం 388 (176+212) కిలోలు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. స్నాచ్‌ మూడో ప్రయత్నంలో 176 కిలోల బరువునెత్తి కొత్త గేమ్స్‌ రికార్డును నెలకొల్పాడు. ఇక, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మొదటిసారి 205 కిలోలు లిఫ్ట్‌ చేసిన లవ్‌ప్రీత్‌.. రెండోసారి 212 కిలోలు లిఫ్ట్‌ చేశాడు. కానీ, మూడో ప్రయత్నంలో 217 కిలోలు ఎత్తలేక పోయాడు. న్యూజిలాండ్‌ లిఫ్టర్‌ డేవిడ్‌ ఆండ్రూ 389 (166+223)కు స్వర్ణం, ఇంగ్లండ్‌ లిఫ్టర్‌ ఆండ్రూ గ్రిఫిత్‌ 356 (165+191)కు కాంస్యం దక్కాయి.

తజిందర్‌, గిల్‌ విఫలం..: పురుషుల షాట్‌ పుట్‌ ఫైనల్లో తజిందర్‌ పాల్‌ సింగ్‌, సమర్‌దీప్‌ సింగ్‌ గిల్‌ నిరాశపర్చారు. తజిందర్‌ అత్యుత్తమంగా 20.27 మీటర్లు, గిల్‌ 20.03 మీ. విసిరి ఐదు, ఏడు స్థానాల్లో నిలిచారు.

5-Sports.jpg

వావ్‌.. మురళీ..: గాయంతో కెరీర్‌ ముగుస్తుందనుకొన్న మురళీ శ్రీశంకర్‌ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. లాంగ్‌ జంప్‌ ఈవెంట్‌లో శ్రీశంకర్‌ 8.09 మీటర్ల దూరం దూకి రజతం దక్కించుకున్నాడు. 2022 బర్మింగ్‌హామ్‌ క్రీడల్లో శ్రీశంకర్‌ తొలిసారి రజతం సాధించాడు. 2024 మోకాలి గాయానికి శస్త్రచికిత్స తర్వాత వేగంగా కోలుకొన్నాడు. దృఢ సంకల్పంతో ప్రాక్టీస్‌ చేసి మళ్లీ గాడిలో పడ్డాడు. మరో భారత అథ్లెట్‌ లోకేశ్‌ సత్యనాథన్‌ ఐదో స్థానంలో నిలిచాడు.


స్వర్ణ, రజతాలు మనవే..: పారా అథ్లెటిక్స్‌లో భారత్‌ అదరగొడుతోంది. పురుషుల 100 మీ. టీ47 ఫైనల్లో స్వర్ణ, రజతాలను మనోళ్లే సొంతం చేసుకొన్నారు. దిలీప్‌ మహాదు గవిట్‌ పసిడి సాధించగా.. మహమ్మద్‌ బాసిల్‌ వెండి పతకం సొంతం చేసుకొన్నాడు. గురువారం జరిగిన ఫైనల్లో దిలీప్‌ 10.71 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలవగా.. బాసిల్‌ 10.83 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానం దక్కించుకొన్నాడు.

మార్టినాకు నిరాశ: వెయిట్‌ లిఫ్టింగ్‌లో మార్టినా దేవి త్రుటిలో ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకొన్నా.. పతకం సాధించలేక పోయింది. మహిళల 86+ కిలోల కేటగిరీలో మార్టినా 245 (105+140) కిలోలు ఎత్తి ఐదో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో నిలిచిన అలోఫా పటోలో (న్యూజిలాండ్‌)తో సమంగా మార్టినా బరువులు ఎత్తినా.. ఎక్కువ ఫౌల్స్‌ చేయడంతో పతకం చేజారింది.

మెడల్‌ రౌండ్‌కు నీరజ్‌, రోహిత్‌, యశ్‌..

స్టార్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా మరో ఇద్దరు భారత అథ్లెట్లు రోహిత్‌ యాదవ్‌, యశ్‌వీర్‌ సింగ్‌లు జావెలిన్‌ త్రో ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో చోప్రా 79.61 మీ. విసిరి ఐదో స్థానంలో నిలిచాడు. రోహిత్‌ యాదవ్‌ (78.37 మీ.), యశ్‌ (78.36 మీ.)లు తొమ్మిది, పదో స్థానాలు దక్కించుకొన్నారు. శుక్రవారం ఫైనల్‌ జరగనుంది. మెరుగైన ప్రదర్శన ఆధారంగా ముగ్గురు భారత త్రోయర్లకు ఫైనల్లో తలపడే టాప్‌-12లో చోటుదక్కింది. శ్రీలంక అథ్లెట్‌ రుమేష్‌ తరంగ 82.29 మీ. త్రో తో టాప్‌లో నిలిచాడు.

8-Sports.jpg

కోచ్‌ దత్త పుత్రుడు

పారా అథ్లెటిక్స్‌ 100మీ. టీ47 రేస్‌లో రికా ర్డు టైమింగ్‌తో స్వర్ణ పతకం కొల్లగొట్టిన దిలీప్‌ గవిట్‌ జీవితం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో ఓ ఆదివాసి కుటుంబంలో దిలీప్‌ జన్మించాడు. ఐదేళ్ల వయస్సులో చెట్టుమీదనుంచి పడిపోవడంతో చేయి విరిగింది. అయితే సరైన వైద్యం అందించలేకపోవడంతో మోచేతి నుంచి కింది వరకు చేయి తీసేయాల్సి వచ్చింది. నాటినుంచి దిలీప్‌ ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. అథ్లెట్లను కనుగొనే యత్నంలో కోచ్‌ వెద్యనాథ్‌ కాలేకు 2014లో 11 ఏళ్ల దిలీప్‌ తారసపడ్డాడు. బక్కపలుచని కుర్రాడైనా ఆగకుండా పరిగెత్తే అతడిని చూసిన వైద్యనాథ్‌..ఇంటికి తెచ్చుకొని దత్తత పుత్రుడి మాదిరిగా పెంచాడు. సొంత ఖర్చుతో చదువు చెప్పించడంతోపాటు అథ్లెట్‌గానూ తీర్చిదిద్దాడు. కాలే శిక్షణలో రాటుదేలిన దిలీ్‌ప..రాష్ట్ర, జాతీయ స్థాయిలో 200, 400 మీ. రేసుల్లో సాధారణ అథ్లెట్లను ఓడించి పతకాలు నెగ్గాడు.

ఇవి కూడా చదవండి:

బంగ్లాదేశ్ అత్యంత సురక్షితం దేశం: తమీమ్‌ ఇక్బాల్

భారత హాకీ జెర్సీ మార్పుపై వివాదం.. వివరణ ఇచ్చిన హాకీ ఇండియా

Updated Date - Jul 31 , 2026 | 03:20 AM