దులీప్ ట్రోఫీ.. వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్ ఎలా చేశారు?: హర్షా భోగ్లే
ABN , Publish Date - Jul 31 , 2026 | 10:33 AM
దులీప్ ట్రోఫీ 2026-27 సీజన్‌లో ఈస్ట్ జోన్ జట్టుకు భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై క్రికెట్ విశ్లేషకుడు హర్షా భోగ్లే స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: దులీప్ ట్రోఫీ 2026-27 సీజన్‌లో ఈస్ట్ జోన్ జట్టుకు భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై క్రికెట్ విశ్లేషకుడు హర్షా భోగ్లే స్పందించారు. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్న యువ ప్లేయర్‌కు ఇంత పెద్ద బాధ్యత అప్పగించడం వెనుక ఉన్న ఆలోచనేంటో అర్థం కావడం లేదంటూ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. కాగా ఈ సుదీర్ఘ ఫార్మాట్ ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. భారత స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈస్ట్ జోన్ జట్టుకు వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
‘సీనియర్ రెడ్ బాల్ క్రికెట్‌లో యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. వైభవ్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఇప్పటి వరకు అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 12 ఇన్నింగ్స్‌ల్లో 207 పరుగులు మాత్రమే చేశాడు. సగటు కేవలం 17.25. వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన అసాధారణమైనదే. కానీ సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడికి ఇంకా అనుభవం అవసరం’ అని హర్షా భోగ్లే ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఈ సీజన్ దులీప్ ట్రోఫీలో సీనియర్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశముంది. ఈ టోర్నీలో అతడు సుదీర్ఘ ఫార్మాట్‌లో తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం దక్కనుంది. కాగా జట్టులో మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్ వంటి సీనియర్ పేసర్లు కూడా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
బంగ్లాదేశ్ అత్యంత సురక్షితం దేశం: తమీమ్ ఇక్బాల్
భారత హాకీ జెర్సీ మార్పుపై వివాదం.. వివరణ ఇచ్చిన హాకీ ఇండియా