అజింక్యా అల్విదా..
ABN , Publish Date - Jul 31 , 2026 | 03:14 AM
భారత టెస్టు క్రికెట్‌కు వన్నె తెచ్చిన సీనియర్ ఆటగాడు అజింక్యా రహానె ఆటకు వీడ్కోలు పలికాడు. తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌తో పాటు ఐపీఎల్ నుంచి కూడా తప్పుకొంటున్నట్టు...
అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగిన రహానె
న్యూఢిల్లీ: భారత టెస్టు క్రికెట్‌కు వన్నె తెచ్చిన సీనియర్ ఆటగాడు అజింక్యా రహానె ఆటకు వీడ్కోలు పలికాడు. తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌తో పాటు ఐపీఎల్ నుంచి కూడా తప్పుకొంటున్నట్టు గురువారం సోషల్ మీడియాలో ప్రకటించాడు. జీవితంలో ముందుకు సాగేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తూ ‘క్యాప్ నెంబర్ 278కి గుడ్‌బై’ అని 38 ఏళ్ల ఈ ముంబైకర్ తెలిపాడు. 2023 తర్వాత తను భారత్ తరఫున ఆడలేదు.
‘జీవితంలో ప్రతి దానికీ ఆరంభం, ముగింపు ఉంటాయి. ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని గౌరవించి ముందుకు సాగాల్సిందే. నా బ్యాటింగ్‌లోనూ నేనెప్పుడూ టైమింగ్‌పైనే ఆధారపడేవాణ్ణి. దాని ప్రాముఖ్యం ఏమిటో నాకు తెలుసు. అందుకే అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నా. అలాగే గత రెండు దశాబ్దాలుగా భారత క్రికెట్ అభివృద్ధిలో భాగమైనందుకు గర్వంగానూ ఉంది. కానీ జాతీయ జట్టు క్రికెటర్‌గా నా అధ్యాయం ముగిసినా ఈ క్రీడతో నా ప్రయాణం మాత్రం ఆగదు. ఇక నా సుదీర్ఘ కెరీర్‌లో మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఎంసీఏ, కోచ్‌లు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు’ అని రహానె పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో 2008-2026 మధ్య తను 6 ఫ్రాంచైజీల తరఫున 5367 పరుగులు సాధించాడు.
నిశ్శబ్ద యోధుడు
అద్భుతమైన డిఫెన్స్, నిలకడ చూపే రహానె దూకుడు కంటే టైమింగ్, టెక్నిక్‌పై ఎక్కువగా ఆధారపడేవాడు. ముఖ్యంగా ఆస్ర్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా పిచ్‌లపై అతడి ఆట అమోఘం. ఒత్తిడి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంటూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన సందర్భాలు రహానె కెరీర్‌లో చాలానే ఉన్నాయి. ఫీల్డ్ బయటి ఎవరితోనూ పెద్దగా మాట్లాడే తత్వం కాదతనిది. ఓపెనింగ్ దిగమన్నా, ఐదో స్థానంలో వెళ్లమన్నా, చివరికి బెంచ్‌పై కూర్చోబెట్టినా..నిశ్శబ్దంగా ఉండేవాడు. అవకాశం వచ్చినపుడు మాత్రం తన బ్యాటుతోనే సమాధానం చెప్పేవాడు. ముఖ్యంగా 2014లో లార్డ్స్ మైదానంలో అండర్సన్ స్వింగ్, బౌన్స్‌కు టాపార్డర్ కుప్పకూలిన తరుణంలో రహానె సాధించిన 103 పరుగుల ఇన్నింగ్స్ 28 ఏళ్ల తర్వాత అక్కడ విజయాన్నందించింది.

అజేయ సారథిగా...
భారత టెస్టు కెప్టెన్‌గా రహానె పదవీకాలం చాలా తక్కువే అయినా జట్టు చరిత్రలో అది చిరస్మరణీయంగా నిలిచింది. కేవలం 6 టెస్టులకు సారథిగా వ్యవహరించి 4 విజయాలు, 2 డ్రాలతో ఓటమి లేకుండా ముగించాడు. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నెగ్గిన సారథిగా రికార్డులకెక్కాడు. ముఖ్యంగా అడిలైడ్ టెస్టులో భారత్ 36కే ఆలౌటై తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. ఆ వెంటనే కెప్టెన్ విరాట్ స్వదేశానికి రాగా, ఈ క్లిష్ట పరిస్థితిల్లో పగ్గాలు చేపట్టిన రహానె ఆసీస్‌ను ఆటాడించాడు. మెల్‌బోర్న్‌లో శతకంతో జట్టును గెలిపించగా, మూడో టెస్టు డ్రా అయ్యింది. ఇక నిర్ణాయక టెస్టులో కెప్టెన్‌గా రహానె వ్యూహాలు ఆకట్టుకున్నాయి.
రహానె కెరీర్
ఫార్మాట్ మ్యాచ్‌లు పరుగులు సెంచరీలు
టెస్టులు 80 5077 12
వన్డేలు 90 2962 3
టీ20లు 20 375 0
‘జింక్స్.. అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు. భారత క్రికెట్‌లో నీ ప్రయాణం గర్వకారణం. నువ్వు నాకిష్టమైన టెస్టు భాగస్వామివి’
కోహ్లీ
‘చిరస్మరణీయ కెరీర్‌కు శుభాకాంక్షలు. దూకుడే కాదు నిలకడ కూడా ముఖ్యమేనని నీ ఆటతో చూపావు. ఆసీస్ లో భారత్‌కు అద్భుత విజయాన్నందించావు’
సచిన్
ఇవి కూడా చదవండి:
బంగ్లాదేశ్ అత్యంత సురక్షితం దేశం: తమీమ్ ఇక్బాల్
భారత హాకీ జెర్సీ మార్పుపై వివాదం.. వివరణ ఇచ్చిన హాకీ ఇండియా