Share News

పీడకలగా మారిన రక్షాబంధన్.. ఫార్చ్యూనర్ ఢీకొని ముగ్గురు తోబుట్టువుల మృతి

ABN , Publish Date - Aug 30 , 2026 | 03:25 PM

రక్షాబంధన్ వేడుకలు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రాఖీ పండుగ కోసం కలుసుకున్న నలుగురు తోబుట్టువుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

పీడకలగా మారిన రక్షాబంధన్.. ఫార్చ్యూనర్ ఢీకొని ముగ్గురు తోబుట్టువుల మృతి

ఉత్తర్‌ప్రదేశ్: ఫరీదాబాద్‌లో రక్షాబంధన్ వేడుకలు ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తాయి. నలుగురు తోబుట్టువుల ఆనందకరమైన కలయిక.. గంటల వ్యవధిలోనే విషాదంగా మారింది. వేగంగా దూసుకొచ్చిన ఫార్చ్యూనర్‌ ఢీకొని ముగ్గురు తోబుట్టువులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలేం జరిగిందంటే...


ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సోదరులు రక్షాబంధన్ నిర్వహించుకునేందుకు.. అఖిలేష్(సోదరుడు) ఇంటికి వెళ్లారు. తమ ఇద్దరు సోదరులకు రాఖీలు కట్టిన ఆ సోదరీమణులు.. రాత్రంతా పండుగ వాతావరణాన్ని ఆస్వాదించారు. మరుసటి రోజు ఉదయం ఆ ముగ్గురు తోబుట్టువులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వారిని సాగనంపేందుకు అఖిలేష్ స్థానిక బస్‌స్టాండ్ వరకు వెళ్లారు. బస్సు కోసం వేచిచూస్తుండగా.. ఇంతలో ఓ ఫార్చ్యూనర్ కారు మృత్యువులా దూసుకొచ్చింది. ఆ వాహనం వారిని బలంగా ఢీకొట్టడంతో అఖిలేష్, అవధేష్ అక్కడికక్కడే మృతిచెందారు. వారి సోదరీమణులైన సరోజ్, రాజకుమారిలకు తీవ్రగాయాలు కాగా.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సరోజ్ మరణించగా.. ప్రస్తుతం రాజకుమారి చికిత్స పొందుతున్నారు.


అయితే.. ప్రమాదం జరిగిన వెంటనే ఫార్చ్యూనర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్టు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై బీఎన్ఎస్ సెక్షన్లు 281, 125ఏ, 106(1) కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేసినట్టు తెలిపారు.


ఇవీ చదవండి:

ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్ భాగవత్‌పై ఎంపీ కపిల్ సిబల్ విమర్శలు

ఉజ్బెకిస్థాన్ ప్రెసిడెంట్‌తో ప్రధాని మోదీ చర్చలు

Updated Date - Aug 30 , 2026 | 03:38 PM