ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌పై ఎంపీ కపిల్ సిబల్ విమర్శలు
ABN , Publish Date - Aug 30 , 2026 | 02:13 PM
న్యూయార్క్‌లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన ప్రసంగంపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ విమర్శలు గుప్పించారు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్‌లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన ప్రసంగంపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ విమర్శలు ఎక్కుపెట్టారు. మాటల్లోని స్ఫూర్తి చేతల్లోనూ కనిపించాలని అన్నారు. ‘భారత్‌లోని విభిన్నత ఇక్కడి ఏకత్వానికి ఆభరణమని భాగవత్ అన్నారు. దీన్ని రక్షించుకోవాలని అన్నారు. మాటలు సరిపోవు.. చేతల్లో కూడా చూపించాలి’ అని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్ (AHEAD) ఆధ్వర్యంలో శనివారం ఈ సభ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం భారత దేశ డీఎన్ఏలోనే ఉందని అన్నారు. దేశాలంటే కేవలం భౌగోళిక ప్రదేశాలు మాత్రమే కాదని మోహన్ భాగవత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి దేశానికి ఒక గమ్యం ఉందని స్వామి వివేకానంద చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని భారత్ చాటిచెబుతోందని అన్నారు. భారత్‌లోని ఐక్యతకు ఈ విభిన్నత ఒక అలంకారమని కూడా వ్యాఖ్యానించారు.
విభిన్నత్వాన్ని గౌరవించాలని, పండుగులా జరుపుకోవాలని ఆయన అన్నారు. మనుషుల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉండవని చెప్పారు. అన్ని ఆధ్యాత్మిక మార్గాల అంతిమ గమ్యం ఒకటేనని కూడా అన్నారు. మాతృభూమి, కర్మభూమి పట్ల తమకున్న బాధ్యతలను ఎన్నారైలు నెరవేర్చాలని కూడా ఆర్‌ఎస్ఎస్ చీఫ్ పిలుపునిచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
భిన్నత్వంలో ఏకత్వం ఇండియా డీఎన్ఏలోనే ఉంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
దేశానికి డ్రగ్స్ పీడ వదిలిపోవాలి.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని