Share News

ఉజ్బెకిస్థాన్ ప్రెసిడెంట్‌తో ప్రధాని మోదీ చర్చలు

ABN , Publish Date - Aug 30 , 2026 | 02:29 PM

భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్‌లు ఉజ్బెకిస్థాన్‌లోని 'కుక్సరోయ్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్' వేదికగా కీలక చర్చలు జరిపారు.

ఉజ్బెకిస్థాన్ ప్రెసిడెంట్‌తో ప్రధాని మోదీ చర్చలు
PM Modi Holds Delegation-Level Talks with Uzbekistan President

తాష్కెంట్, ఆగస్టు 30: భారత్, ఉజ్బెకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్‌లు ఉజ్బెకిస్థాన్‌లోని 'కుక్సరోయ్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్' వేదికగా కీలక చర్చలు నిర్వహించారు.


ఈ ఉన్నత స్థాయి సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ ఢోబాల్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (వెస్ట్) సిబి జార్జ్, ఇంకా ఇరు దేశాలకు చెందిన పలువురు సీనియర్ దౌత్యవేత్తలు పాల్గొన్నారు.


ఈ చర్చల్లో ఇరు దేశాల నేతలు ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, సాంస్కృతిక సంబంధాలపై ఆయా రంగాల పురోగతిని సమీక్షించారు. భవిష్యత్తులో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణను ఖరారు చేశారు.


ఈ చర్చలకు ముందు ప్రధాని మోదీకి అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘనంగా అధికారిక స్వాగతం పలికారు. అలాగే 'యోగా ఫెడరేషన్ ఆఫ్ ఉజ్బెకిస్థాన్' నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటించడం ఇది నాలుగోసారి. నిన్న (శనివారం) తాష్కెంట్ చేరుకున్న మోదీకి అధ్యక్షుడు మిర్జియోయెవ్ విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌కు ప్రయాణించి, రాత్రి విందుకు హాజరయ్యారు.


భారత ప్రధాని రాక సందర్భంగా తాష్కెంట్‌లోని ప్రముఖ భవనాలు, ఐకానిక్ హిల్టన్ హోటల్‌ను భారత త్రివర్ణ పతాక వర్ణాలతో అలంకరించారు. భారత సంతతి ప్రజలు సంప్రదాయ నృత్యాలు, ఇండో-ఉజ్బెత్ సంస్కృతుల సమ్మేళనంతో ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు.


బాలీవుడ్ పాటలు, కథక్, ఉజ్బెక్ సంప్రదాయ నృత్య ప్రదర్శనలను ప్రధాని మోదీ ఎక్స్ (X) వేదికగా ప్రశంసించారు. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడితో కలిసి మోదీ 'యాంగి ఉజ్బెకిస్థాన్ పార్క్' వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.


భిన్నత్వంలో ఏకత్వం ఇండియా డీఎన్ఏలోనే ఉంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

దేశానికి డ్రగ్స్ పీడ వదిలిపోవాలి.. ‘మన్ కీ బాత్‌’లో ప్రధాని

Updated Date - Aug 30 , 2026 | 02:55 PM