వారికి ఆధ్యాత్మిక సంప్రదాయాలపై అవగాహన లేదు.. బీజేపీ, ఆర్ఎస్ఎస్పై రాహుల్ ఫైర్
ABN , Publish Date - Nov 22 , 2026 | 08:43 PM
బీజేపీ, ఆర్ఎస్ఎస్పై లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ రెండింటికీ భారతీయ ఆధ్యాత్మిక, ధార్మిక సంప్రదాయాలపై కొంచెం కూడా అవగాహన లేదంటూ ఆయన ఫైరయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: బీజేపీ, ఆర్ఎస్ఎస్పై లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ రెండింటికీ భారతీయ ఆధ్యాత్మిక, ధార్మిక సంప్రదాయాలపై కొంచెం కూడా అవగాహన లేదంటూ ఆయన ఫైరయ్యారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులను అనాగరిక, దురాశపరులైన, కులతత్వ పురుషాహంకారులుగా అభివర్ణించారు. ఈరోజు (ఆదివారం) ఎక్స్ వేదికగా అర్ధనారీశ్వరుల శిల్పానికి సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఆ పుస్తక ఆవిష్కరణ సభలో తన తల్లిదండ్రుల (సోనియా, రాజీవ్ గాంధీ) అనుబంధం గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చిన్నప్పుడు భోజన సమయంలో తన నాన్న ఒడిలో అమ్మ కూర్చునేవారని రాహుల్ చెప్పారు. దీనిపై బీజేపీ నేతలు విమర్శలు కురిపించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ విమర్శలకు రాహుల్ కౌంటర్ ఇచ్చారు. సమైక రూపంలో ఉన్న శివపార్వతుల శిల్పాన్ని షేర్ చేస్తూ.. ఆధ్యాత్మిక సంప్రదాయాల లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఈ విషయం ఇంకా స్పష్టమవుతోందని ఆయన తెలిపారు. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు మాత్రం ఇది అర్థంకాలేదని విమర్శించారు. భయం, కోపం, ద్వేషం మూడూ వలలాగా మారి బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతుదారుల హృదయాలను కప్పేశాయని, అందుకే వారు ప్రేమను వ్యక్తపరచలేకపోతున్నారని పేర్కొన్నారు. ఒక నిజమైన హిందువుగా వారిని ఆ వల నుంచి విడిపించడం తన కర్తవ్యమని చెప్పారు. కాగా రాహుల్ షేర్ చేసిన అర్ధనారీశ్వరుల శిల్పం 12 శతాబ్దానికి చెందినది. శివుడి ఒడిలో పార్వతి దేవి కూర్చున్నట్టుగా చెక్కిన కళారూపమది.
ఈ వార్తలూ చదవండి
కేంద్ర మంత్రి జైశంకర్‌తో నేపాల్ ప్రధాని బలేంద్ర షా భేటీ..
ఎమ్మెల్యే అసభ్య మెసేజీలు పెట్టినట్టు ఆరోపణ.. మద్రాస్ హైకోర్టు సీరియస్