కేంద్ర మంత్రి జైశంకర్‌తో నేపాల్ ప్రధాని బలేంద్ర షా భేటీ..
ABN , Publish Date - Nov 22 , 2026 | 08:27 PM
నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఆదివారం న్యూఢిల్లీలో వారిద్దరూ సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ: నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఇవాళ (ఆదివారం) న్యూఢిల్లీలో వారిద్దరూ సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ఈ సందర్భంగా నేపాల్ ప్రధానిని కలవడం సంతోషంగా ఉందని జైశంకర్ పేర్కొన్నారు. ఆ దేశంతో సన్నిహిత సంబంధాలకు భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు భారత్‌కు షా వచ్చారని తెలిపారు. ఆ దేశంతో స్నేహాన్ని భారత్ ఎంతో విలువైనదిగా భావిస్తోందని పేర్కొన్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో షా భేటీ కోసం ఎదురుచూస్తున్నట్లు జైశంకర్ వెల్లడించారు.
కాగా, సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నేపాల్ ప్రధాని బలేంద్ర షా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, అభివృద్ధి సహకారం, ఇంధనం, జలవనరులు వంటి అంశాలు చర్చకు రానున్నాయి. అలాగే, డిజిటల్ అనుసంధానం, స్టార్టప్‌లు, సాంకేతికత, ఆవిష్కరణలు, క్రీడలు వంటి కొత్త రంగాలపైనా దృష్టి సారించనున్నారు. జలవిద్యుత్, రైల్వేలు, మౌలిక సదుపాయాలు, సరిహద్దు సహకారాన్ని మరింతగా పెంపొందించుకునే మార్గాలను అన్వేషించనున్నారు. ఇప్పటికే పూర్తయిన పలు ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉండగా.. కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికలను ఇరుపక్షాలు ముందుకు తీసుకెళ్లనున్నాయి.
ఈ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా నేపాల్ ప్రధాని కలవనున్నారు. కాగా, మార్చి 2026లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత షా.. భారత్‌కు రావడం ఇదే తొలిసారి. అలాగే, ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే ఆయన తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన కావడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి
బిహార్‌లో రణరంగం.. బీజేపీ జెండాలను కాళ్లతో తొక్కుతూ..
సోనియా గాంధీ బాల్యం గడిపిన ఇల్లు ఎప్పుడైనా చూశారా.. నెట్టింట ఫొటోలు వైరల్..