Share News

సోనియా గాంధీ బాల్యం గడిపిన ఇల్లు ఎప్పుడైనా చూశారా.. నెట్టింట ఫొటోలు వైరల్..

ABN , Publish Date - Nov 22 , 2026 | 05:13 PM

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకం అనేక సంచలనాలకు వేదికగా మారింది. నవంబర్ 10, 2026న విడుదలైన ఈ పుస్తకంలో సోనియా గాంధీ అనేక విషయాలను పంచుకున్నారు. దీనిలో భాగంగా సోనియా గాంధీ బాల్యానికి సంబంధించిన ఇల్లు చర్చనీయాంశమైంది.

సోనియా గాంధీ బాల్యం గడిపిన ఇల్లు ఎప్పుడైనా చూశారా.. నెట్టింట ఫొటోలు వైరల్..
Sonia Gandhi House

ఇటలీ, నవంబర్ 22: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకం అనేక సంచలనాలకు వేదికగా మారింది. నవంబర్ 10, 2026న విడుదలైన ఈ పుస్తకంలో ఆమె అనేక విషయాలను పంచుకున్నారు. 1965లో రాజీవ్ గాంధీతో పరిచయం, నెహ్రూ-గాంధీ కుటుంబంతో అనుబంధం, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల జీవితాల్లో విషాద ఘటనలను ప్రస్తావించారు. అలాగే, రాజకీయ ప్రవేశం, 2004లో ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడం వంటి విషయాలను వివరించారు. అయితే, వీటితో పాటు తాజాగా సోనియా గాంధీ బాల్యానికి సంబంధించిన ఇల్లు కూడా చర్చనీయాంశమైంది.


ఇటలీలోని విసెంజా ప్రావిన్స్‌లో ఉన్న లుసియానాలో 1946 డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మించారు. ఆమె విదేశాలకు వెళ్లడానికి ముందు బాల్యంలో కొంతకాలం ఆ గ్రామంలోని ఇంట్లోనే గడిపారు. ఆ ఇంటిని రాతితో నిర్మించగా.. మొత్తం ఆరు గదులు ఉన్నాయి. ప్రస్తుతం దీనిని ఇటలీకి చెందిన సిక్కు వ్యాపారవేత్త సుఖ్‌దేవ్ సింగ్ కాంగ్ 2020లో కొనుగోలు చేశారు. ఆ ఇంటికి 'ఇండియన్ హౌస్' అని ఆయన పేరు పెట్టారు. అలాగే, భవనం వెలుపల భారత జాతీయ పతాకాన్ని పెయింటింగ్ వేయించారు. దానిపై సోనియా గాంధీ జన్మస్థలం, పుట్టిన తేదీని తెలియజేసే వివరాలను రాయించారు. ప్రస్తుతం ఈ ఇంటిని కాంగ్ కుటుంబమే సంరక్షిస్తుండగా.. నిర్వహణ, ఆస్తి పన్నుల కోసం ఏటా సుమారు వెయ్యి యూరోలు ఖర్చు చేస్తోంది. అలాగే, సందర్శకులకు ఇంటి చరిత్రను వివరించేలా సంరక్షకుడినీ నియమించింది.


భవిష్యత్తులో సోనియా గాంధీ బాల్య జ్ఞాపకాలు, కుటుంబ చరిత్రను తెలిపే మ్యూజియంగా ఆ ఇంటిని తీర్చిదిద్దాలని సుఖ్‌దేవ్ సింగ్ కాంగ్ భావిస్తున్నారు. ఇదే జరిగితే ఇటలీకి వెళ్లే భారతీయ పర్యాటకులకు ఈ ఇల్లు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. అలాగే, లుసియానా గ్రామానికి పర్యాటకుల తాకిడి పెరిగి స్థానిక వ్యాపారాలకూ ప్రయోజనం కలుగుతుందని కాంగ్ భావిస్తున్నారు. కాగా, 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకం విడుదలైన నాటి నుంచి అందులోని అనేక అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ చిన్ననాటి వివరాలు తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో నెట్టింట సోనియా గాంధీ బాల్యం గడిపిన ఇంటి ఫొటోలు వైరల్‌గా మారాయి.


ఈ వార్తలు కూడా చదవండి

బిహార్‌లో రణరంగం.. బీజేపీ జెండాలను కాళ్లతో తొక్కుతూ..

భారత్, చైనా కమాండర్ల భేటీ.. అరుణాచల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చ..

Updated Date - Nov 22 , 2026 | 05:28 PM