Share News

బిహార్‌లో రణరంగం.. బీజేపీ జెండాలను కాళ్లతో తొక్కుతూ..

ABN , Publish Date - Nov 22 , 2026 | 04:03 PM

బిహార్‌లో గంగా నదిపై నిర్మించిన నితీశ్ సేతు వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌కు ఆహ్వానం అందలేదన్న కారణంతో ఆర్జేడీ కార్యకర్తలు వంతెనపై నిరసనకు దిగారు.

బిహార్‌లో రణరంగం.. బీజేపీ జెండాలను కాళ్లతో తొక్కుతూ..
Bihar Politics

పాట్నా, నవంబర్ 22: బిహార్‌లో గంగా నదిపై నిర్మించిన నితీశ్ సేతు వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌కు ఆహ్వానం అందలేదన్న కారణంతో ఆర్జేడీ కార్యకర్తలు వంతెనపై నిరసనకు దిగారు. వంతెన ప్రారంభించిన కాసేపటికే ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ చిత్రాలతో ఉన్న పోస్టర్లను చించివేశారు. అలాగే, బీజేపీ జెండాలను కాళ్లతో తొక్కుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రధాని నరేంద్ర మోదీ రూ.4,280 కోట్ల వ్యయంతో నిర్మించిన నితీశ్ సేతు వంతెనను ఈరోజు (ఆదివారం) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ పాల్గొన్నారు. అయితే, స్థానిక ఎమ్మెల్యే తేజస్వీ యాదవ్‌కు ఆహ్వానం అందకపోవడంపై రాఘోపూర్ ప్రాంతానికి చెందిన ఆర్జేడీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వామిగా ఉన్నారని గుర్తుచేశారు. ఈ మేరకు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తేజస్వీ యాదవ్‌కు మద్దతుగా పార్టీ జెండాలు పట్టుకుని వంతెనపై భారీ ర్యాలీ నిర్వహించారు. లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీకి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ చిత్రాలతో ఉన్న బ్యానర్లను చించివేశారు. బీజేపీ జెండాలనూ కాళ్లతో తొక్కారు. ఈ నిరసన సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది.


మరోవైపు, ఈ వంతెనకు మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పేరు పెట్టడంపై తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. జీవించి ఉన్న రాజకీయ నాయకుడి పేరును ప్రజా నిర్మాణానికి పెట్టడాన్ని ఆయన ప్రశ్నించారు. సాధారణంగా స్మారక చిహ్నాలకు మరణించిన నాయకుల పేర్లనే పెడతారని గుర్తు చేశారు. ఇది చూస్తుంటే నితీశ్ కుమార్ రాజకీయంగా ముగిసిపోయారనేది అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఈ వంతెనను నితీశ్ గతంలోనే ప్రారంభించారని, దీని నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులూ రాలేదని తెలిపారు. ఈ వంతెనకు 'అక్షయవత్ రాయ్ సేతు' అని పేరు పెట్టాలని తాను ప్రతిపాదించిన విషయాన్ని తేజస్వీ గుర్తు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేగా జనవరిలోనే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. అలాగే, దీనిపై అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ తీర్మానాన్నీ ప్రవేశపెట్టినట్లు చెప్పుకొచ్చారు. కాగా, వంతెనకు నితీశ్ పేరు పెట్టడాన్ని ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ సమర్థించారు. రెండు దశాబ్దాల ప్రజాసేవకు గుర్తింపుగా ఈ పేరు పెట్టినట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

వికారాబాద్‌లో చిరుత కలకలం.. రైతుపై దాడికి యత్నం..

భారత్, చైనా కమాండర్ల భేటీ.. అరుణాచల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చ..

Updated Date - Nov 22 , 2026 | 04:16 PM