ఎమ్మెల్యే అసభ్య మెసేజీలు పెట్టినట్టు ఆరోపణ.. మద్రాస్ హైకోర్టు సీరియస్
ABN , Publish Date - Nov 22 , 2026 | 08:17 PM
టీవీకే ఎమ్మెల్యేపై ఫిర్యాదు విషయంలో ఇప్పటివరకూ చర్యలేవీ ఎందుకు తీసుకోలేదని మద్రాస్ హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది.
ఇంటర్నెట్ డెస్క్: కళ్లకురిచ్చి కలెక్టర్‌కు టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ అసభ్య మెసేజీలు పెట్టినట్టు ఆరోపణలు రావడం ప్రస్తుతం తమిళనాడులో కలకలం రేపుతోంది. ఈ విషయమై తాజాగా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసులు ఇప్పటివరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇవి పనిప్రదేశంలో వేధింపులు కావా? అని జస్టిస్ విక్టోరియా గౌరీ ప్రశ్నించారు.
ఈ విషయమై కలెక్టర్ భర్త ఫిర్యాదు చేశారని జస్టిస్ విక్టోరియా గౌరి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన నాటి నుంచి ఇప్పటివరకూ పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్‌పై డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు ఇప్పటికే వేర్వేరుగా ఫిర్యాదు చేశాయి. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ ఆరోపణలపై తమిళనాడు న్యాయశాఖ మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ స్పందించారు. అవన్నీ నిరాధారణ ఆరోపణలంటూ తోసిపుచ్చారు.
ఈ వివాదంపై ఎంపీ కనిమొళి తొలిసారిగా స్పందించారు. ఎమ్మెల్యే అసభ్యకర మెసేజీలు పెట్టినట్టు, మద్యం మత్తులో కలెక్టర్ ఇంటికి వెళ్లి వేధించినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయిన కథనాలను ప్రస్తావించారు. ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ మాత్రం ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. డీఎంకే నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ కెమెరాలు ఉన్న కలెక్టర్ బంగళాలోకి తాను ఎలా వెళ్లగలనని ప్రశ్నించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల్లో ఓటమి.. వీధి దీపాలను తొలగించిన ఎమ్మెల్యే అనుచరుడు..?
సోనియా గాంధీ బాల్యం గడిపిన ఇల్లు ఎప్పుడైనా చూశారా.. నెట్టింట ఫొటోలు వైరల్..