Share News

ఎన్నికల్లో ఓటమి.. వీధి దీపాలను తొలగించిన ఎమ్మెల్యే అనుచరుడు..?

ABN , Publish Date - Nov 22 , 2026 | 06:27 PM

రాజస్థాన్‌లో వీధి స్తంభాలకు అమర్చిన ఎల్ఈడీ లైట్లు తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసింది. స్థానిక నేత ఒకరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోవడంతోనే వీధి దీపాలను తొలగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఎన్నికల్లో ఓటమి.. వీధి దీపాలను తొలగించిన ఎమ్మెల్యే అనుచరుడు..?
Rajasthan LED Lights Issue

జైపూర్, నవంబర్ 22: రాజస్థాన్‌లో వీధి స్తంభాలకు అమర్చిన ఎల్‌ఈడీ లైట్లను తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసింది. స్థానిక నేత ఒకరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోవడంతోనే వీధి దీపాలను తొలగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ కక్షతోనే వాటిని తొలగించారంటూ ఎమ్మెల్యేపైనా ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన టోంక్ జిల్లా నివాయ్ ప్రాంతంలోని రణోలి గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది.


రణోలి గ్రామ పంచాయతీ పరిధిలోని కుమ్హారోంకి ఢాణీ, బేగంపురా, హనీఫ్‌గంజ్, బీజల్‌పురా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు ముందు ఆయా గ్రామాల్లో సుమారు 50 ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. నివాయ్ ఎమ్మెల్యే రామ్ సహాయ్ వర్మ వ్యక్తిగత సహాయకుడు అలోక్ శర్మ చొరవతో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే, అలోక్ శర్మ భార్య ప్రియాంక శర్మ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ అధికారులు వీధి దీపాలను తొలగించే చర్యలు ప్రారంభించారు. విద్యుత్ శాఖకు చెందిన జైపూర్ విద్యుత్ పంపిణీ సంస్థ (JVVNL) సిబ్బంది గ్రామాలకు చేరుకుని సుమారు 10 విద్యుత్ స్తంభాలపై ఉన్న దీపాలను తొలగించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.


అయితే, కొత్తగా ఎన్నికైన సర్పంచులు విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు అంగీకరించడంతో మిగిలిన దీపాల తొలగింపును విద్యుత్ శాఖ సిబ్బంది నిలిపివేశారు. ఈ సందర్భంగా స్థానికులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాతే వీధి దీపాలను తొలగించడం ప్రారంభమైందని తెలిపారు. ప్రియాంక శర్మ ఓటమితోనే అధికారులు ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. కాగా, రాజకీయ కక్షతో దీపాలను తొలగించారనే ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. అనుమతులు లేకుండా విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం వల్లే అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. మరోవైపు, అక్రమ కనెక్షన్లపై విచారణకు ఆదేశించినట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో వీధి దీపాల తొలగింపు వెనుక అసలు కారణమేంటన్నది విచారణలో తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

సోనియా గాంధీ బాల్యం గడిపిన ఇల్లు ఎప్పుడైనా చూశారా.. నెట్టింట ఫొటోలు వైరల్..

బిహార్‌లో రణరంగం.. బీజేపీ జెండాలను కాళ్లతో తొక్కుతూ..

Updated Date - Nov 22 , 2026 | 06:32 PM