Share News

ఈడీ ఆరోపణలపై విచారణ.. పంజాబ్ న్యాయవాదికి ఊరట

ABN , Publish Date - Sep 05 , 2026 | 07:23 PM

ఈడీ ఆరోపణలపై విచారణ కోరినందుకు తనను ప్రభుత్వ సంస్థలు వేధిస్తున్నాయని పంజాబ్ న్యాయవాది నిఖిల్ కోర్టును ఆశ్రయించారు. తన ఫామ్‌హౌస్‌ను కూల్చేందుకు యత్నిస్తున్నారన్నారు.

ఈడీ ఆరోపణలపై విచారణ.. పంజాబ్ న్యాయవాదికి ఊరట
Punjab CM Bhagwant Mann

ఇంటర్నెట్ డెస్క్: ఈడీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయాలని పిల్ దాఖలు చేసినందుకు తన ఫామ్‌హౌస్‌ను కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని పంజాబ్ కోర్టును ఆశ్రయించిన న్యాయవాది నిఖిల్‌కు ఊరట దక్కింది. సదరు న్యాయవాది ఫామ్‌హౌస్‌ను కూల్చే ప్రక్రియను సెప్టెంబరు 11 వరకు నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్‌ అనుచరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అవినీతి ఆరోపణలు చేస్తోందని, దానిపై సీబీఐ విచారణ జరపాలని కొన్ని రోజుల క్రితం నిఖిల్ పిల్ దాఖలు చేశారు. ఈ విషయమై తనను ప్రభుత్వ సంస్థలు వేధిస్తున్నాయని నిఖిల్ ఆరోపించారు. అందులో భాగంగా మొహాలీ సమీపంలో తనకున్న ఫామ్‌హౌస్‌ను కూల్చడానికి సిద్ధమయ్యారంటూ నిన్న(శుక్రవారం) రాత్రి పంజాబ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ధర్మాసనం అత్యవసర బెంచ్‌ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది.

కోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబరు 11 వరకు తాము ఎలాంటి చర్యలు తీసుకోబోమని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. అయితే ఆ న్యాయవాది ఫామ్‌హౌస్‌ సంబంధించి తాము 2024 నవంబర్‌లోనే నోటీసులు జారీ చేశామని చెప్పింది.


సీబీఐ విచారణ జరపాలంటూ పిల్

పంజాబ్ డీజీపీకి ఆగస్టు 12న ఈడీ పంపిన లేఖ ఆధారంగా నిఖిల్ ఈ పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వ టెండర్లు, ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియలో జరుగుతున్న అవినీతిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీజీపీని ఈడీ కోరిందని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు, ప్రభుత్వానికి మధ్య నితిన్ గోహల్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. ఈ నెట్‌వర్క్ పలు ప్రభుత్వ రహస్య డాక్యుమెంట్లనూ లీక్ చేసిందని ఈడీ తెలిపింది. ఈ ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని నిఖిల్ హైకోర్టును కోరారు.


ఇవి కూడా చదవండి...

సీజేపీ నిరసనల్లో పోలీసులకు ఇన్‌ఫ్లుయెన్సర్ సవాల్.. ఆపై అరెస్ట్

జమ్మూ-కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ యాసిర్ హతం

Updated Date - Sep 05 , 2026 | 08:15 PM