Share News

సీజేపీ నిరసనల్లో పోలీసులకు ఇన్‌ఫ్లుయెన్సర్ సవాల్.. ఆపై అరెస్ట్

ABN , Publish Date - Sep 05 , 2026 | 06:13 PM

సీజేపీ నిరసనకారులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జులైలో చేపట్టిన ఉద్యమంలో ఎంతటి హింస జరిగిందో తెలిసిందే. అయితే.. ఓ నిరసనకారురాలి తండ్రిపై దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు.

సీజేపీ నిరసనల్లో పోలీసులకు ఇన్‌ఫ్లుయెన్సర్ సవాల్.. ఆపై అరెస్ట్
Delhi protests

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) జులైలో చేపట్టిన ఉద్యమంలో ఎంతటి హింస చెలరేగిందో తెలిసిందే. అయితే.. ఈ ఆందోళనల్లో ఓ సీజేపీ నిరసనకారురాలు నిషు ఆజాద్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఇన్‌ఫ్లు‌యెన్సర్ స్వతంత్ర భరద్వా‌జ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో ఒక రోజు కస్టడీలోకి తీసుకున్నారు. భరద్వాజ్ తన తండ్రి తలపై ఓ ఆయుధంతో దాడి చేశాడని, ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఇన్‌ఫ్లుయెన్సర్ భరద్వాజ్ తాను ఓ నిరసనకారురాలి తండ్రిపై దాడి చేశానని వెల్లడించాడు. ఈ దాడిలో ఆయన తలకు గాయం కాగా, కనీసం 60 కుట్లు పడిఉంటాయని అతడు అన్నాడు. ‘ఇలాంటి దాడికి పాల్పడటం ఏ సెక్షన్ పరిధిలోకి వస్తుందో మీకు తెలుసా?.. హత్యాయత్నం. అయినా సరే.. రాజకీయ నాయకుల పలుకుబడి వల్ల పోలీసులు నన్ను అరెస్ట్ కూడా చేయలేదు’ అని భరద్వాజ్ చెప్పుకొచ్చాడు.


ఈ వీడియోపై బాధితుడి కుమార్తె నిషు ఆజాద్ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో పోలీసులు మొదటగా ఈ కేసుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి నిరాకరించినట్లు ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ తమకు న్యాయం చేయాలని కోరారు. అంతేకాకుండా, తనను కొందరు సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపించారామె. అత్యాచారం బెదిరింపులకూ పాల్పడుతున్నారని వాపోయారు.


ఈ వ్యవహారంపై స్పందించిన సమాజ్ వాద్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులను కలిశారు. నిందితుడు భరద్వాజ్‌ను అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దాంతో పాటు నిందితుడిపై హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార బెదిరింపులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు భరద్వాజ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం తదుపరి దర్యాప్తు మేరకు ఒక రోజు పాటు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు.


అయితే నిషు ఆజాద్ ఆరోపణలపై స్పందించిన పోలీసులు బాధితుడికి స్వల్ప గాయాలే అయ్యాయని అందుకే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వెల్లడించారు. ఈ వ్యవహారంపై స్పందించిన భరద్వాజ్.. ఆ సమయంలో తనను 10 నుంచి 15 మంది చుట్టుముట్టారని, ఆత్మరక్షణ కోసమే సదరు వ్యక్తిపై దాడికి పాల్పడినట్టు తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

బీసీసీఐకి ఐవోఏ షాక్.. సౌకర్యాలు నచ్చకపోతే సొంతంగా ఏర్పాటు చేసుకోండి!

పాక్‌తో మ్యాచ్.. స్మృతి మంధానని ఊరిస్తున్న ఆల్‌టైమ్ రికార్డు

Updated Date - Sep 05 , 2026 | 06:13 PM