టీచర్స్ డే.. ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సచిన్!
ABN , Publish Date - Sep 05 , 2026 | 04:53 PM
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురుపూజోత్సవం సందర్భంగా ఓ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన తండ్రి ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని సచిన్ ప్రారంభించారు.
స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురుపూజోత్సవం సందర్భంగా ఓ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన తండ్రి ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని సచిన్ ప్రారంభించారు. యువ వైద్యుల కోసం 'ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్ మెమోరియల్ ఫెలోషిప్'ను సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ (STF) ద్వారా ప్రకటించారు. శ్రీనగర్‌లో క్లఫ్ట్ (పెదవి చీలిక), క్రానియోఫేషియల్ (ముఖ ఎముకల) విభాగంలో నైపుణ్యం సాధించడానికి యువ వైద్యులకు సచిన్ ఆర్థిక సాయం చేయనున్నారు.
ఈ ఫెలోషిప్ కింద ఏటా ఒక డాక్టర్ ఆఫ్ మెడిసిన్(MD) చేసిన వైద్యులకి శ్రీనగర్‌లో ఏడాది పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అందుకోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని సచిన్ అందజేయనున్నారు. ఈ కోర్సును పూర్తి చేసుకున్న వైద్యులకి సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేక సర్టిఫికేట్‌ను కూడా ప్రదానం చేస్తారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలానే తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన వ్యక్తుల గురించి ఆలోచించినప్పుడు ముందుగా క్రికెట్ మైదానం లేదా కోచ్‌లు గుర్తుకురారని, తన క్రికెట్ ప్రయాణం మొదట ఇంటి నుంచే ప్రారంభమైందని పేర్కొన్నారు. తనకు తొలి గురువు తన తండ్రేనని సచిన్ వెల్లడించారు.
తన తండ్రి రమేశ్ టెండూల్కర్ ఒక ప్రొఫెసర్‌గా, రచయితగా, కవిగానే కాకుండా తనకు అత్యుత్తమ మార్గదర్శిగా నిలిచారని సచిన్ తెలిపారు. తనకు క్రికెట్‌ను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛనిచ్చారని, అదే సమయంలో ఎంతటి విజయాలు సాధించినా సరే నైతిక విలువలను ఎప్పటికీ కోల్పోకూడదని తన తండ్రి చెప్పారని సచిన్ వెల్లడించారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా వైద్యుల కోసం ఈ కొత్త కార్యక్రమాన్ని అందుబాటులోకి తేవడం పట్ల సచిన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇవి కూడా చదవండి:
బీసీసీఐకి ఐవోఏ షాక్.. సౌకర్యాలు నచ్చకపోతే సొంతంగా ఏర్పాటు చేసుకోండి!
పాక్‌తో మ్యాచ్.. స్మృతి మంధానని ఊరిస్తున్న ఆల్‌టైమ్ రికార్డు