Share News

35 ఏళ్ల తర్వాత అన్న చెంతకు తమ్ముడు.. 'సర్' కలిపిన బంధం

ABN , Publish Date - Sep 05 , 2026 | 04:36 PM

ఒక ప్రభుత్వ పత్రం కోసం వెళ్లిన వ్యక్తికి ఊహించని విధంగా తన అన్న దొరికాడు. ఏకంగా 35 ఏళ్లుగా ఒకరికి ఒకరు దూరంగా ఉన్న ఇద్దరు అన్నదమ్ములను ఓటర్ జాబితా వెరిఫికేషన్ ప్రక్రియ కలిపింది.

35 ఏళ్ల తర్వాత అన్న చెంతకు తమ్ముడు.. 'సర్' కలిపిన బంధం
Haryana brothers reunited after 35 years

ఇంటర్నెట్ డెస్క్: ఒక ప్రభుత్వ పత్రం కోసం వెళ్లిన వ్యక్తికి ఊహించని విధంగా తన అన్న దొరికాడు. ఏకంగా 35 ఏళ్లుగా ఒకరికి ఒకరు దూరంగా ఉన్న ఇద్దరు అన్నదమ్ములను ఓటర్ జాబితా వెరిఫికేషన్ ప్రక్రియ(సర్) కలిపింది. హరియాణాలోని జింద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో గత 35 ఏళ్లుగా నివసిస్తున్న సీతారామ్ ఇటీవల హరియాణాలోని జింద్ జిల్లా మానోహర్‌పూర్‌కు వెళ్లారు (Brothers reunited after 35 years).


ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా తన వివరాలను ధ్రువీకరించుకోవడానికి ఆయనకు పాత స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (SLC) అవసరమైంది. దీంతో తాను చదువుకున్న మానోహర్‌పూర్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్‌కు వెళ్లి పాత సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ ఆయన జీవితం ఊహించని మలుపు తిరిగింది. సీతారామ్ వివరాలను పరిశీలిస్తున్న సమయంలో అక్కడి బూత్ లెవల్ ఆఫీసర్ పలు వివరాలు కోరారు. సీతారామ్ తన గ్రామం మానోహర్‌పూర్ అని, తన అన్న పేరు దల్బీర్ సింగ్ అని చెప్పారు (Jind brothers reunion).


యాదృచ్ఛికంగా ఆ అధికారికి దల్బీర్ వ్యక్తిగతంగా తెలుసు. అంతేకాదు.. దల్బీర్ ఫోన్ నంబర్ కూడా ఆయన వద్ద ఉంది. అధికారి చొరవతో ఆ అన్నదమ్ములు 35 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్న ఆనందంతో ఇద్దరి కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. అక్కడ ఉన్న స్కూల్ సిబ్బంది, ఇతరులు కూడా ఈ భావోద్వేగ దృశ్యాన్ని చూసి చలించిపోయారు.


సీతారామ్ చిన్న వయసులోనే కుటుంబానికి దూరమయ్యారు. చిన్న వయసులో పోలియోతో బాధపడుతున్న సీతారామ్‌ను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు పంజాబ్‌కు తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు అక్కడ కొంతకాలం చికిత్స కోసం ఉంచారు. కొంతకాలం తర్వాత కుటుంబ సభ్యులు వెళ్లేసరికి.. సీతారామ్ అక్కడ కనిపించలేదు. ఆ తర్వాత కుటుంబం ఆయన కోసం చాలా కాలం వెతికింది. బంధువులు, పరిచయస్తులను సంప్రదించినా ఆచూకీ లభించలేదు (SIR verification Haryana).


మరోవైపు సీతారామ్ పంజాబ్‌లోనే ఉండిపోయారు. అక్కడ వివిధ పనులు చేస్తూ జీవనం సాగించారు. ఒక ప్రైవేట్ స్కూల్‌లో ప్యూన్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించుకున్నారు. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. సీతారామ్‌కు పంజాబ్‌లో జరుగుతున్న సర్ ప్రక్రియలో తన వివరాలను ధ్రువీకరించుకోవాల్సి వచ్చింది. అందుకు పాత విద్యా ధ్రువపత్రం అవసరమైంది. అందుకే 35 ఏళ్ల తర్వాత తన పాత గ్రామానికి, తాను చదువుకున్న స్కూల్‌కు తిరిగి వచ్చారు. అక్కడ తన అన్నయ్యను కలుసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

రైల్వే ట్రాక్‌పై చిక్కుకున్న ట్రక్కు.. క్షణాల్లో దూసుకొచ్చిన రైలు.. షాకింగ్ వీడియో వైరల్..


9/11 దాడులు.. వారం ముందే అమెరికాకు హెచ్చరిక..

Updated Date - Sep 05 , 2026 | 05:30 PM