మెల్‌బోర్న్‌లో మోదీకి ఘన స్వాగతం.. మార్వెల్ స్టేడియం 'హౌస్‌ఫుల్'
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:15 PM
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి మెల్‌బోర్న్ మార్వెల్ స్టేడియంలో ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి 30 వేల మందికిపైగా ఎన్ఆర్ఐలు హాజరుకావడంతో స్టేడియం కిక్కిరిసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి మెల్‌బోర్న్ మార్వెల్ స్టేడియంలో ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. 'మెల్‌బోర్న్ మీట్స్ మోదీ' పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి 30 వేల మందికిపైగా ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. దీంతో ఒక్కసారిగా స్టేడియమంతా కిక్కిరిసింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్.. మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. తనకు లభించిన ఆత్మీయ ఆతిథ్యం పట్ల ఆస్ట్రేలియా ప్రజలు, ప్రధాని ఆల్బనీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సిడ్నీలో గతంలో రెండుసార్లు ప్రవాస భారతీయులను కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు మోదీ. అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఉంటే, మెల్‌బోర్న్‌లో ఐకానిక్ స్టేడియం ఉందని పేర్కొన్నారు. అయితే.. నేడు మార్వెల్ స్టేడియంలో అభిమానుల సందడి నెలకొనడంతో 'ఈ షో హౌస్‌ఫుల్.. బ్లాక్‌బస్టర్' అని మోదీ వ్యాఖ్యానించగా.. అక్కడివారు ఒక్కసారిగా హర్షధ్వానాలతో హోరెత్తించారు. 'భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నాయి. ఈ బంధాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దడంలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకం. మెల్‌బోర్న్‌లోని అనేక ప్రాంతాలు ఇప్పుడు 'మినీ ఇండియా'గా గుర్తింపు పొందుతూ, భారతీయ సంస్కృతితో అలలారుతోంది. భారత్ అభివృద్ధిలో మీరంతా భాగస్వామ్యం కావాలి.. 'గ్రో మోర్.. అచీవ్ మోర్' నినాదంతో ముందుకెళ్లాలి' అని మోదీ పిలుపునిచ్చారు.
'5G రంగంలో భారత్ వేగంగా దూసుకెళ్తోంది. త్వరలో 6G టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తాం. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా 6G దిశగా పయనిస్తున్నాం. ఓ లక్ష్యం పూర్తైతే.. మరో సంకల్పంతో ముందుకు సాగాలి. రానున్న కాలంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవబోతోంది. చంద్రయాన్ ద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టాం. స్పేస్‌లోకి గగన్‌యాన్‌ను పంపేందుకూ సిద్ధమవుతున్నాం. భారత్‌లో త్వరలో స్పేస్ స్టేషన్‌ను నిర్మించబోతున్నాం. భారత్ శక్తి, సామర్థ్యాలకు 'ఆపరేషన్ సిందూర్' ఓ ఉదాహరణ' అని మోదీ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీని విజనరీ నాయకుడిగా అభివర్ణించారు. ప్రపంచ దేశాలకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారన్న అల్బనీస్.. మోదీ తమకు ఆప్తమిత్రుడని కొనియాడారు. ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రశంసించారు.
ఇవీ చదవండి:
అక్రమ భవనాలు, నిర్మాణాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ముగిసిన గడువు.. వాట్సాప్‌నకు మరో ఛాన్స్ లేదు: కేంద్ర ప్రభుత్వం