Share News

అక్రమ భవనాలు, నిర్మాణాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jul 09 , 2026 | 03:25 PM

దేశవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు, సురక్షితంకాని భవనాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమ భవనాలు, నిర్మాణాల కూల్చివేతలపై నివేదికలు సమర్పించాలని ఆయా మున్సిపల్ అధికారులను ఆదేశించింది.

అక్రమ భవనాలు, నిర్మాణాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Supreme Court

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు, సురక్షితంకాని భవనాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదకరంగా ఉండి, విపత్తులకు దారితీసే భవనాలను కూల్చివేయడం లేదా మూసివేయడంపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని ఢిల్లీ, గురుగ్రామ్, లఖ్‌నవూ, పాట్నా, తమిళనాడుకు చెందిన ఆయా మున్సిపల్ ఉన్నతాధికారులను ఆదేశించింది. ఢిల్లీలోని సాకేత్‌లో ఇటీవల భవనం కూలిన విషాద ఘటన సహా లఖ్‌నవూ(యూపీ)లోని మాల్వీయా నగర్, అలీగంజ్‌లలో జరిగిన అగ్నిప్రమాదాలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ అహ్సనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్.మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం.. మే 20న కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎలాంటి చర్యలు చేపట్టారో న్యాయస్థానం ముందుంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగస్టు 4న జరిగే తదుపరి విచారణకు సంబంధిత అధికారులు స్వయంగా హాజరు కావాలని పేర్కొంది.


సాకేత్, మాల్వీయా నగర్, లజపత్ నగర్‌లలో కాలపరిమితితో కూడిన క్షేత్రస్థాయి సర్వే నిర్వహించేందుకు ఐఐటీ ఢిల్లీకి చెందిన ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్లు, ఇద్దరు డ్రాఫ్ట్స్‌మెన్‌లతో కూడిన ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ బృందంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD) అధికారులు కూడా ఉంటారు. ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలోకి వచ్చే సరోజినీ నగర్‌లోనూ ఇదే తరహా చర్యలు చేపట్టనున్నారు. ఈ ప్రక్రియలో కమిటీ ఎలాంటి అలసత్వం వహించకూడదని, నిజాయతీతో కూడిన నివేదికను సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది.


'కమిటీ నిజాయతీతో కూడిన నివేదికను సమర్పించే విషయంలో ఎలాంటి అలసత్వం వహించరాదని మేం స్పష్టం చేస్తున్నాం. ఏవైనా సందేహాలు తలెత్తితే, నివేదిక నిజాయతీని నిర్ధారించేందుకు అవసరమైతే న్యాయస్థానం నుంచి ఓ ప్రత్యేక బృందాన్నీ పంపవచ్చు' అని కోర్టు పేర్కొంది. సంబంధిత అధికారులు తదుపరి విచారణ తేదీలోగా తీసుకున్న చర్యల నివేదికలను సమర్పించడంలో, కోర్టు ఆదేశాలను పాటించడంలో విఫలమైనట్లయితే.. వారిపై సుమోటోగా ధిక్కార చర్యలు చేపడతామని కూడా న్యాయస్థానం హెచ్చరించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు, కూల్చివేత ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. తదుపరి విచారణ వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తేలితే.. ఆ బాధ్యతను నేరుగా సంబంధిత అథారిటీల ముఖ్య కార్యనిర్వహణాధికారుల మీదే నిర్ధారిస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీచేసింది.


భవనాలు కూలిపోవడం, అగ్నిప్రమాదాలు జరిగిన తర్వాత అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోని తమ సొంత అధికారులపై చర్యలకు ఉపక్రమించకుండా.. కేవలం బిల్డర్లనే అరెస్ట్ చేయడం ద్వారా అధికారులు పరువు నిలుపుకునే వైఖరిని అవలంబిస్తున్నారన్న అమికస్(కోర్టు నియమించిన న్యాయవాది) వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. సదరు వైఫల్యాలకు బాధ్యులైన వారి పేర్లను తమ నివేదికలలో పొందుపరచాలని అధికారులను ఆదేశించింది.


ఇవీ చదవండి:

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

రూ.440 కోట్ల టీఎంసీ డిపాజిట్లు ఫ్రీజ్‌

Updated Date - Jul 09 , 2026 | 03:35 PM