'బంగారం తీసుకోండి.. మమ్మల్ని వదిలేయండి'.. వేడుకున్నా కనికరం చూపని దుండగులు..
ABN , Publish Date - Jul 09 , 2026 | 03:27 PM
బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం(జూన్ 5న) రాత్రి భయానక ఘటన వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఓ కారులో ప్రయాణిస్తున్న కుటుంబంపై కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై బాధితుడు సాగర్ కుమార్ స్పందిస్తూ ఆ రోజు జరిగిన భయానక ఘటన గురించి వివరించాడు.
కర్ణాటక: ఆదివారం(జూన్ 5న) రాత్రి బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబంపై కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధిత కుటుంబం ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే, బాధితుడు సాగర్ కుమార్ ఆ రోజు రాత్రి జరిగిన భయానక ఘటన గురించి వివరించాడు.
'నాపై, నా భార్యపై, మా 10 నెలల చిన్నారిపైనా కొంత మంది వ్యక్తులు దాడి చేశారు. వారి దాడి నుంచి రక్షించేందుకు నా భార్య తీవ్రంగా ప్రయత్నించింది. ఆమె చేతులు జోడించి, 'నా బంగారం తీసుకోండి.. మా వద్ద ఉన్నదంతా తీసుకెళ్లండి.. కానీ మమ్మల్ని వదిలేయండి' అని వేడుకుంది. అయినా వారు కనికరం చూపలేదు. నన్ను కారు నుంచి బయటకు లాగి దారుణంగా కొట్టారు' అని సాగర్ ఆవేదన వ్యక్తం చేశాడు. దాడి సమయంలో తన భార్య అడ్డుకునేందుకు ప్రయత్నించినా, మరో వాహనంలో ఉన్న వ్యక్తి జోక్యం చేసుకున్నా దుండగులు దాడిని కొనసాగించారని బాధితుడు తెలిపాడు.
తమ కుటుంబం అదృష్టం కొద్దీ వెనుక వస్తున్న వాహనం డ్యాష్‌క్యామ్‌లో ఘటన మొత్తం రికార్డు కావడంతోనే నిజాలు బయటపడ్డాయని సాగర్ చెప్పాడు. 'ఆ వీడియో లేకపోయి ఉంటే మాకు న్యాయం జరిగేదో లేదో తెలియదు. జాతీయ రహదారులపై ఇలాంటి ఘటనలు ఆధారాలు లేకుండా ఎన్నో జరుగుతున్నాయి. బాధితులకు న్యాయం జరగాలంటే మరిన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, పర్యవేక్షణను బలోపేతం చేయాలి' అని సాగర్ సూచించాడు.
కాగా, ఈనెల 5న మండ్య జిల్లా మద్దూరు సమీపంలోని బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై సాగర్ కారు, మరో వాహనం స్వల్పంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో సాగర్‌తో సుమారు 9 మంది యువకులు వాగ్వాదానికి దిగారు. అనంతరం అతనిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
రూ.440 కోట్ల టీఎంసీ డిపాజిట్లు ఫ్రీజ్