Share News

పెట్రోల్ కావాలంటే ఇకపై క్యాష్ తీసుకెళ్లాల్సిందే.! ఛార్జీల ప్రకటనతో యూపీఐ సేవలు పరిమితం.?

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:45 PM

కేంద్రం యూపీఐ ఎండీఆర్ ఛార్జీలకు తెరలేపడంతో పెట్రోల్ బంకులు నగదు చెల్లింపులు పెంచేందుకు సిద్ధమయినట్టు తెలుస్తోంది. బిల్లు రూ.2000 దాటితే నగదులోనే చెల్లించాలని, యూపీఐ అసలు అంగీకరించబోమని అవి హెచ్చరిస్తున్నట్టు సమాచారం.

పెట్రోల్ కావాలంటే ఇకపై క్యాష్ తీసుకెళ్లాల్సిందే.! ఛార్జీల ప్రకటనతో యూపీఐ సేవలు పరిమితం.?
UPI Payments

ఇంటర్నెట్ డెస్క్: యూపీఐ ఛార్జిల ప్రకటన ప్రభావం దేశంలో అక్కడక్కడా మార్పు మొదలైనట్టు కనిపిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో పెట్రోల్ పంప్ డీలర్లు వాహనదారులకు ఒక హెచ్చరిక జారీ చేసినట్టు సమాచారం. రూ.2000 కంటే ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేస్తే చెల్లింపు నగదులోనే ఉండాలని, ఇలాంటి సందర్భాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ యూపీఐ చెల్లింపులు అంగీకరించబోమని వారు తేల్చి చెబుతున్నట్టు తెలుస్తోంది.


ఇటీవలే యూపీఐ చెల్లింపులపై కేంద్రం ఛార్జీలు, జీఎస్‌టీ విధింపు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. రూ.2000 కంటే ఎక్కువ ఉన్న వాణిజ్య యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీని ప్రభుత్వం ప్రతిపాదించింది. అక్టోబర్ 15 నుంచి ఈ ఛార్జీలు అమలవుతాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకులకు ఎండీఆర్‌ నుంచి మినహాయింపు కావాలని ఆల్ఇండియా పెట్రోల్ పంప్ డీలర్ల సంఘం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే దీనిపై ప్రభుత్వం స్పందించలేదు.


అందుకే పెట్రోల్ డీలర్లు రూ.2000 మించితే యూపీఐ చెల్లింపునకు ‘నో’ అంటున్నారు. నగరు రూపంలోనే చెల్లించాలని పట్టుబడుతున్నారు. త్వరలో దేశమంతటా ఈ విధానం వ్యాపిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. యూపీఐ ట్రాన్సాక్షన్స్‌కు బాగా అలవాటు పడిపోయిన వినియోగదారులకు ఇది ఇబ్బందికరంగా మారవచ్చు. ఛార్జీల ప్రతిపాదన వ్యాపారుల్లో ఆందోళనకు దారితీసింది. పెట్రోల్ డీలర్లలో అయితే ఈ ఆందోళన కాస్తంత ఎక్కువగానే ఉంది. ఓవైపు నిర్వహణ ఖర్చుల పెరుగుదల, మరోవైపు తగ్గని ముడిచమురు ధరలు నడుమ ఎండీఆర్ పేరిట విధించే ఈ అదనపు ఛార్జీలను తాము భరించలేమని వాపోతున్నారు. ఈ తరుణంలో తాము నగదు చెల్లింపునకే పరిమితం కావడానికి సిద్ధమయ్యామని తెలిపారు.


ఈ వార్తలూ చదవండి

రూ.2వేలు దాటితే యూపీఐ చెల్లింపులు కుదరదంటున్న ఉత్తర్ ప్రదేశ్ వ్యాపారులు..

హైవేలపై పశువులు తిరిగితే యజమానులకు ఫైన్‌

Updated Date - Sep 19 , 2026 | 01:06 PM