Share News

రోడ్డు కావాలని అడిగిన ప్రజలు.. కేంద్ర మంత్రి సింధియా రియాక్షన్ వైరల్..

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:28 PM

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని గుణ మున్సిపాలిటీ ప్రజలు కేంద్ర మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో వివాదానికి తెరలేసింది. రోడ్డు కావాలని అడుగుతూ, రోడ్డు వేయకపోతే ఓటు వేయబోమంటూ స్థానికులు చెప్పిన తీరుపై కేంద్ర మంత్రి ఆగ్రహించారు.

రోడ్డు కావాలని అడిగిన ప్రజలు.. కేంద్ర మంత్రి సింధియా రియాక్షన్ వైరల్..
Union Minister Jyotiraditya Scindia

మధ్యప్రదేశ్‌: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని గుణ మున్సిపాలిటీ ప్రజలు కేంద్ర మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో వివాదానికి తెరలేసింది. రోడ్డు కావాలని అడుగుతూ, రోడ్డు వేయకపోతే ఓటు వేయబోమంటూ స్థానికులు చెప్పిన తీరుపై కేంద్ర మంత్రి ఆగ్రహించారు. చివరికి రోడ్డు మంజూరు చేసినప్పటికీ, ఆయన వారితో మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చకు తెరలేపింది.


కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుణ మీదుగా వెళ్తున్నారు. కేంద్ర మంత్రి వస్తున్న విషయాన్ని తెలుసుకున్న స్థానికులు ఆయన కాన్వాయ్‌ను అడ్డగించారు. తమ ప్రాంతంలో చాలా కాలంగా రోడ్డు సమస్య పెండింగ్‌లో ఉందని.. వెంటనే నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు ‘రోడ్డు లేదు.. ఓటు లేదు’ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే ఎన్నికల సమయంలో ఓటు వేయబోమని ఓ స్థానికుడు సింధియాకు స్పష్టం చేశారు.


ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సింధియా తీవ్రంగా స్పందించారు. ‘నాతో ఎప్పుడూ ఈ భాషలో మాట్లాడొద్దు. అర్థమైందా?.. మీరు వచ్చి అభ్యర్థన చేయండి. పని చేయించడం నా బాధ్యత’ అంటూ సమాధానం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయ్యింది. దీంతో రోడ్డు సమస్యతో పాటు కేంద్ర మంత్రి, స్థానికుల మధ్య వాగ్వాదం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వివాదం జరిగిన అరగంటకే రోడ్డు నిర్మాణానికి సంబంధించి సింధియా కీలక ప్రకటన చేశారు.


కేంద్ర మంత్రి బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గుణ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్యా నిధుల నుంచి వీటిని కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. వర్షాకాలం ముగిసిన అనంతరం రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను సింధియా ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. నిరసనకు దిగిన తోటి విద్యార్థులు..

రూ.2వేలు దాటితే యూపీఐ చెల్లింపులు కుదరదంటున్న గాజియాబాద్‌ వ్యాపారులు..

Updated Date - Sep 19 , 2026 | 12:32 PM