Share News

పార్లమెంట్‌లో గందరగోళంపై కేంద్రం సమాలోచనలు.. ప్రత్యేక సమావేశాలకు ఛాన్స్!

ABN , Publish Date - Aug 05 , 2026 | 03:15 PM

పార్లమెంట్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. మరోవైపు ఈ సమావేశాలు సజావుగా సాగనందున.. త్వరలోనే ప్రత్యేక సమావేశాలు నిర్వహించే దిశగా కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం.

పార్లమెంట్‌లో గందరగోళంపై కేంద్రం సమాలోచనలు.. ప్రత్యేక సమావేశాలకు ఛాన్స్!
Kiren Rijiju meets with Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు కేంద్రం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షాల నినాదాల మధ్య లోక్‌సభ సమావేశమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడిన అనంతరం.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు భేటీ అయ్యారు. పార్లమెంట్ హౌస్‌లోని రాహుల్ ఛాంబర్‌లో సుమారు 50 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. రాహుల్‌తో పాటు కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, గౌరవ్ గొగోయ్ తదతర ముఖ్యులు పాల్గొన్నారు.


ఆ అభ్యర్థనను తిరస్కరించిన రాహుల్

ఈ భేటీలో వివాదాస్పద డీలిమిటేషన్ బిల్లు, ఫారిన్ కంట్రిబూషన్ రెగ్యులేటింగ్ యాక్ట్(FCRA) సవరణ బిల్లుపై ప్రధానంగా చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే.. రిజిజు అభ్యర్థనను రాహుల్ పూర్తిగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయోధ్య రామ మందిరంలో జరిగిన విరాళాల చోరీ ఆరోపణలపై చర్చ, అలాగే ఢిల్లీలో జులై 20న జరిగిన నిరసనల సందర్భంగా విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించి హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేసే వరకు సభలో కార్యకలాపాలను అడ్డుకుంటామని రిజిజుతో రాహుల్ చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాహుల్‌తో భేటీ అనంతరం కిరణ్ రిజిజు.. కేంద్ర హోం మంత్రి అమిత్ ‌షాతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత అఖిలేష్ యాదవ్‌ సహా ఇతర విపక్ష నేతలతోనూ రిజిజు భేటీ అయ్యే అవకాశముంది. సభ సజావుగా సాగేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధానంగా దృష్టి సారించిన కేంద్రం.. ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది.


కాగా.. జులై 20న వర్షాకాల సమావేశాలు ప్రారంభమై నేటికి 13వ రోజుకు చేరగా.. ఇప్పటివరకు ప్రశ్నోత్తరాలకు సమయం కేటాయించకపోవడం గమనార్హం. ఈ నిరసనలపై సభాపతి ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్లకార్డులతో వెల్‌లోకి రావడం సభా గౌరవానికి మంచిది కాదని హితవు పలికారు. అయితే.. సభలో గందరగోళం మధ్యే ఎలాంటి చర్చలు లేకుండా 5 కీలక బిల్లులు ఆమోదం పొందాయి.


ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల దిశగా..

ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు సజావుగా సాగనందున కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించే దిశగా యోచిస్తున్నట్టు సమాచారం. డీలిమిటేషన్ బిల్లుపై చర్చించేందుకు ఈ స్పెషల్ సెషన్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఈ నెల 16, 17, 18వ తేదీల్లో ప్రత్యేక సెషన్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రత్యేక సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశముంది.


ఇవీ చదవండి:

'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్‌ జీకి రూ.2 వేల కోట్లు

Updated Date - Aug 05 , 2026 | 03:19 PM