అసలు పనీర్‌కు, ఆర్టిఫిషియల్ పనీర్‌కు తేడా ఏంటి? ఎలా గుర్తించాలి?
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:19 AM
నాన్‌డెయిరీ లేదా ఆర్టిఫిషియల్ పనీర్‌పై మహారాష్ట్ర నిషేధం విధించడంతో ఈ ఉత్పత్తిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరలకు లభించే పనీర్ విషయంలో అప్రమత్తంగా ఉండటం సహా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సంప్రదాయ పాలతో తయారయ్యే పనీర్‌కు ప్రత్యామ్నాయంగా వస్తున్న పాలేతర పనీర్(Non-Dairy/Analogue Paneer) తయారీ, విక్రయం, నిల్వ, పంపిణీపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అంతకుముందు ఛత్తీస్‌గఢ్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్య పరిరక్షణ సహా వినియోగదారులను తప్పుదోవ పట్టించే మార్గాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
అయితే భారత ఆహార భద్రతా ప్రమాణాల(FSSAI) నిబంధనల ప్రకారం.. సరైన లేబుల్‌తో చట్టబద్ధంగా ఆర్టిఫిషియల్ పనీర్‌ను విక్రయించవచ్చు. కానీ.. కొన్ని చోట్ల దీన్ని సంప్రదాయ మిల్క్ పనీర్‌గా అమ్ముతూ.. వినియోగదారులను మోసం చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీనిని అరికట్టేందుకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఏంటీ ఆర్టిఫిషియల్/అనలాగ్ పనీర్?
సాధారణ పనీర్‌ను తాజా పాలను నిమ్మరసం లేదా సిట్రిక్ యాసిడ్‌తో గడ్డకట్టించి తయారు చేస్తారు. కానీ ఆర్టిషిఫియల్ పనీర్‌ను పామాయిల్ లాంటి వృక్షజన్య కొవ్వులు, పాలపొడి, మిల్క్ సాలిడ్స్, స్టార్చ్, ఎమల్సిఫైయర్లు వంటి పదార్థాలతో తయారు చేస్తారు. దీని రూపు, రుచి, ఆకారం అచ్చం అసలు పనీర్‌లాగే ఉండేలా తయారుచేస్తారు. దీని తయారీకి ఖర్చు తక్కువ. కాబట్టి మార్కెట్‌లోనూ దీని ధర కూడా తక్కువే.
ఎందుకు నిషేధం?
మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) ప్రకారం.. ఆర్టిఫిషియల్ పనీర్‌ను మిల్క్ పనీర్‌గా విక్రయించడం ఆహార భద్రతా ప్రమాణాల చట్టం-2006కు విరుద్ధం. ఇది వినియోగదారులను మోసం చేయడమే కాకుండా వారి ఆహార ఎంపికపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష సహా జరిమానా విధించే అవకాశముంది.
అసలు పనీర్‌కు, ఆర్టిఫిషియల్ పనీర్‌కు తేడా ఏంటి?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. సంప్రదాయ పనీర్‌లో ప్రధానంగా పాలలోని సహజ పోషకాలుంటాయి. ఆర్టిఫిషియల్ పనీర్‌లో వృక్షజన్య నూనెలు, స్టార్చ్ వంటి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇందులో ప్రొటీన్, విటమిన్ బీ12, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు మిల్క్ పనీర్‌తో పోలిస్తే చాలా తక్కువ. పామాయిల్ వినియోగం వల్ల సంతృప్త కొవ్వుల(Saturated Fat) మోతాదు ఎక్కువగా ఉంటుంది.
ఆర్టిఫిషియల్ పనీర్‌ను గుర్తించడమెలా?
లేబుల్ పరిశీలించడం, ప్యాకెట్‌పై ఉండే పదార్థాల జాబితా ద్వారా అసలు పనీర్, ఆర్టిఫిషియల్ పనీర్‌లను గుర్తించవచ్చని నిపుణుల సూచిస్తున్నారు. సాధారణ పనీర్‌లో.. పాలు, సిట్రిక్ యాసిడ్ వంటి పదార్థాలు ఉండగా, ఆర్టిఫిషియల్ లాగ్ పనీర్‌లో.. పామాయిల్, ఇతర వృక్షజన్య నూనెలు, స్టార్చ్ ఉంటాయి. పనీర్‌పై కొద్దిగా అయోడిన్ ద్రావణం వేస్తే నీలం రంగులోకి మారితే అందులో స్టార్చ్ ఉండే అవకాశం ఉంది. కానీ ఇది స్టార్చ్‌ను మాత్రమే గుర్తిస్తుంది. దీంతో అది కచ్చితంగా ఆర్టిఫిషియల్ పనీర్ అని నిర్ధారించలేం. అలాగే రేటు, ఆకారం ద్వారా కూడా వీటిని గుర్తించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్టిఫిషియల్ పనీర్ ధర చాలా తక్కువ, ఆకారంలో కాస్త రబ్బరు మాదిరిగా ఉండి, నమిలేటప్పుడు ఎక్కువ గట్టిగా ఉంటుంది. అయితే.. కేవలం ఈ లక్షణాల ఆధారంగానే తుది నిర్ణయానికి రాలేమని నిపుణలు చెబుతున్నారు.
వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
విశ్వసనీయమైన డెయిరీలు, గుర్తింపు పొందిన సంస్థల నుంచే పనీర్‌ను కొనుగోలు చేయాలి.
ప్యాకెట్‌పై ఉన్న పదార్థాల వివరాలను తప్పనిసరిగా చదవాలి.
తక్కువ ధరలో లభించే పనీర్ ఉత్పత్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
వీలైనంత వరకు తాజా పాలతో ఇంట్లోనే పనీర్ తయారుచేసుకోవడం ఉత్తమం.
మొత్తంగా.. సరైన లేబుల్, హైజినిక్ మ్యానుఫ్యాక్చరింగ్, విశ్వసనీయ బ్రాండ్ ఎంపికే సురక్షితమైన మార్గం.
గమనిక: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఇవీ చదవండి:
గ్యాస్ట్రిక్ సమస్య.. ఈ పొరపాట్లే కారణం!
లేట్ నైట్ డిన్నర్.. కాలేయ ఆరోగ్యానికి ముప్పు తప్పదా?