2029 ఎన్నికల నాటికి వన్ నేషన్ వన్ ఎలక్షన్?
ABN , Publish Date - Nov 29 , 2026 | 08:26 PM
పార్లమెంటులో మరోసారి ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ బిల్లు తర్వాత కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేయనుందని రాజకీయ, ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంటులో మరోసారి ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ బిల్లు తర్వాత కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేయనుందని రాజకీయ, ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం తర్వాతి ప్రతిపాదన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అని భావిస్తున్నాయి. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్న లక్ష్యంతో కేంద్రం అడుగులు వేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ అంశానికే కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న డీలిమిటేషన్ కమిషన్ రెండేళ్లలో తన నివేదికను సమర్పించగలదా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటివరకూ ఐదు కమిషన్లు
దేశంలో ఇప్పటివరకు ఐదు డీలిమిటేషన్ కమిషన్లను ఏర్పాటు చేశారు. తొలిసారిగా 1952లో ఏర్పాటు చేసిన కమిషన్ 1951 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేసింది. దీంతో లోక్‌సభ స్థానాల సంఖ్య 498గా, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల సంఖ్య 3,280గా నిర్ణయించారు. 1963లో ఏర్పాటైన రెండో కమిషన్ లోక్‌సభ స్థానాల సంఖ్యను 522కు, అసెంబ్లీ స్థానాలను 3,771కు పెంచింది. 1973లో నియమించిన మూడో కమిషన్ 1971 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేపట్టి లోక్‌సభ స్థానాలను 522 నుంచి 543కు పెంచింది. రాష్ట్రాల శాసనసభ స్థానాల సంఖ్య 3,997కు చేరింది. నాలుగో డీలిమిటేషన్ కమిషన్‌ను 2002లో జస్టిస్ కుల్దీప్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ 2001 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకున్నా... లోక్‌సభ స్థానాల సంఖ్యను మాత్రం పెంచలేదు. అవి 543గానే కొనసాగాయి. అయితే రాష్ట్రాల అసెంబ్లీ సంఖ్యను 3,997 నుంచి 4,123కు పెంచింది. జస్టిస్ కుల్దీప్ సింగ్ నేతృత్వంలోని కమిషన్ 2007 డిసెంబర్లో తన నివేదికను సమర్పించింది. 2008లో రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ఆ సిఫారసులు అమల్లోకి వచ్చాయి. తొలిసారిగా 2008 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సిఫారసులను అమలు చేశారు. ఇక 2022లో జమ్మూకశ్మీర్‌లో, 2023లో అసోంలోనూ నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టారు.
తాజా కమిషన్ కూర్పు ఇలా..
కొత్తగా ఏర్పాటు చేసే డీలిమిటేషన్ కమిషన్‌కు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షత వహిస్తారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా ఆయన నామినేట్ చేసిన ఎన్నికల కమిషనర్‌తో పాటు, సంబంధిత రాష్ట్రానికి చెందిన ఎన్నికల కమిషనర్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్రాలవారీగా డీలిమిటేషన్ చేపట్టే క్రమంలో కమిషన్‌లో మార్పులు ఉంటాయి. ఇవే కాకుండా ప్రతి రాష్ట్రానికి పది మంది అసోసియేట్ సభ్యులను నియమిస్తారు. వారిలో ఐదుగురు లోక్‌సభ సభ్యులను స్పీకర్ నామినేట్ చేస్తారు. మరో ఐదుగురు ఎమ్మెల్యేలను సంబంధిత రాష్ట్ర శాసనసభ స్పీకర్ నియమిస్తారు. ఈ సభ్యులు కూడా రాష్ట్రాలవారీగా మారుతుంటారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!
స్టాలిన్‌కు రాహుల్ విజ్ఞప్తి.. ‘కట్టబొమ్మన్’లా నిలబడతామన్న స్టాలిన్